నర్సింగరావు చనిపోయి అయిదు నెలలు దాటింది. అతను చనిపోయాకే మొదటిసారిగా వాళ్లింటికి వెళ్లాను. అప్పుడే అతని భార్య సరస్వతిని చూసాను. మొదటిగదిలోనే ఒక మూలనున్న కుర్చీలో కూర్చుని ఉంది. అతని పార్థివ శరీరం గది చివర్ల్లో ఉంది. తీసుకువెళ్లిన గులాబీ దండ అతని శరీరం మీద వేసి చేతులు జోడించి నమస్కరిస్తూ నిమిషంపాటు కళ్లు మూసుకుని అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నాను.ఆమె కూర్చున్న దగ్గరకు వెళ్దామనుకున్నాను. నేను ఎవరో ఆమెకు తెలియక పోవచ్చు కాబట్టి నన్ను నేను పరిచయం చేసుకుని విచారం తెలియచేద్దామనుకునేంతలో న లుగురైదుగురు ఆడవాళ్లు ఆమె చుట్టూ చేరేసరికి నా ప్రయత్నం విరమించుకోవలసి వచ్చింది. తర్వాత వీలుకాలేదు. మా ఆఫీసు వాళ్లూ, అతను పనిచేసిన డిపార్ట్‌మెంటువాళ్లు చాలామంది వచ్చేసరికి ఆమెను కలిసి మాట్లాడలేకపోయాను.అంతకు ముందు ఏడెమినిదిసార్లు అతనిని నా కారులో వదిలిపెట్టడానికి వచ్చినపుడు తన ఇంట్లోకి రమ్మని అతను నన్ను ఎప్పుడూ పిలవలేదు. నా ఇంటికి మట్టుకు చాలా సార్లు వచ్చాడు. ఇంట్లో ఉండేది నేను ఒక్కడినే కాబట్టి అతను ఫ్రీగా మెలిగేవాడు.ఆఫీసులో భోజన విరామసమయంలో స్టాఫ్‌ క్యాంటిన్‌లో భోజనం చేసాక నా గదిలో అరగంటపాటయినా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్లం. అతనే ఎక్కువ మాట్లాడేవాడు. నేను అతనంత మాటకారిని కాను. నాకంటే ఏడెనిమిదేళ్లు చిన్నవాడయినా నాకు దిక్సూచిలా ఉండేవాడు.

అతను చనిపోయేనాటికి మంచి హోదాలో ఉన్నాడు. బతికి ఉంటే తేలికగా జనరల్‌ మేనేజర్‌ అయి ఉండేవాడు. నా హోదా అతనంత పెద్దది కాదు.మా సంస్థ లేడీస్‌ వెల్ఫేర్‌ సెంటర్‌ ద్వారా కంపేషనేట్‌ గ్రౌండ్స్‌మీద సరస్వతి కంప్యూటర్‌ విభాగంలో అప్రెంటిస్‌గా చేరింది. ఆమె చేరిన మూడు వారాల తర్వాత గాని భవాని నాకు ఆ విషయం చెప్పలేదు. భవాని నర్సింగరావుకు దగ్గర మనిషి. ఆమెను నాకు పరిచయం చేసింది అతనే.అప్రెంటిస్‌లకు ఎంత చదువున్నా నాలుగువేల కన్నా ఎక్కువ జీతం ఉండదు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం బ్రేక్‌ ఇచ్చి తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటారు. సంస్థ బస్సుపాస్‌లు ఉండవు.