ఆ ఇల్లు ఇక్ష్వాకుల కాలం నాటిదని ఆ ఊళ్లో అందరూ హాస్యంగా చెప్పుకుంటారు. చూస్తే, మీరూ ఆ మాటే అంటారు. సందేహం లేదు. ఎందుకంటే, ఆ ఇల్లు కట్టినప్పుడు ఎలా ఉండేదో, ఇప్పటికీ అలాగే ఉంది.ఆ ఇంట్లో ఎన్నితరాలు గడిచిపోయాయొ - గోడలకి తగిలించి ఉన్న పాత ఫొటోలు చెబుతాయి. ఆ కాలం నాటి వేషాలతో చూట్టానికి వింతగా, ఆసక్తిగా ఆ ఫొటోల్లోని మనుషులు దర్శనమిస్తారు. టోపీలు, కోట్లు ఆడంబరానికి వేసుకున్నా వాళ్ల నవ్వు మొహాల్లో నిర్మలత్వం ఆకట్టుకుంటుంది.ఆ ఇల్లు ప్రస్తుత యజమాని నా బాల్యమిత్రుడు రాజా.నిజానికది వాడికి మిత్రబృందం పెట్టిన ముద్దుపేరు.అసలు పేరు రామ్మోహన్‌.ఇక్కడో విషయం చెప్పాలి. ‘పుంసా మోహనరూపాయ’ అనేది శ్రీరాముడి రూపలక్షణం. అంటే ఆయన అందం మగవారిని కూడా సమ్మోహన పరచి కట్టిపడేస్తుందని అర్థం. శ్రీరాముణ్ణి సంపూర్ణంగా ఎవరూ చూడలేక పోయేవారట. కారణం ఆ అందాలరాముడి ఏ అవయవం చూస్తే చూపులు అక్కడే ఆగిపోయేవట. కన్నులు కమలదళాలు. మోము చంద్ర బింబం. అందం నిర్వచించాలంటే రాముడి రూపవర్ణన చేస్తే చాలంటారు.రాముడంతటి భువన మోహనుడు.మా రామ్మోహన్‌ నిస్సందేహంగా అందగాడు.అందాల తెలుగునటుడి పోలికలు అతన్లో కనిపిస్తాయి. 

ఈ మాట అనటానికి నేను నేర్చుకున్న సాపేక్ష సిద్ధాంతమే కారణం. మన వాళ్ళు గొప్పవాటికి సినిమా నటులతో పోలికలు పెట్టటం పరిపాటి కదా?అదలా ఉంచితే, రాజాలో ఉన్న కొన్ని ప్రత్యేకతల గురించి మీకు చెప్పాలి. మనిషి ఫిల్టర్‌ కాఫీలాంటి వాడు. కల్మషాలేమీ లేని స్వచ్ఛమైన మనసు. ఒక్క పరిచయంతో జీవితకాలం అనుబంధం ఏర్పడగల వ్యవహారశైలి.అందరితో ఆత్మీయంగా ఉంటాడు. ఎవరిగురించీ ఒక్క చెడ్డమాట కూడ చెప్పడు. ఇతరుల గురించి తనవద్ద అదే పనిగా విమర్శిస్తుంటే తమాషాగా స్పందిస్తాడు. మొదట మౌనమందహాస వదనంతో వింటున్నట్టు కనిపిస్తాడు. కానీ వినడని నాకు తర్వాత అర్థమయింది. అవతలివ్యక్తి అలాగే కొనసాగిస్తుంటే మాట మార్చటానికి ప్రయత్నిస్తాడు. అదీ పని చెయ్యకపోతే, ‘‘వదిలెయ్యండి సార్‌! ఈ ప్రపంచంలో ఎవరు శుద్ధమైన వాళ్లు? అందరికీ లోపాలుంటాయి. సాయిబాబా అన్నట్టు, ఎదుటివాడి దోషాల్ని మన నాలుకతో శుభ్రం చెయ్యటం దేనికి?’’ - ఈ దెబ్బతో అవతలివాడు నోర్మూసుకు తీరాల్సిందే.‘స్వార్థం తమ జన్మహక్కు’గా భావించటం సమాజ లక్షణం. రాజాలో నేను చూడలేకపోయిన లక్షణం స్వార్థం. అతనికి శాంతి మంత్రాలేవీ తెలియవు. కానీ ‘సర్వేజనా! సుఖినోభవంతు’ ధోరణి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అతని జూనియర్‌కి ముందుగా ప్రమోషన్‌ వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా అభినందించటం చూసి, జూనియర్‌ దిమ్మెరపోయాడు. కొలీగ్స్‌ ఎంత ప్రోద్బలం చేసినా తన హక్కు కోసం ఎలాంటి పోరాటమూ చెయ్యలేదు!