సిటీలో అదొక కూరగాయల మార్కెటు. ఉదయాన్నే హోల్‌సేల్‌ వాళ్ళు వేలంపాటలో కూరగాయలు కొని రిటేలు వాళ్లకు అమ్ముతారు. ఇక రిటేలు వాళ్లు మార్కెటులో వేసుకుని పొద్దస్తమానం అమ్ముతారు. కూర్చొని విసిగిపోయి, కస్టమర్లతో అరిచి సంధ్యవేళ ఇంత మత్తు పడనిది వారికి నిద్ర రాదు.ఇక మధ్యాహ్నం భోజనం తెచ్చుకుంటే, దుకాణం మీద కూర్చుని కస్టమర్లను చూసుకుంటూ గంపలడ్డంపెట్టుకుని తింటారు. తెచ్చుకోకపోతే హోటల్‌ నుండి పప అన్నం తెప్పించుకుంటారు. సూర్యాస్తమయం కాగానే దినమంతా అమ్మిన డబ్బులు లెక్కజూసుకుని వాళ్లకిష్టమైన మత్తులో తులతూగుతారు.పెంటమ్మ, బాలమ్మ ప్రక్కప్రక్క దుకాణదారులు. ఒకరు దుకాణం మీద లేకపోయినా ఇంకోరు చూసుకుంటారు. కస్టమర్లెవరూ లేకపోవడంతో కబుర్లలో పడ్డారు.‘‘పెంటక్కా! బాల నీ దగ్గరకొస్తలేడట కదనే’’ అంది బాలమ్మ.‘‘వానిమీద దుమ్ముపడ, మన్నుపడ, రాయిపడ, రప్ప పడ, ఆ వొగలాడి దగ్గిరకే పోతున్నడేమో! నన్ను తిప్పలు పెట్టేవాడేకాని తిండిపెట్టడు కదా’’ చిరుకోపంగా అంది పెంటమ్మ.‘‘ఏదీ? దాని దీగ్గరకు కూడ పోతలేడట! నేనడిగిన, ఒట్టుకూడ తిన్నది’’.‘‘మరి యాడసచ్చిండో! ఆని అరచేతుల మూడు చక్రాలున్నవి. ముల్లోకాలు తిరుగుతడు. తీన్‌ చక్కర్‌ త్రిలోక్‌ సంచారి! ఊకెనే అన్నారా పెద్దలు’’.‘‘ఊగి ఊగి ఉయ్యాల కట్టిన దగ్గిరనే ఆగుతదట. గట్లనే ఎన్నిరోజులు పోయినా నీ దగ్గరకే వొస్తడు.’’‘‘నాకు పిచ్చిలేసినట్లున్నదే, ఫోను అయినా చేసి పాడువడుతలేదు. ఆ పిల్లగాన్నిపోయి, లీడర్ల ఇండ్లల్ల అడిగిరారా అంటే ఆడు పుస్తకాలు పట్టుకుని కూసుంటడు’’.‘‘మొన్నటిదాకా వోట్లల్లదిరిగె. జిందాబాద్‌, మురదాబాద్‌ అనుకుంట. ఇగ ఆ వొచ్చే ఓట్లల్ల నిలబడమను. యం.ఎల్‌.ఏ. అయితే మంత్రి అయినా కావొచ్చు. ఇక చూసుకో అపడు పెంటక్క డిమాండ్‌! బంగళా, కారు నౌకర్లు ఒక్కటేంది? మాయసోంటోళ్ళు కంటికి కూడా కానరారు’’ అంది బాలమ్మ నవ్వుతూ.

ఆ మాట వినగానే పెంటమ్మ కిసుక్కున నవ్వి ‘‘ఎంత ఉన్నా నాపని నాదే, ఆడి పని ఆడిదే, నా కష్టం జేసికుని నేనే బ్రతకాలే, పిల్లలను సాదుకోవాలె. ఆ మంత్రిపదవి ఊసిపోయినంక ఇగిలిస్తరు. అయినా వాడు ఏం జేస్తున్నడని? తెల్ల బట్టలేసుకుని సోగ్గాడి మాదిరిగె తిరుగుతాడు. సాయంత్రం ఎవడన్నా పోపిస్తే తాగి, అది సాలలేదని తాగనికే పైసలియ్యమని నా పానం తీస్తడు’’.‘‘పైసలియ్యరని అట్లా కొట్టాట పెట్టుకున్నపడు ‘దాని’ దగ్గిరకు పొమ్మనరాదె’’ వెటకారంగా అంది బాలమ్మ.‘‘బాగా చెపుతవు బంగారు బాలమ్మ! నీయసొంటిది మొగన్ని అమ్మి బర్రెను తెచ్చుకుందట!’’ఇద్దరు నవ్వుకున్నారు.ఇంతలో పెంటమ్మకు గిరాకి వచ్చింది.‘‘టమాటలెట్లమ్మా’’‘‘ఇరవై రూపాయలు’’‘‘పన్నెండుకిస్తవా?’’‘‘టమాట తినే ముఖమేనా నీది? మురిగిపోయినయి. బుడ్డిపోయినయి అక్కడ పారేస్తరు, ఏరుకపో, పూట గడస్తది’’‘‘ఏందమ్మో, శానా మాట్లాడుతున్నవో, అడిగినము. ఇస్తే పడదని చెప. ఏర్కతినేటల్ల లెక్క కనబడుతున్నమా మేము’’ సణుక్కుంటూ వెళ్లిపోయాడతను.