పరమశివం లాంటి మనుషులు కొంచెం అరుదుగా వుంటారనుకుంటాను. అతను చిత్రమైన మనిషి. అతడి ఆలోచనా విధానం చాలా డిఫరెంటుగా వుండేది. నాకు వున్న కొద్దిమంది స్నేహితులలో అతను ముఖ్యమైనవాడు.ఏడాది క్రితం నాకు విజయవాడకు బదిలీ అయ్యింది. ఉద్యోగరీత్యా నేను గుంటూరులో వున్నపడు పరమశివం, మేము ఒకే వీధిలో వుండేవాళ్లం.బరువెక్కిన హృదయంతో నేను గుంటూరు నించి విజయవాడకు మకాం మార్చాను. ఇందుకు నూటికి నూరుపాళ్లు పరమశివం కారణం. నాకు వీడ్కోలు ఇవ్వడానికి నా స్నేహితులంతా వచ్చారు. ఒక్క పరమశివం తప్ప.ఎందుకంటే ఈ లోకంలో వుండి వుంటే పరమశివం కూడా తప్పకుండా వచ్చి వుండేవాడే. అప్పటికి మూడు నెలల క్రితం ఈ లోకం నించి వెళ్లిపోయాడు. అందువల్లనే అతడి జ్ఞాపకాలను తట్టుకోలేక అక్కడి నుంచి బదిలీ చేయించుకొని ఆ వూరు విడిచి వెళ్లిపోయాను.ఊరు మారినా పరమశివం లాంటి ఆత్మీయుడి ఎడబాటు నన్ను బాధిస్తూనే వుంది. పరమశివంతో స్నేహం చేసిన వారెవరూ అంత సులభంగా అతడిని మరిచిపోలేరు.పరమశివం ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసేవాడు. అతడికి డబ్బు సంపాదన మీద అంతగా యావ వుండేది కాదు. 

అందువల్లనే చనిపోయేనాటికి అతను ఒక సొంత ఇంటిని కూడా అమర్చుకోలేకపోయాడు.అతనికి ఐహిక సుఖాల మీద, భోగాల మీద అంతగా వ్యామోహం వుండేది కాదు. పరలోక జీవితం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ వుండేవాడు. ఎక్కువగా అతడు పాప పుణ్యాల గురించీ, ఓ మనిషిగా సాటి మనుషుల పట్ల చూపించవలసిన ప్రేమ, జాలి, కరుణ గురించి అవసరంలో వున్న మనుషులకు చెయ్యవలసిన సాయం గురించీ మాట్లాడుతూ వుండేవాడు. ఎపడూ ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతూ, అందులో వున్న విషయాల గురించి నాలాంటి స్నేహితులకు చెబుతూ వుండేవాడు. ఎపడు కొద్దిపాటి సెలవు దొరికినా రకరకాల దేవాలయాలకీ, తీర్థాలకి వెళుతూ వుండేవాడు. అతడితో కలిసి నేను కొన్నిసార్లు శ్రీశైలానికి, సోమేశ్వరాలయానికి వెళ్లాను. పరమశివానికి ప్రయాణాలు చెయ్యడం మీద ఎక్కువ ఆసక్తి వుండేది. అంత ఆరోగ్యవంతుడు కాకపోయినా ఎన్నో గంటలు ప్రయాణం చేసి రకరకాల కొత్త ప్రదేశాలు చూసేవాడు.పరమశివంలో వున్న ఈ ప్రయాణం సరదా అతడి పిల్లలకు నచ్చేదికాదు. అతడికి ఇద్దరు పిల్లలు. అతడు చాలా మందిలా ప్రభుత్వ ఉద్యోగం వుండి కూడా దండిగా డబ్బును సంపాదించలేడని, తమ విలాసవంతమైన జీవితానికి సహాయపడలేదనే అసంతృప్తి ప్రకటిస్తూ వుండేవాళ్లు. అయినా పరమశివం తన వైఖరిని మార్చుకునేవాడు కాదు. నాకు తెలిసి అతను తన భార్యాపిల్లలను మితిమీరి ఎపడూ ప్రేమించినట్లు కనపడలేదు. ఒక తండ్రిగా, కుటుంబ యజమానిగా తన పాత్రను సాధారణంగా పోషించేవాడు. పిల్లల గొంతెమ్మ కోరికలు తీర్చడం గురించి, వాళ్ల ఉజ్వతమైన భవిష్యత్తు గురించి ఎపడూ ఎలాంటి ఆరాటాన్ని, తాపత్రయాన్ని కనపరిచేవాడు కాదు. ఏదో నాటకంలో నటిస్తున్న వాడిలా వుండేవాడు.