ఆదివారం అవడంతో శివరామకృష్ణ ఇంట్లోనే ఉన్నాడు. సాయంత్రం బాల్కనీలోకి వచ్చి కూచున్నాడు కొడుకు పండుతో సహా. వాడు గుండెల మీదికీ, భుజాల మీదికీ ఎగబాకేస్తున్నాడు. తల్లి పకోడీల ప్లేటు తెచ్చి అందిస్తూ బాబుని లాక్కుని ఎత్తుకుంది.‘‘వేడివేడిగా తినండి. మీరు కూర్చోండత్తయ్యా - వాడ్నిలా ఇవ్వండి’’ అంది ప్రవీణ. ‘‘నువ్వూ రామ్మా - ఆ వాకర్‌లో వాడ్ని కూర్చోపెట్టి తలుపు లేసేయి. వాడే ఆడుకుంటాడు’’ అంది రాజమ్మ.వర్షాకాలం మొదలైంది. ప్రకృతంతా పచ్చచీర కట్టుకున్నట్లు కంటికి హాయిగా వుంది. కుండీలలోని పూల మొక్కలు విరగబూశాయి. కితకితలు పెడితే, కిలకిలా నవ్వినట్లు తుళ్ళింతలు పెడ్తున్నాయి పువ్వులు. గాలీ, మేఘాలూ - నిశ్శబ్దంగా పరుగు పందెం పెట్టుకున్నాయి. వాతావరణం ఆహ్లాద కరంగా వుంది. టేప్‌ రికార్డర్‌ నుంచి సన్నగా పాట విన్పిస్తుంది. నయనానందకరంగా ప్రకృతి, వీనులవిందుగా పాట, జిహ్హకు చవులూరించే - వుల్లి పకోడీ - ముగ్గురూ ఆ ఆనందం అనుభవిస్తున్న సమయంలో మొబైల్‌ మోగింది వారికి అంతరాయం కల్గిస్తూ. అందుకుని ‘‘హలో’’ అన్నాడు శివ.‘‘ఏం చేస్తున్నావురా? మన రమణకి పెళ్ళి నిశ్చయమయ్యిందని తెల్సు గదా - అసలు వచ్చే ఆదివారం బాచిలర్స్‌ పార్టీ ఇద్దామనుకున్నాడట. ఆ రోజు అమెరికా నుండి ఫ్రెండ్సొస్తున్నారట. అందుకని ఈ రాత్రికే అరేంజ్‌ చేస్తున్నాడట. తనమాటగా నీతో చెప్పమన్నాడు.

 షార్ప్‌ సెవన్‌కి, తప్పకరా - అందరూ వస్తున్నారు. తాజ్‌కృష్ణలో. ఏ వస్తున్నావు గదూ -’’ అవతల్నుండి రఘు.‘‘ఆ - ఆ - వస్తాను-’’ అన్నాడు శివ తల్లినీ, వీణనీ చూస్తూ వాళ్ళు ప్రశ్నార్ధకంగా చూస్తున్నా రతడ్ని.‘‘ఎవరండీ - ఏంటంట?’’ వీణ ప్రశ్నే తనది కూడా అన్నట్లు చూస్తుంది రాజమ్మ. రమణ పెళ్ళి గురించి చెప్పి ‘‘చిన్న ఫంక్షనుంది. వెళ్ళొస్తా. మీరు భోంచేసి పడుకోండి’’ అన్నాడు. అర్థమయ్యింది వారికి. డ్రింక్స్‌ పార్టీ అని. ‘‘వెళ్ళాలా?’’ అన్న తల్లి ప్రశ్నకి -‘‘అమ్మా - నేను మార్కెటింగ్‌లో జాబ్‌ చేస్తున్నాను - పదిమందితో కమ్యూనికేషన్స్‌ వుండి తీరాలి. భయపడకు - రెండు పెగ్స్‌ మించి తాగను. సరేనా?’’ అంటూ లేచాడు.్‌్‌్‌నాలుగు పుస్తకాలు గుండెలకి హత్తుకుని, ఎడమచేత్తో వాటిని పదిలంగా నొక్కిపట్టి; మెట్లెక్కివచ్చిన ఆయాసంతో నిలబడింది రాజమ్మ. ‘‘కొత్త పుస్తకాలా అమ్మా -’’ శివ ప్రశ్నకి చిన్నగా నవ్వుతూ - ‘‘అవున్నానా. కొత్త పుస్తకాలు మార్కెట్‌లోకొచ్చాయి చూడు’’ అంటూ చూపించింది. ఔన్నత్యం - మల్లాది, సద్గురు సుభాషితాలు, వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం, కొండఫలం - వాడ్రేవు వీరలక్ష్మీదేవి, శ్రీరమణ కథలు, పలుకరించే పరిమళాలు, డా. తిరుమల శ్రీనివాసాచార్య’’ పుస్తకాలు తిరిగీ ఆమెకిచ్చేస్తూ-- ‘‘ప్రతీ నెలా నేను నీ మందులకని ఇచ్చే డబ్బులు ఇలా తగలేస్తుంటావు. ఎక్కడ చూసినా నీ పుస్తకాలే... ఇంక కొనబాకు-’’ విసుగ్గా అన్నాడు.