చిన్నప్పటినుండీ నేను ముభావిని. ఇతరులు నా నోరు మెదపాలని చూసినా కసురుకునే వాడినేకాని వారితో కలుపుగోలుగా ప్రవర్తించేవాడిని కాను.పై విషయంలో అమ్మ నన్ను నిష్ఠూరంగా మాట్లాడేది. కోరి పెదవులతో పలుకరించి... నాలుగు మాటలు ముచ్చటగా చెప్పుకునే వారికోసం అంతాఉవ్విళ్ళూరితే నువ్వేమిటింత అంటీముట్టని రకం అని వాపోయేది.వయస్సు ఎదిగినా ఆ స్వభావం మాత్రం నానుండి తొలగలేదు.ఆ రోజు సైతం నేను నాగదిలో మంచి ర్యాంకు సాధించాలన్న పట్టుదలతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నాను.‘‘ఒరే! అత్తమ్మొస్తోంది’’ అంది దగ్గరగా నిల్చుని అమ్మ.నా మానాన నేనున్నాను.‘‘అదేరా ఇందిరత్తయ్య...’’ ఓసారి భుజం కుదిపి చెప్పింది.‘‘అబ్బ... వస్తే ఏమిటంట?’’ ఒకటే విసుగు.‘‘అబ్బ.. నీదెప్పుడు ఒకటే ధోరణి... నిన్ను మార్చటం ఎవరి తరం కాదు’’ చికాగ్గా వెళ్ళిపోయింది.మరో పదినిముషాలకి తమ్ముడు విలాస్‌ వచ్చాడు. వాడూ అదే నసుగుడు.. ‘‘ఒరే ఇందిరత్తయ్యని అంటూంటారే అమ్మ వాళ్లూ... రేపు వస్తున్నారంట’’ అన్నాడు.‘‘బాబూ నీ గోలేంటి! ముందిక్కడి నుంచి వెళ్ళు...’’ అనగానే విసురుగా వెళ్ళి పోయాడు విలాస్‌.భోజనాల సమయానికి గది తలుపు చేరవేసి వచ్చాను.ఇందిరత్తయ్య చర్చలో మునిగి తేలుతోంది ఇల్లంతా...‘‘చాలాకాలం తర్వాత ఇందిర వస్తూందంటే ఎంతో ఆహ్లాదంగా ఉందే!’’ అంటున్నారు నాన్న.‘‘ఔనండీ మీకూ మాతమ్ముడికే భేదాభిప్రాయాలు వచ్చాక... పదేళ్ళ తర్వాత ఇదే రాక...’’ అని చెబుతున్నప్పుడు అమ్మ గొంతు వణికింది.ఇందిరత్తయ్యను నేనసలు చూడలేదు. మామయ్యను చూసి కూడా చాలా యేళ్ళే అయ్యింది. మామయ్యది ఆర్మీలో ఉద్యోగం.. యేడాదికి ఒకట్రెండుసార్లు వచ్చినా సరే. వెంట వెంటనే వెళ్ళి పోతుండేవాడు.మామయ్య చేసుకున్న సంబంధం నాన్నగారికి ఇష్టంలేనట్లుగా మాట్లాడారన్న అపోహతో మాటామంతి లేకుండా పెళ్ళి అయినాక ఇటువైపు రావటం మానుకున్నాడు. మరి భర్త త్రోవలోనే ఇందిరత్తయ్యానూ. 

ఆకారణంగానే ఇందిరతయ్యను చూసే అవకాశం కలగలేదు.మరింత కాలానికి వస్తున్నారని తెలిసినా సరే నా స్వభావ రీత్యా ప్రత్యేక దృష్టి సారించలేదు.అయితే రేపు రాబోతున్నారనుకున్న వాళ్ళు ఆరాత్రే దిగటంతో మేం ఆశ్చర్యపోయాం.‘‘ఏరా తమ్ముడూ రేపు వస్తారని టెల్రిగాం ఇచ్చారే’’ అమ్మ వింతగా అంది.‘‘రామతీర్థం వెళ్ళి వద్దామనుకున్నాం. కానీ రద్దు చేసుకుని వచ్చేసాం’’ అని చెప్పాడు.ధనుంజయ మామయ్య విగ్రహం నౌకరీకి తగ్టట్లే ఉంది. పెద్ద పెద్ద మీసాలు.. ఉబ్బిన కళ్ళతో భయంకరంగా ఉన్నాడు.వారి వెంట మూడేళ్ళ పిల్లవాడు వున్నాడు.‘‘వీడు విలాస్‌...’’ తమ్ముడిని పరిచయం చేసింది అమ్మ.‘‘వీడు అభిలాష్‌... డిగ్రీ ఫస్టియర్‌...’’ తరువాత నన్ను పరిచయం చేసింది.‘‘అచ్ఛా’’ అని మామయ్య... ‘‘వేరీగుడ్‌’’ అని అత్తయ్య మమ్మల్ని మెచ్చుకోలుగా చూసారు.వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేసారు.మామయ్యకు కాశ్మీరు ట్రాన్స్‌ఫరైందిట. అదీ అక్కడ కల్లోలిత ప్రాంతంలోకి.. తనవెంట భార్యను తీసుకెళ్లే వీలులేదని చెప్పి మా ఊర్లో ఉంచటానికి అమ్మనాన్నల అంగీకారం అడిగాడు. తమ దగ్గర ఉంచటానికి ఒప్పుకున్నారు. అయితే మామయ్యకు ఆ విషయంలో మాత్రం సుతరాము ఇష్టం లేదు.