టైం చూసుకున్నాను. నాలుగయింది.నా డెస్క్‌కి తాళం వేసి, మేనేజర్‌ రూంలోకి దూసుకెళ్ళాను. ఇక పావుగంటే వుంది ఇంటర్‌ సిటీ పట్టుకోవటానికి.‘‘సార్‌ నేను బయలుదేరుతున్నాను’’ అని మాత్రం చెప్పి, ఆయన చెప్పేది వినిపించుకోకుండా బయటికి వచ్చి, నా డెస్క్‌ దగ్గరున్న బ్యాగ్‌ తీసుకుని మరో పదిసెకన్లలో బ్యాంకు బయటకొచ్చి పడ్డాను. ఎదురుగా వచ్చే ఆటోలో ఎక్కి ‘‘స్టేషన్‌కు పోనీయ్‌’’ అన్నాను. ‘‘ఇరవై రూపాయలవుతుందన్నాడు’’ ఆటోవాడు. అది విజయవాడలో మామూలే. నాలుగ్గంటల నాలుగు నిమిషాలయ్యింది ‘‘సర్లే పద’’ అని మాత్రం అన్నాను.బీసెండు రోడ్డునుంచి స్టేషన్‌కి నడిచి వెళ్ళచ్చు. కానీ టైం లేదు. ట్రైన్‌ టికెట్టు ముందుగానే రిజర్వు చేయించాను. వరసగా పండ క్కి నాలుగు రోజులు సెలవులొచ్చాయి. రైళ్ళు కిక్కిరిసిపోతాయి చాలా కష్టం.సడన్‌ బ్రేక్‌ వేసాడు. ముందుకి పడ్డాను. సిగ్నల్‌ పడింది. టైం నాలుగు ఏడయ్యింది. ఇక ఎనిమిది నిమిషాలుంది.మా మేనేజరు ఓ సాడిస్టు. ఎవడైనా శెలవు పెట్టాడంటే వాడికి ఎక్కడినుంచో బాధ పుట్టుకొస్తుంది. అందుకే వెళ్ళేలోపు వీలైనంత పని చెప్పి ఏడిపిస్తాడు. వీడి పెళ్ళాం ఇంట్లో పెట్టే హింసలకి ఇలా ప్రతిస్పందిస్తూంటాడు. అందుకే వీడ్నందరమూ కీచకుడంటాము. బొత్తిగా టైం సెన్సు లేదు. విసుగొచ్చింది. ఆటో స్టార్టు అయింది.నాలుగు ఎనిమిది.నా టెన్షన్‌ వీడికేం తెలుసు. 

రేపు ఉదయం ఎనిమిదిన్నరకి పెళ్ళి చూపులు. నా జీవితంలో మొదటిది. చాలా త్రిల్లింగ్‌గా వుంది. రాత్రికి ఇల్లు చేరుకుని తినేసి పడుకుంటే. పొద్దున్నకి ఫ్రెష్‌గా ఉంటుంది. లేకపోతే, రాత్రంతా బస్సులో ప్రయాణం చేసి, అలసిపోయి, కరెంటు షాకు తగిలినవాడిలా పీక్కుపోయిన ముఖంతో పెళ్ళిచూపులకెళితే, అమ్మాయికి ఏం నచ్చుతాం చెప్పండి. అర్థం చేసుకోరు.‘‘ఏంటయ్యా ఇటు తిప్పావు. నేరుగా కదా పోవలసింది’’ అన్నాను. ‘‘మీరే కదా సార్‌ టైం లేదన్నారు. ఇలా వెళితే ముందు యూ టర్న్‌ తీసుకోనవసరం లేదు’’ అన్నాడు. పోన్లే ‘సూక్ష్మంలో మోక్షం’ అనుకున్నాను.మళ్ళీ కీచమని శబ్దం. సడన్‌ బ్రేక్‌. దీని మధ్యలో పోలీసు విజిల్‌ గూడా వినిపించినట్టు గుర్తు.‘‘ఏం బాబు విజయవాడకి కొత్తా?’’ అడిగాడు కానిస్టేబుల్‌.‘‘సారీ సర్‌. ఈయన గారి ట్రైన్‌ మిస్సవుతుందంటే ఇలా... మీరుంటారని తెలీదు సార్‌’’ అన్నాడు ఆటోవాడు.‘‘తెలీదు, ఎందుకు తెలుస్తుంది. ఓ అయిదొందలు కడితే తెలుస్తుంది’’ అన్నాడు ఆటోకి అడ్డంగా నిలబడి. నిజానికి నా జీవితానికి అడ్డంగా నిలబడ్డట్టనిపిస్తోంది నాకు ‘‘సార్‌ ప్లీజ్‌ ట్రైన్‌ టైం అయిపోతోంది. ఈ ఒక్కసారి క్షమించండి’’ బ్రతిమాలాను.కానిస్టేబుల్‌ లోపలికి చూసి ‘‘ఏంటి సార్‌ మీరు గూడా, ఇలా చదువుకున్న మీలాంటివారే వీళ్ళని ఇలా రాంగుసైడు వెళ్ళమని ఎంకరేజి చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి’’ అని ఆగాడు. ‘‘అసలు వీళ్ళ మూలంగానే రోజూ ఎన్నో ఏక్సిడెంట్లు జరుగుతున్నాయి. అంతేకాదు...’’ ఇంకా ఏదో చెబుతున్నాడు. నేను దిగి, నా బ్యాగు తీసుకుని, బుజాన వేసుకుని, ఆటోడ్రైవర్‌ చేతిలో ఇరవై నోటు నొక్కి పరుగందనుకున్నాను, స్టేషను వైపు.