అమ్మూ! ఏంట్రా... యింత రాత్రి వేళ ఫోన్‌చేశావ్? అదేంటమ్మా మాట్లాడకుండా అలా ఎక్కిళ్ళు పెట్తున్నావ్? నన్ను చూడాలని ఉందా! బలే దానివి - మొన్న వీకెండ్‌కే కదరా వచ్చి వెళ్ళాను - యింకా మూడ్రోజులు కూడా కాలేదు! సరే.... సరే...! నువ్వలా ఏడ్వకు. మీ అమ్మ కివ్వు ఫోన్. ఏంటి కిన్నెర యింట్లో లేదా?! యింత రాత్రివేళ నిన్ను ఒంటరిగా వదిలి ఎక్కడ కెళ్ళింది? తనూ, వికాస్ ఏదో కంపెనీ డిన్నర్కి వెళ్ళారా! ఓకే అమ్మూ! నువ్వేం వర్రీ అవకు. నేను రెండ్రోజుల్లో హైదరాబాద్ వస్తాను నీ దగ్గరికి. సరేనా... బంగారు తల్లీ! యింక ఏడ్పుమాని పడుకో, బీ బ్రేవ్ మై చైల్డ్...’’ అంటూ ఫోన్ పెట్టేసిన వినోద్, ఆలోచనలో పడిపోయాడు.మొన్న వీక్ ఎండ్‌కి వెళ్ళినప్పుడే అమూల్య చాల డల్‌గా వుండడం గమనించాడు. ‘‘ఏంటమ్మా!’’ అంటే, ‘‘ఏం లేదు నాన్నా - చాలాబోర్‌గా వుందిక్కడ, నువ్వు వచ్చావు కదా - యింక హ్యాపీ’’ అంటూ, హైదరాబాద్‌లో తానున్న ఆ రెండు రోజులు వెంటబడి ఓషన్ పార్క్, ఐమాక్స్, ఈట్ స్ర్టీట్ అంటూ వుషారుగా తిరిగింది. తనకే యిలా తరచు బెంగుళూరు నుండి హైదరాబాద్ వచ్చి హోటల్‌లో స్టే చేసి కూతురితో గడపడం యిబ్బందిగా వుంటోంది. కానీ తప్పడం లేదు.కిన్నెర, వికాస్‌ని పెళ్ళిచేసుకున్నాక, తనతో పొడిపొడి బాంధవ్యం తప్ప మరే విధమైన అను బంధం కొనసాగించలేక పోయింది. నిట్టూర్చిన వినోద్, గత స్మృతులను నెమరు వేసుకోవటం నిరుపయోగమైన, ఆ స్మృతులలోంచి బయట పడలేక పోతున్నాడు.
వినోద్‌లది ప్రేమ వివాహం. ఇద్దరూ బెంగుళూరులోని ఓ ఐటీ కంపెనీలో పని చేసే వారు. ఇద్దరి పని వేళలు ఒకటే కావడంతో వాళ్ళిద్దరి మధ్య కొంత సాన్నిహిత్యం, మిత్రత్వం పెరిగింది. కిన్నెరది చెన్నై. ఆ అమ్మాయికి కన్నడం అసలు వచ్చేది కాదు. వినోద్ది విజయవాడ. బెంగుళూరులో రెండేళ్ళుగా పని చేస్తుండడం వల్ల వినోద్‌కి కన్నడం కొంత రాయడం, మాట్లాడడం వచ్చింది. కన్నడం మాట్లాడే వారితో కిన్నెరకేమయిన ప్రాబ్లమ్ వస్తే వినోద్ హెల్ప్ చేసేవాడు, టీజ్ చేస్తూ. తను వుడుక్కుంటూ ‘‘మీకన్నా బాగా మాట్లాడడం ఇట్టే నేర్చుకుంటాను చూడండి...’’ అంటూ చేసి చూపింది కిన్నెర. పరస్పరం అలవాట్లు, అభ్రిపాయాలు కలవడంతో ఒకరినొకరు యిష్టపడి పెద్దల అంగీకారంతో కొంతకాలానికి పెళ్ళి చేసుకున్నారిద్దరూ.పెళ్ళయిన సంవత్సరానికి వాళ్ళ జీవితంలోకి వసంతంలా ప్రవేశించింది అమూల్య. ముద్దులు మూటకట్టే కూతురినిచూసి మురిసిపోయారు వినోద్ కిన్నెరలు. వాళ్ళ మురిపాలను, సంతోషాలను చూసి ఎవరి కళ్ళు కుట్టాయో, ఏ దిష్టి తగిలిందో, అనుకోకుండా కిన్నెరకి హైదరాబాద్‌కి ట్రాన్స్ఫర్ అయింది. పాప తోటి ఎలాగ అన్న ప్రశ్నకి సమాధానమూ అన్నట్లు, వినోద్ తండ్రి రంగారావు అకస్మాతుగా మరణించడంతో, తల్లి కమలమ్మ కొడుకు దగ్గరికి వచ్చింది. భార్యాభర్తల ఎడబాటు బాధాకరంగానే వుంది. కానీ, తప్పదు కదా!