అవసరాల రామకృష్ణారావుకంటి పరీక్ష పూర్తికాగానే, ఆ ఊర్నించి బయల్దేరి ఈ ఊరు వచ్చినందుకు సంతృప్తే మిగిలింది ప్రభాకరానికి. ఫీజు ఎక్కువే కావచ్చు గాని ఎగ్జామినేషన్‌ థరోగా జరిగింది. అన్నిట్నీమించి డాక్టరు గారి అనునయ వాక్యాలుఆయన్నెంతో సేదతీర్చాయి. ‘‘కుడి కంటిలో శుక్లం మెచ్యూరయింది. మొదటదాని కాపరేషన్‌ జరగాలి. రెండో కన్ను ఇంకో ఏడాదిలో కాటరాక్టు ముదిరి ఆపరేషన్‌కి సిద్దం కావొచ్చు. అందుకనే మొత్తమ్మీద విజన్‌ మీకంత పూర్‌గా ఉంది. అప్పుడు బాగా చీకటి పడిపోయింది. ఇంత రాత్రివేళ ఎక్కడికి వెడతారు? మా బాయ్‌ని మిమ్మల్నేదైనా లాడ్జి దాకా దిగబెట్టి రమ్మననా?’’ అన్నాడు.‘‘ఆక్కర్లేదండీ ఆటోస్టాండు దాకా రమ్మనండి, చాలు. రైల్వేస్టేషనుకి మాట్లాడుకుంటాను.

పాసెంజర్లో వచ్చేస్తాననీ, స్టేషనుకి రమ్మని అబ్బాయికి చెప్పాను. నో ప్రోబ్లమ్‌’’ అంటూ థాంక్సు చెప్పి చేతికర్ర పట్టుకు నడుస్తూ ఆటోస్టాండు చేరుకున్నాడు ప్రభాకరం. అక్కడే అనుకోకుండా కలిసింది సరస్వతి ‘‘మేష్టారూ, మీరా? ఎన్నేళ్ళైంది. ఎంతదృష్టం!’’ అనుకుంటూ.పత్రికల్లో పేజీలు తిప్పినట్టుంటుంది. విద్యార్థులతో టీచర్ల పరిచయం, పాతికేళ్ళకి పైగా వేల కొద్దీ విద్యార్థులతో జ్ఞాపకాలయితే మరీను. పత్రికల్లో పేజీల్లో కూడా ఒకటో రెండో మరోసారి వెనక్కి తిప్పి చదువుకోవాలనిపిస్తుంది. అందుకే కలుసుకుని పదిహేనేళ్ళకి పైగా ఆయన తన దగ్గర చదువుకున్న సరస్వతిని అట్టే ఇబ్బంది లేకుండా గుర్తు చేసుకోగలిగాడు ప్రభాకరం. అందుకే డాక్టర్‌ సలహాని తిరస్కరించినా సరస్వతి ఆహ్వానాన్ని అతడు కాదనలేక పోయాడు. మేష్టార్ని పక్కన కూచోబెట్టుకుని తన యింటివైపు ఆటోని మళ్ళించింది సరస్వతి. ఇక దారి పొడుగునా ఆ కబుర్లే కబుర్లు. ‘‘మేష్టారూ మీరా రోజుల్లో మాకు చెప్పిన ఆ భర్తృహరి సుభాషితంలోని ఆ భాగం మీకు గుర్తుందా? ఏదనుకున్నారు. ‘సాధు సద్గుణలవంబులు కొండలు చేసి మెచ్చుచున్‌’ అనేది. పుస్తకాల్లో చదివితే ఇలాంటి వాళ్ళుంటారా! అనుకుంటాం. ఎప్పుడు ఏ పుణ్యం చేసుకున్నానో అలాంటి ఇంట్లోనే పడ్డాను. 

మా అత్తగారూ, మామగారూ, మా ఆయన అందరిదీ అలాంటి వెన్న పూస మనస్తత్వం. ఇక నా కొడుకులిద్దరూ వంకలేని చంద్రవంకలు... నిజంగా నేనెంత అదృష్ట వంతురాలో, మీ కళ్ళతో మీరే చూస్తారుగా!’’నిజానికి ఆ మసకచీకటి వేళ, కంటి దృష్టి లోప భూయిష్టమైన సందర్భంలో, ప్రభాకరానికి సరిగా చూసే అవకాశం ఎలాగా లేదు. అయినా వీనులవిందుగా ఆ అమ్మాయి అందిస్తున్న కబుర్లు మనసుకెంతో మధురంగా ఉన్నాయి. బాహ్యదృష్టికి అందినకాడికి సరస్వతి కాస్త చిక్కి పోయిం దేమో అనిపించింది. ఆమె వెలిబుచ్చే తృప్తి ముందు అది ఏ పాటిది!అంతేకాదు ఇంటికెళ్లి సరస్వతి పిల్లల్నీ, అత్తమామల్నీ కలుసుకున్నాక, ఆ అమ్మాయి చెప్పిందాంట్లో ఆవంత అబద్దం లేదనిపించింది.