‘‘ఇంకా బతుకుతాడనే’’‘‘ఆశ చావదుగదా!’’‘‘నీలోనా? రోగిలోనా?’’‘‘ఎట్లా అనుకున్నా ఫర్వాలేదు’’‘‘నువ్వింతే’’‘‘కారణం నువ్వే కదా! నువ్వేం తక్కువ తిన్నావా? ఆ మధ్య నిమోనియా పేషెంట్ దగ్గర ఇరవై నాలుగు గంటలూ కూర్చున్నావ్ గదా?’’‘‘నేనంటే... నేనంటే...’’‘‘మగ మహారాజులు. అంతేనా?’’ రోగి బి.పి. చూస్తూ అన్నాను నేను.మౌనం.... వాతావరణంలో నిస్సంగత... నిశ్శబ్దత. అటవీ ప్రాంతంలో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అది. ఆ ప్రాంతమంతా ఏపుగా పెరిగిన వృక్ష సంపద.కరువులాంటి చీకటి రాత్రి.అడవి జంతువుల శబ్దాలు దూరంగా...లేళ్ళు, పొదలమాటున గంతులేస్తున్నట్టున్నాయి.కుందే ళ్ళు ఒక పొదనుండి మరో పొదకు గునగునా పరుగులు తీస్తున్నట్టున్నాయి. రకరకాల చిత్ర విచిత్ర ధ్వనులతో ఆ చీకటి రేయి కచేరీ చేస్తున్నట్టుంది.అసహనంగా అటూ ఇటూ కొంతసేపు తిరిగిన అతడు ఆమె దగ్గరకొచ్చాడు.‘‘నేను నిద్రపోవాలి’’‘‘క్వార్టర్స్‌కి వెళ్ళండి. నేను ఇతడ్ని బతికించి వస్తాను’’‘‘చెప్పడానికేం చెప్పొచ్చు. కాని...’’‘‘డాక్టర్! నన్ను డ్యూటీ చేయనివ్వండి’’‘‘థ్యాంక్స్..... ’’ విసురుగా నడిచినట్టు శబ్దం.రెండు నిమిషాల తర్వాత టూవీలర్ బయలుదేరిన శబ్దం.ఆ వెళ్ళిన డాక్టర్ పేరు శరత్.డ్యూటీలో మునిగిన నర్స్ పేరు నీలవేణి. హాలులో పది మంచాలున్నాయి. పదిమంది రోగులున్నారు.హాలు చీకటిని తరమాలని వ్యర్థ ప్రయత్నం చేస్తున్న ప్లోరోసెంట్ వెలుగు.ఆ లేత వెలుతురులో ఒక లేత ఇల్లాలి జీవితానికి చిక్కటి వెలుగు నివ్వాలన్న ప్రయత్నంలో నర్స్ నీలవేణి.
ఆమె సేవా సరస్సులో విరిసిన సుమంలా ఉంది.ఆమె గుండెల్లో జీసస్. ఆమె కన్నుల్లో మదర్ థెరీసా.ఒక అమ్మ, ఒక చెల్లి, ఒక సేవిక రాశీభూతాలై.మానవ ప్రయత్నం అలసిపోకూడదు. ఓడిపోకూడదు. విజయం సాధించాలి.దారి చూపించడం వరకే తన పని అనుకుంటాడా డాక్టర్.గమ్యం చేర్చాల్సిన బాధ్యత నర్స్‌ది అనుకుంటుంది నీలవేణి. అందుకే ఆమె అలసిపోదు. నిద్రపోదు. రోగిని బ్రతికించే వరకూ.శరత్‌కు ఆశ్చర్యం వేస్తుంది. గోర్కీ ‘అమ్మ’ మళ్ళీ పుట్టిందా అనుకుంటాడు. ఇంటికి వెళ్ళాడేగాని పట్టుమని పదినిమిషాలు వుండలేకపోయాడు. తిరిగి ఆసుపత్రికి వచ్చాడు. మెల్లగా అడుగులో అడుగువేస్తూ నీలవేణి వెనకాలే నిలబడి రోగిని చూశాడు. శరత్ కళ్ళల్లో మెరుపు. సడి చెయ్యకుండా వెనక్కి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. బయటనుండి వాకిలి గుండా గాలి లోపలికి వస్తూంది. కళ్ళు మూతలు పడినయ్. పదైదు నిమిషాలు గడిచాయి.‘‘లేస్తారా? ఇక వెడదాం’’ డాక్టర్ తల జిల్లుమన్న కరస్పర్శ.‘‘నీలవేణీ!’’‘‘నిద్ర పోతున్నారా?’’‘‘నాకు ఆశలేదు. నువ్వు బ్రతికించావ్’’ అభినందిస్తున్నట్టు ఆమె రెండు చేతుల్నీ తన కన్నుల కద్దుకున్నాడు శరత్.‘‘దారి చూపింది మీరే కదా!’’‘‘ఈ దారిలో జీవితాంతం నాతో నడుస్తావా?’’‘‘డాక్టర్!’’ గొంతులో వణుకు. వూహించని పరిణామం.‘‘నిజం నీలవేణీ! మన ఇద్దరి ఆలోచనలు, మార్గాలు ఒక్కటే. ఒకరికి ఒకరు తోడై లేదా ఒక్కటై...’’