నా పర్సులోని అడ్రసు కాగితం తీసి వీధిపేరు సరిచూసుకున్నాను. అలంకరణను బట్టి ఆ వీధిలోని పెళ్ళివారిల్లు ఏదో తెలుస్తూనే ఉంది. పల్లెటూరు సొగసులు, పట్నం పోకడలు కలగలిసి పాతకొత్తల మేలుకలయికలా ఉన్న ఆ వూరు లాగానే ఆ ఇల్లూ ఉంది.నేను ఇంట్లోకి అడుగు పెట్టగానే, అక్కడున్న నలుగురైదుగురు నన్ను చూసి ‘హైద్రాబాద్‌ నుండి విజయ్‌ వచ్చాడు’ ....‘గోపాలం చిన్న కొడు కొచ్చాడు.....’ రాజేశ్వరి వాళ్ళబ్బాయి వచ్చాడు.....’ అంటూ పక్కవాళ్ళతో చెబుతూ ఆదరంగా ఆహ్వా నించారు. ముందుతరం వాళ్ళ పలకరింపుల్లో మనసుని తాకే ఆప్యాయత ఉంటుందనిపించింది.నిజానికి ఈ పెళ్ళికి రావాలని అనుకోలేదు. అమ్మ పట్టుదల మీద వచ్చాను. ‘అంత దూరపు బంధువుల పెళ్ళికి వెళ్ళకపోతేనేం....? మనం రాలేదని వాళ్ళేం అనుకోరుగా’ అని అమ్మతో అంటే, ‘అది నిజమే కావచ్చుగానీ, వెళ్తే మాత్రం వచ్చారని సంతోషిస్తారు. అలాంటప్పుడు ఎందుకు వెళ్ళకుండా ఉండాలి? కలుస్తూ ఉంటే దూరపు బంధువులైనా దగ్గరవుతారు. కలవకపోతుంటే ఎంత దగ్గర వాళ్ళయినా దూరమైపోతారు. 

అంతా రాకపోకల్లోనే ఉంది. ఇక్కడలాకాదు, మనవైపు వూళ్ళల్లో పెళ్ళిళ్ళు ఎంత సరదా సరదాగా, సందడిగా ఉంటాయో వెళ్ళి చూడు. నీకు తెలుస్తుంది’ అని వాదించింది అమ్మ.ఆ పైన నాకూ కాదనలేని పరిస్థితి వచ్చిపడింది. నేను పనిచేస్తున్న పత్రిక తరపున ఒక ప్రముఖ రాజకీయనాయకుడి ఇంటర్వ్యూ తీసు కోవాల్సివుంది. ఆయన సొంతవూరు ఇదే. ఆయన కొంచెం ఖాళీగా ఇక్కడ రెండురోజులుంటారు కాబట్టి ఇక్కడ తన ఇంటర్వ్యూ తీసుకోవచ్చని చెప్పారు. దాంతో, ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నావు కాబట్టి పెళ్ళికీ వెళ్ళాల్సిందేనని అమ్మ నన్ను ఒప్పించింది.ఇంతలో భ్రమరాంబ పెద్దమ్మ ఎదురొచ్చి నవ్వు మొహంతో పలకరించింది. ‘‘నీ పనేదో నీదిగానీ నలుగురితో అంతగా కలవవని మీ అమ్మ అంటుంది. ఇలాంటి శుభకార్యాల్లో అయినా పది మందినీ కలిస్తే బంధుత్వాలు బలపడతాయి. కొత్త పరిచయాలూ కలుగుతాయి. మనసుకీ ఉల్లాసం, ఉత్సాహం...తెలిసిందా?’’ అంటూ నన్ను వెంటబెట్టుకుని ఇంటికి ఓ పక్కగా వేసిన షామియానా దగ్గరకు తీసుకెళ్ళింది.అక్కడ టిఫిన్‌ చేస్తున్న నా వయసువాళ్ళ పక్కన కూర్చోబెట్టి నన్ను పరిచయం చేసి నాకూ వేడి వేడి గారెలు, ఉప్మా వడ్డించి మళ్ళీ వస్తానంటూ వెళ్ళింది. టిఫిన్‌ పూర్తయ్యాక చేయి కడుక్కుని వెనకవైపు నుండి లోపలకు వచ్చాను. పెద్ద పెద్ద గ్యాస్‌ స్టవ్‌ల దగ్గర వంట చేస్తున్న వాళ్ళకి దూరంలో స్టూలు మీద కూర్చున్నావిడ సరుకులు అందిస్తోంది. అప్పుడే అటుగా వచ్చిన ఒక పెద్దాయన ‘‘పెద్దమ్మా...నువ్విక్కడ కూర్చున్నావా...శేరు వండాల్సిన చోట సోలెడే సరిపోతాయంటావు.

ఈ పూట మళ్ళీ వంట చేయాల్సి వస్తుంది చూడు....’’ నవ్వుతూ అన్నాడు. ఆవిడ ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ‘‘మామయ్యా...నువ్వు మొదటి బంతిలో కూర్చోకుండా ఉంటే చాలు...వండాల్సిన అవసరం రాదు. నే చెబుతున్నాగా....’’ అంటూ నవ్వింది. అందరూ కూడా వాళ్ళిద్దరితోపాటు పెద్దగా నవ్వారు. పెళ్ళివారింట్లో ఇలాంటి హాస్యాలు, పరిహాసాలు మా మూలే. అందుకే కాబోలు ఏ మాత్రం వీలున్నా అమ్మ శుభకార్యాలకు హాజరు కాకుండా ఉండదు.