‘ఏమే హారికా, సాయంత్రం నా బర్త్‌డే పార్టీకి రానన్నావట’ లంచ్‌ అవర్‌ టైంలో ఫోన్‌ చేసి హారికను అడిగింది క్లాస్‌మేట్‌ మధు.. మధుమిత.‘ఔనే....! ఎందుకో రావాలనిలేదు. సారీనే...!’ మెల్లిగా చెప్పింది హారిక.‘ఒసేవ్‌, నిన్ను చంపేస్తాను...! అయినా నా పుట్టినరోజు పార్టీకి రాననడానికి నీకెన్ని గుండెలు? సాయంత్రం ఇంటికి కారు పంపిస్తాను. నోరుమూసుకుని రా... తెలిసిందా’ నవ్వుతూ అంది మధు.‘సారీ మధూ... ప్లీజ్‌ ఈ ఒక్కసారికి నా మాట విను, బంగారు తల్లివి కదూ’ బ్రతిమాలుతూ అంది హారిక.‘సారీ...గీరీ... జాంతానై... నువ్వు వస్తున్నావు అంతే’ ఖచ్చితంగా ఆర్డర్‌ వేస్తున్నట్టు అంది మధు.‘నేను వచ్చినా ఎంజాయ్‌ చెయ్యలేను. నువ్వు అప్‌సెట్‌ అవుతావు. అందుకే రానంటున్నాను. నా మంచి మధూ కదూ...! నేను చెప్పినమాట వింటుం దట’ నవ్వుతూ అంది హారిక.‘నువ్వు ఎంత మూడీగానైనా ఉండు, నాకేం పర్వాలేదు. కాదంటవా, మన స్నేహానికున్న విలువ ఇంతే అనుకుని ఇంక నిన్ను బలవంతపెట్టను’’ బ్రహ్మాస్త్రం వేస్తూ అంది మధు.

‘అయ్యో దయచేసి నువ్వలా మాట్లాడకు. నేను ఈరోజు ఓ పెద్ద కాలేజీలో ఎంబీఏ చేస్తున్నానంటే అదంతా నీ మంచితనమే. అయినా ఎందుకో రాబుద్ధి కావడం లేదు’ ఆమెకు మరోసారి నచ్చచెబుతూ అంది హారిక.‘పోనీ నువ్వు ఎందుకు రానంటున్నావో చెప్పు, ఇంక నిన్నేమీ అడగను’ బుంగమూతి పెడుతూ అంది మధు.‘ఏమిటోనే పార్టీకి గొప్పగొప్ప వాళ్ళు అందరూ వస్తారు. ముఖ్యంగా ఆ అభిరామ్‌ వస్తాడు. నాకది ఇష్టం లేదు. అందుకే రానంటున్నాను, అర్థం చేసుకో ప్లీజ్‌!’ బ్రతిమాలుతూ అంది హారిక.‘ఓ అదా నీ భయం. అయినా అభిరామ్‌ వస్తే నీకేంటి ప్రాబ్లం. అతను నిన్నేమీ కొరుక్కుతినడు.

హారికా ఇంకో ముఖ్యవిషయం. ఈ సంవత్సరంతో నా చదువు పూర్తైపోతుంది. వెంటనే బావతో నా పెళ్ళి. అందుచేత వచ్చే సంవత్సరం నేను ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. కాబట్టి నువ్వు ఇంకేం మాట్లాడకుండా పార్టీకి రా.. అభి సంగతి నేను చూసుకుంటాను.’ అని ఆమెచేత ఒప్పించిన మధు ఆలోచనల్లో పడింది. ఆ అభి హారికతో ఓరోజు సడన్‌గా ‘నిన్ను ప్రేమిస్తున్నా, ఐ లవ్‌యూ.... ఒప్పుకుంటే పెళ్ళి చేసుకుంటాను అన్నాడట. దానికే ఆ పిచ్చిది పాపం భయపడిపోయింది. అయినా అభి.. అభిరామ్‌ గురించి హారిక పూర్తిగా తెలుసుకోకుండానే అలా మాట్లాడింది. అసలు అభి ఎవరో, ఏంటో తెలిస్తే అది అలా మాట్లాడేదికాదు సరికదా, ఎగిరి గంతేసి మరీ అతన్ని, అతని ప్రేమను ఒప్పుకునేది. ఓ భగవంతుడా! అభిని అర్థం చేసుకునే మంచి బుద్ధి హారికకు ప్రసాదించు తండ్రీ’ అని ప్రార్థించింది మఽధు.