మూడు రోజులుగా ఆ యింట్లో గాలీవానా ఆగుతూ లేస్తూ తుంపరలా తగ్గుతూ చెలరేగుతూనే ఉన్నాయి. మాటలూ విరుపులూ అంతెత్తు నుంచి జారిపడే పొత్తరాల్లా దొర్లుతూనే ఉన్నాయి. ఆ కోవనవెళ్తూ నిన్న జారవిడిచిన కొసరు మాటను ముడుపులా అందుకొని మేనత్త భాగ్యం మళ్ళీ అందుకుంది. ‘‘అంత అమాయకంగా ముఖం పెట్టి ఎంతెత్తు నిర్ణయాలు తీసుకుంటావురా అబ్బీ! ఎవర్ని అడిగి ముక్కూ ముఖం ఎరగని ఆ అబ్బాయిని మూటా ముల్లెతో సరాసరి యింటికి వచ్చేయమన్నావు? పావని ఫోను చేసింది. నాలుగైదు రోజుల్లో ఎక్స్‌కర్షన్‌ నుంచి వచ్చేస్తున్నానని. ఇపడేం చేస్తావు?’’ కృష్ణమూర్తి తలెత్తి చూసి కనుబొమ లెగరేసి ఓసారి కన్నార్పకుండా మేనత్త వేపు దృష్టి సారించి మౌనంగా కదలబోయాడు. 

మేనత్త భాగ్యం అంత త్వరగా విడిచిపెట్టే వ్యక్తి కాదు. ఆమె జలగ లాంటిది. ఆయాసం వచ్చేవరకూ మాట్టాడితే గాని కడుపులో తిపడు తగ్గదు.‘‘అడుగుతున్నది నిన్నేరా మూర్తీ’’! గదమాయిస్తూ మేనల్లుడికి అడ్డువచ్చి నిటారుగా నిల్చిందామె. ‘‘చెప్పాను కదత్తయ్యా! పావని అదే సమయాన యింటికి రావచ్చన్న విషయం తెలియదని’’‘‘నేను చెప్పలేదూ - స్టేషనుకి వెళ్లి దానిని తీసుకురమ్మనమని’’‘‘చెప్పావత్తయ్యా! సరైన తారీఖు చెప్పనందున ఆఫీసు గొడవల్లో పడి మర్చిపోయాను’’.‘‘అలాగని తెలియదని మాత్రం అనకు’’.అపడు వేదమూర్తి చెల్లికి వత్తాసుగా అక్కడకొచ్చి నిల్చున్నాడు. ‘‘చదవక ముందు బాగానే అనేవాడట - కాకర కాయని. చదివింతర్వాత వాడు కీకరకాయ అనడం ఆరంభించాడట.

నీ మేనల్లుడు అటువంటివాడు. అడ్డమైన వాళ్ళందరితోనూ భుజాలు పూసుకుని తిరుగుతుంటే బుర్ర ఎలా పనిచేస్తుంది. దారెలా కనిపిస్తుంది. రెండునెల్ల క్రితం అమ్మ ప్రేమతో మెళ్ళో వేసిన గొలుసుని ఎక్కడో పడేసుకున్నాడు. అదీను తానుగా చెప్పాడా - నేనడిగిన తరువాత - చావు కబురు చల్లగా చెప్పినట్లు - విషయం బయటపెట్టాడు. అది విని అమ్మ ముఖం ఎంతలా వాడిపోయిందో! నీరసంగా ఉన్న అమ్మ గుండె ఎగిసిపడిందో!’’‘‘అదిగో! మళ్లీ అదే ఊసు ఎత్తారూ అన్నా చెల్లెల్లిద్దరూ! అందుకే అంటారు పాడిందే పాడరా పాచిపళ్ళ దాసడా! అని అదే డి జైను గొలుసు చేసి వాడి మెళ్లో వేస్తానన్నాగా!’’ ఇంకెన్నిసార్లు చెప్పాలి మరి?’’ వనజాక్షి వంటగది నుంచి రివ్వున దూసుకువచ్చి అడ్డుగోడలా నిల్చుంది వాళ్ళ మధ్య. ‘‘ముద్దుల కొడుకుని మహాగొప్పగా వెనకేసుకొచ్చావులే! మనమందరమూ చేరి పది గొలుసులు చేసి పెట్టినా మా అమ్మ ఆశీర్వదించి వేసిన ఆ ఒక్క గొలుసుకీ ఈడు కాదే వనజాక్షీ! మా మామ్మగారిచ్చిన బంగారం కరిగించి చెరిపించి మనవడికి అప్యాయంగా వేసిన ఆభరణం అది. అందులో ఉన్నది బంగారం మాత్రమే అనుకోకు. అందులో మా అమ్మ తనువంతా ఉంది మమతంతా ఉంది. దానిని నిర్లక్ష్యంగా పారేసుకునే హక్కు వీడికి లేదు’’ అన్నాడు వేదమూర్తి.