లోకం అంతా బహు సందడిగా ఉంది.మానవులంతా ఆశ్చర్యపోతున్నారు - మానవాళి చరిత్రలో ఎన్నడూ ఎరగని కొత్త సంగతి చోటు చేసుకోవడమే దానికి కారణం!శాస్త్రజ్ఞులూ సంబరపడిపోతున్నారు. ఎంత అభివృద్ధి సాధించినా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో రకాల మార్పు చేర్పులకు దోహదపడినా, ఇంతవరకూ తన ఆయుష్షును పెంచుకోగల పద్ధతులు మాత్రం మానవుడికి తెలియరాలేదు!!ఇంతకాలం తమకు కొరుకుడు పడని అంశం, తాము కలలోనూ ఊహించని విషయం - ఇప్పుడు దానంతట అదే తెలియవచ్చే అవకాశం రావటం..మానవులకు పండుగలాగే ఉంది!!వైకుంఠంలో పాలకడలి కెరటాలు ఎగిసి ఎగిసి పడుతున్నాయి. విష్ణుమూర్తివారు పాలకెరటాలపై, శేషతల్పం మీద వయ్యారంగా శయనించి ఉన్నారు. ఆ స్వామి పాదాల చెంత లక్ష్మీదేవి పద్మాసనం మీద కూర్చుని, సుతారంగా స్వామివారి పాదాలను పడుతోంది. వాళ్లను చూసిన ఎవరికైనా, ఈ విశాల విశ్వం అంతా క్షేమమేనన్న అభిప్రాయం కలగక మానదు.అయితే, మనం ఒకటి ఊహిస్తే దైవం మరొకటి ఆశిస్తుందన్న రీతిలో కాబోలు, ఎక్కడో దూరంనుంచి హాహాకారాలు వినవచ్చాయి. భక్తుల మొరలు వినటం అలవాటవటంతో, శ్రీహరి కుయ్యాలించకమునుపే, ఆ హాహాకారాలు రానే వచ్చాయి. వెంటనే, ఓ చెవిని అటు పడేసిన విష్ణుమూర్తి వర్యులకు విషయం అర్థమయింది. తల పంకించి, మళ్లీ తన చిద్విలాస మందహాసం కొనసాగించారు.ద్వారపాలకులలో ఒకరైన విజయుడు పరుగు పరుగున వచ్చాడు.‘‘స్వామీ! స్వయంగా బ్రహ్మగారు నేరుగా వచ్చేశారు, ప్రవేశ పెట్టమని ఆనతా?’’ అని అతి వినయంగా అడిగాడు.విష్ణుమూర్తి చిరునవ్వుతో, తల ఊపారు. విజయుడు బహు వినయంతో వెళ్లిపోయాడు.క్షణకాలంలోనే, బ్రహ్మదేముడు లోనికి విచ్చేశాడు.

‘‘తండ్రీ! నమస్కారం!!’’ అంటూ గౌరవ సూచకంగా అభివందనం చేశాడు బ్రహ్మ.‘‘ఏం ఆపద ముంచుకొచ్చింది నాయనా? సృష్టి చేయాల్సిన పనిని పక్కన పెట్టి, ఇంత ఆదరాబాదరాగా వచ్చావ్‌?’’ అని ఆరా తీశారు విష్ణుమూర్తి.‘‘ఆపద అని నెమ్మదిగా అంటారేమిటి నాన్నగారూ! నా కొంప మునగబోతోంది!! భూలోకంలో.. అందునా మన వేదభూమి, పుణ్యభూమి భారతదేశంలో సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి కదా..’’‘‘అది ప్రతీ అయిదేళ్లకూ జరిగే కార్యక్రమమే కదా! ఇప్పుడే ఏం కొత్తగా కొంప మునుగుతోందో చెప్పు’’ అన్నారు విష్ణుమూర్తి వారు.‘‘ప్రతీ ఎన్నికల సమయంలోనూ మనం ఇలాగే అనుకోవటం పరిపాటే కదా తండ్రీ! కానీ, ఈ సారి పూర్తిగా తన కొంప మునిగిపోయే కాలం వచ్చేస్తోందని తల్లి భూమాత గగ్గోలు పెట్టేస్తోంది! మాతృమూర్తి ఆ విషయం మీతో మొరపెట్టుకున్నా, మీరు పెడచెవిన పెడుతున్నారనీ తల్లి ఆవేదన!! అందుకే, ఈ సారి ఆ బాధ్యతను నామీద మోపింది అమ్మ!!’’ బ్రహ్మ అంటున్నది వింటున్నా, విననట్లు ఉండిపోయారు విష్ణుమూర్తి వారు.