ప్రతి మనిషి జీవితంలో అవసానదశ దుర్భరమైనది. చివరి ఒడ్డుకి చేరినవారికి చేతులు చాపుతూ చావు దగ్గరవుతుంది. ఈ విషయంలో ఏ ఒక్కరికీ మినహాయింపు లేదు.ఈ ప్రయోజనానికి అంటూ ఏ మనిషి పుట్టుక సంభవించదు. ఊపిరి తీసుకున్న పిదప అస్థిత్వం ఏర్పడుతుంది. అంతరంగ స్థితిగతులను బట్టి వ్యక్తిత్వం సిద్ధిస్తుంది. మంచిచెడుల తేడాలు సమాజం గ్రహిస్తుంది.ఎవరినీ లెక్కించక తనొక్కడికోసమే బ్రతుకుతున్నట్లుండేవారి జీవితం వేరు. వారికో ముద్ర వుంటుంది.అటువంటి ముద్ర కుపస్వామి మీద వున్నది.కుపస్వామి ఓ విరాగిలా వుండేవాడు. చిన్న గావంచాతో... ఖద్దరు చొక్కా కాని, ఉత్తరీయం గాని దర్శనమిచ్చేవి కావు... పెదాల సందుల్లో ఓ బీడీ ఇరికించుకునేవాడు. అది ఖర్చుతో కూడినదే అయినప్పటికీ తనకోసం కాబట్టి కాలుస్తున్నాడు. తను కాల్చే బీడీ మరొకరికి మేలు కలిగించేదే అయితే చపన తన అలవాటు మార్చేసుకుంటాడు.పైవన్నీ నాకీమధ్యనే తెలుస్తున్నాయి.కొత్తగా వచ్చిన నాకు కుపస్వామి గురించి తెలియకపోవును కాని మా వీధిలో వుండే పెద్ద తలకాయ దేవీనారాయణ గారు మా అరుగు మీద కాలక్షేపం కోసం చతికిలబడ్డపడు చర్చలోకి ఈ సంగతులు వచ్చేవి.చాలాకాలం క్రితం మాట... కుపస్వామికి చేతిలో ఏగానీ వుండేది కాదట. ఊరివారంతా జాలిపడి సాయం చేస్తే వీధరుగు మీద జీళ్ళ దుకాణం పెట్టుకున్నాడు.

 దగ్గర్లో వున్న బడి పిల్లల వల్ల కొట్టుకి ఆదాయం పెరిగింది. పలకలు, పుస్తకాలు.. ఒకటొకటే దుకాణంలో సమకూర్చాడు. అలా అలా ఆదాయం వృద్ధయింది. కుపస్వామి కొట్టుమీద వస్తువు లేదంటే అది మరోచోట వుండదన్నంత స్థాయికి ఎదిగింది.అయినప్పటికీ రోజూ గేదెలు వీధంట మేతకు బయలుదేరి వెళుతుండేటపడు, అవి ఇంటికి చేరేవేళా కుపస్వామి అవతారం మహా ఘోరంగా వుండేది. గేదెల వెనకాలే తట్ట పట్టుకుని బయలుదేరేవాడు. నేలమీద పడ్డ పేడను తట్టలోకి ఎత్తేవాడు. రోజూ మొత్తంలో ఏరిన పేడను ఊరి చివర చెరువు దగ్గర పణుకు మీద పిడకలు పెట్టేవాడు. అవి పెళపెళలాడుతూ ఎండినాక బస్తాలకెత్తేవాడు. వాటిని పట్నంలో అమ్మేవాడు. అదియిదీ అని కాదు. కాదేదీ వ్యాపారానికనర్హం అన్న రీతిలో కుపస్వామి పరిపరివిధాలుగా తన వ్యాపార సరళిని అవిచ్ఛిన్నంగా నెట్టుకువచ్చాడు.ఊర్లో గట్టిగా వున్న వాళ్ళలో అతనొకడు అనే స్థాయికి చేరాడు. అయినా కుపస్వామి వేషభాషలలో ఏం మార్పు లేదు.కుపస్వామికి ఇద్దరు పిల్లలు... ఓ ఆడ, ఓ మగ... ఆడపిల్ల చంద్రమ్మను పొరుగూరిలో అయినవారింటికే ఇచ్చాడు. ఇంక మగబిడ్డ శ్యామలదాసు. పెద్దగా చదివించడానికిష్టపడక అతగాడిని కూడా కొట్టుమీదనే కుదేసాడు. అక్షరం పొలితికి తప్ప ఉద్యోగాలకి, ఊళ్ళేలడానికి శ్యామలదాసు చదువు సరిపోలేదు.