మా ఊరికి ఎన్మిది మైల్ల దూరంల యాద్గిరి గుట్ట ఉన్నది. గాడ నర్సిమ్మసామి గుడి ఉన్నది. గుట్ట జాత్ర దూమ్‌దామ్గ అయితది. జాత్రకు మన రాష్ట్రంల వున్న అన్ని ఊర్లకెల్లి జెనం వొస్తరు. జాత్ర దినాన గుట్ట మీద రతం గుంజుతరు. జాత్ర దినాలల్ల గుట్టల హరికతలు, బుర్రకతలు జెప్తరు. డ్రామలు ఏస్తరు. మా ఊరికెల్లి గుట్టకు అర్దగంటకొక బస్సు ఉన్నది. రేల్లబోతె రాయిగిరి టేషన్ల దిగి టాంగల గుట్టకు బోవాలె. మేమైతె సైకిల్ల మీదనే గుట్టకు బోయెటోల్లం.గా దినం గుట్ట జాత్ర. నేను, బక్కోడు, గుండుగాడు, గున్నాలోడు రెండు సైకిల్లు కిరాయికి దీస్కున్నం. గింత దిని పొద్దుగాల్లే సైకిల్ల మీద గుట్టకు బోయినం. సగం దూరం నేను సైకిలు దొక్కితె సగం దూరం బక్కడు సైకిలు దొక్కిండు. గుండుగానికి సైకిలు దొక్కరాదు. గాన్ని గూసుండబెట్టుకొని గుట్టదాంక గున్నాలోడే సైకిలు దొక్కిండు. నడ్మ రాయిగిరి టేషన్‌ కాడ ఆగినం. గాడ ఈతచెట్లున్నయి. ఈత పండ్లు దెంపుకోని తిన్నం.గుట్ట కింద మా దోస్తు న ర్సిమ్మచారి ఉన్నడు. గాడు దినాం బోన్గిరికొచ్చి మా బల్లెనే సద్వుకుంటడు. గానింట్ల సైకిల్లు బెట్టినం. మెట్లెక్కి గుట్టమీద్కి బోయినం. గుట్ట మీద యాడ జూసినా జెనమే. దర్శనం జేస్కునేతందుకు మాకు మూడు గంటలు బట్టింది. గుల్లెకెల్లి వొచ్చినంక పులిహోర పాకిట్లు గొనుక్కోని తిన్నం.

తిన్నంక డ్రామాలు ఆడెతాన్కి బోయినం.మోపర్రదాసు అనేటాయిన హరికత జెప్తున్నడు. మేము గాడ గూసోని హరికత ఇన్నం. హరికత అయినంక ఒక పొల్ల డాన్సు జేసింది. గాడికెల్లి గుండం తాన్కి బోయినం. గుండంల మస్తు మంది తానాలు జేస్తున్నరు. గుండం కెల్లి శివుని గుడికి బోయినం. అటిటు దిర్గెతల్కె పొద్దు మీకింది. గుట్ట మీద రంగురంగుల దీపాలు బెట్టిండ్రు. దీపాలతోని గుట్ట చమ్కాయించబట్టింది.చాయ్‌ దాగి మల్ల డ్రామలు జూసెతందుకు బోయినం. మేము బోయెతల్కె బాగోతం ఆడ్తున్నరు. బాగోతం సత్తెబామ జూసి గీ పొల్ల ఎంత బాగున్నది అని అనుకున్నం. బాగోతంల సత్తెబామ ఏసం గట్టింది. వేదాంతం సత్యనారాయణ అని మాకు పెద్దగైనంక ఎర్క అయింది. బాగోతం అయినంక కృష్ణరాయబారం డ్రామ ఆడిండ్రు. గా డ్రామల రఘురామయ్య కృష్ణుని యేసం గట్టి ‘బావా ఎక్కడ నుంచి రాక’ చెల్లియో చెల్లకో చేసిన యొగ్గులు సైసిరి. ‘జెండా పై కపిరాజు’ అసుంటి పద్దెంలు బాడ్తుంటె వన్స్‌ మోర్‌ వన్స్‌ మోర్‌లే. కృష్ణరాయబారం అయినంక రఘురామయ్య ఈలపాట బాడిండు.