భర్త తాగుబోతు అని తెలిసినా భరిస్తుంది. జూదరి అని తెలిసినా భరిస్తుంది కాని,అగ్నిసాక్షిగా తనని పెళ్ళాడిన వాడు, పరాయిస్త్రీ పొందుకోసం పరితపిస్తున్నాడంటే మాత్రం ఏ ఆడదీ భరించలేదు. మెడలో తాళికట్టనంత వరకే, కట్టిన తర్వాత ఆ తాళి కట్టిన వాణ్ణి తన సొంతం అనుకుంటుంది స్త్రీ.ఆ నమ్మకంతోనే జీవిస్తుంది.

భర్త చక్రధర్‌ను పరిపూర్ణంగా విశ్వసించిన వైశాలి, మగడిపై ఆ అపప్రధను నమ్మలేకపోయింది. అటెండర్‌ విస్సు చెప్పిన మాటలకు దిగ్ర్భాంతికి గురైంది. పది సంవత్సరాల దాంపత్య జీవితంలో భర్తపై ఎటువంటి అనుమానాలూ లేవు. అందమైన చిత్రంలాంటిది వారి దాంపత్యం. అలాంటి చిత్రం హఠాత్తుగా అలుక్కుపోయినట్టుగా, వెలిసిపోయినట్టుగా అయింది.ఈ మధ్య చక్రధర్‌ వేళదాటి వస్తుంటే ఫ్రెండ్స్‌ సర్కిల్‌ ఎక్కువైందనుకుంది. లేదా ఆఫీ సులో పని ఒత్తిడి వల్ల లేటయిందనుకునేది. కాని ఇలా పైలాపచ్చీసు తిరుగుళ్ళని లేశ మాత్రమైనా ఊహించలేకపోయింది.మోటారు బైక్‌ చప్పుడుకి తేరుకుంది వైశాలి. ఈలవేసుకుంటూ లోనికి వచ్చాడు చక్రధర్‌. ముఖంలో భావాలను ఏ మాత్రం కనబడనీయకుండా ఎదురెళ్ళిందతనికి.‘‘పాపం! ఆఫీసు వర్కు వల్ల ఆలస్యమైపోయింది కదూ!’’ అంది చేతిలోంచి క్యారేజీ బ్యాగ్‌ తీసుకుంటూ.‘‘బోడి పని ఎప్పుడూ ఉండేదే కాని.... బోరు కొట్టిందని అలా సినిమాకెళ్ళి వచ్చా?’’‘‘మగమహరాజులు, మీకేం? ఏ ఫ్రెండ్స్‌తోనైనా ఎక్కడికైనా వెళ్ళగలరు’’‘‘ఫ్రెండ్సా పాడా? నేను ఒక్కణ్ణే వెళ్ళాను వినీలా.’’‘‘వినీలా? అదెక్కడి పేరు? నా పేరు కూడా మరచిపోయారా మహాశయా?!’’‘‘స....స్స...సారీ...ఏదో పొరపాటుగా...’’‘‘మరీసారయినా సారీలు చెప్పాల్సిన అవసరం రాకుండా పేరు బాగా గుర్తుపెట్టుకోండి... మనసావాచా కర్మణా మీరు తాళికట్టిన అర్థాం గిని... నా పేరు వైశాలి. నేను మీ వైశాలిని..’’‘‘కరెక్ట్‌ వైశాలీ!’’ అని లోనికి వెళ్ళి బట్టలు మార్చుకున్నాడు చక్రధర్‌. బాత్రూంలోకి వెళ్ళాడు.అదే అవకాశంగా భర్త జేబులు వెతికింది వైశాలి.

అందులో రెండు సినిమా టిక్కెట్లున్నాయి. అంటే...చక్రధర్‌ ఒక్కడూ వెళ్ళలేదు. ఇంకెవరితోనో కలసి వెళ్ళాడనుకుంది. చేతిలో టిక్కెట్లనే తేరిపార చూస్తూ నిల్చుంది వైశాలి. అంతలో బాత్రూంలో నుంచి బయటపడ్డాడు చక్రధర్‌.‘‘ఇవెన్ని టిక్కెట్లు?’’ అడిగింది.‘‘ఒక్కటే’’ ధీమాగా అన్నాడు చక్రధర్‌.‘‘ఒకటి కాదు, రెండు.’’‘‘రెండా? అవునవును, మరచిపోయాను. ఒకా విడ ఎవరో తనకీ ఓ టిక్కెట్‌ తీయమంటే తీశాను. ఆదీ...అదే ఆ ముక్క...’’‘‘ఆవిడ పేరు వినీలా?’’ కోపంగా అడిగింది వైశాలి.‘‘నోనో కాదు, వినీలా లేదు, వెనీలా లేదు. అయినా ఏదో ఊసుపోక సినిమాకి వెళ్తే ఎందుకు అన్ని అనుమానాలు? కోపాలు?’’‘‘మీరు ఒక్కరూ వెళితే నాకెందుకు కోపం? మీరు మరెవరితోనో కలిసి వెళ్ళారంటేనే కోపంగా ఉంది.’’‘‘లేదు డియర్‌! నా మాట నమ్ము. ఏదో నోరు జారింది, వినీలా అని నోటి వెంట ఎందుకొచ్చిందో వచ్చింది. దాని కోసం ఇంత రాద్ధాంతమా?’’