‘‘ఆ పల్లెటూరులో ఏముంటారు నాన్నా. అక్కడ ఇల్లూ, పొలం అమ్మేసి నాతో బాటు ముంబయి వచ్చేసి ఉండండి. మీరు పొలా నికి వెళ్లి కష్టపడటం, అమ్మ ఇంకా వంటచేస్తూ శ్రమ పడటం నేను చూడలేను. ఈ వయసులోనైనా మీరు హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే చూస్తూ ఆనందించాలని నా కోరిక’’ అన్నాడు పుత్రుడు నాగరాజు.పెరట్లో జామచెట్టు కింద నిలబడి రామస్వామి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. చెట్టుకి దాదాపు డజను పళ్లు సూర్యోదయపు లేత ఎండని వంటికి పూసుకుని బంగారు ఛాయతో మెరిసిపోతున్నాయి.మామూలుగా అయితే ఉత్సాహంతో అవన్నీ కోసి తినడానికీ, ఇతరులకు పంచడానికీ పదిలంగా దాచేవాడే. కాని ఆ రోజు అతడికి ఉత్సాహం లేదు. ముంబాయి నుండి కుమారుడు ఉదయాన్నే మళ్లీ ఫోను చేశాడు. అప్పటినుండి మనసంతా చికాకుగా ఉంది. కుమారుడు చెప్పింది వినడానికి బాగానే ఉంది. కానీ ఇల్లూ, పొలం అమ్మేసి ఏ పట్నమో వెళ్లి ఖాళీగా కూర్చుంటే ఏం ఊసుపోతుంది? బ్రతికున్నంతకాలం ఏదో ఒక పనిచేస్తేనే కాలక్షేపం. భార్య జానకమ్మతో ఈ విషయం చర్చిస్తూనే ఉన్నాడు. ఆమెకు కుమారుడి మీద సహజంగా మమకారం బాగా ఎక్కువ. బాల్యం నుండి వాడికేది కావలసినా తల్లినే ముందు అడుగుతాడు. ఆమె తను తీర్చగలిగే కోరికల్ని తీర్చేది. తను తీర్చలేని కోరికల్ని భర్తకు సిఫార్సు చెయ్యడం భర్తద్వారా కొడుకుని సంతృప్తిపరచడం ఒక సంప్రదాయమై పోయింది. పొలం, ఇల్లు అమ్మకం విషయంలో చాలావరకూ తల్లిని ఒప్పించగలిగాడు నాగరాజు.వంటింట్లో పూజ ముగించి వీధిలో తులసికోటకు దండంపెట్టి వచ్చిన జానకమ్మ జామచెట్టు దగ్గర మానసిక సంక్షోభంతో తచ్చాడుతున్న భర్తను చూసి, ఏదో చెప్పబోయి కాసేపు అలానే నిలబడి ఉండిపోయింది.ఫఫఫరామస్వామికున్న ఆస్తి కొట్టక్కి గ్రామంలో ఒక ఇల్లూ, గ్రామాన్ని ఆనుకొని ఉన్న పదెకరాల పొలమూనూ.

ఆ దంపతులకి కొడుకూ, కూతురూ ఇద్దరు సంతానం. పెంకుటిల్లు మార్చేసి స్లాబు ఇల్లు కట్టిద్దామనుకున్నాడు గాని, వారసత్వ చిహ్నంగా ఆ ఇంటిని అలానే వదిలేశాడు. ఊళ్ళో, చుట్టుపక్కల గ్రామాల్లో పిల్లలు చాలామంది ఇంటర్‌ పూర్తయ్యాక ఇంజనీరింగ్‌లో చేరేందుకు ఏవో కోర్సుల్లో చేరి ఆ తర్వాత ఉద్యోగాలు చేసుకుంటూ పట్నాల్లో స్థిర పడుతున్నారు. తన కుమారుడికి తనెందుకు చదువు దూరం చెయ్యాలన్న సంకల్పంతో వాడినీ ఇంజనీరింగ్‌ కోర్సులో చేర్పించాడు. కుమార్తెను పదో తరగతి దాకా చదివించాడు. తర్వాత చదువుకునేందుకు ఆమె ఉత్సాహం చూపించలేదు. ఈ మధ్యనే ఒక సంబంధం చూసి పెళ్లి చేశాడు. ఆమె కాపురం సవ్యంగానే సాగుతోంది. చదువు పూర్తయ్యాక నాగరాజు ఏదో ట్రెయినింగ్‌ అని వెళ్లాడు. తర్వాత ఉద్యోగం వచ్చింది. అదీ ముంబయిలో. ఉద్యోగంలో చేరాక ఆ కంపెనీలోనే పని చేస్తున్న ‘స్వాతి’ అనే అమ్మాయితో పరి చయం ప్రేమగా మారి పెళ్లివరకూ దారి తీసింది. అమ్మాయి తరపు వాళ్లు తొందరపడటంతో కూతురు పెళ్లయిన రెండు నెలలకే కొడుకు పెళ్లి కూడా చేసి ముంబయి పంపించాడు. కాపురం పెట్టిన నెల రోజులకే కుమా రుడు ఒక విషయం చెప్పాడు.