‘‘అవయవాలు పనిచేసే తీరు ఒకటే అయినా, బాహ్యంగా దర్శనమిచ్చే రూపుతీరు సమాజంలో ఓ ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుందన్నది కటిక నిజం. రుచి ఒకేలా ఉన్నా అరటి ఆకులో ఉప్మా తినడానికీ, బోన్‌చైనా ప్లేటులో తినడానికీ తేడా లేదంటారా?’’ రామకృష్ణ ఓ పెగ్‌ రమ్‌ని గ్లాసులో పోసుకొంటూ అన్నాడు.‘‘అది వ్యక్తుల అభిరుచినిబట్టి ఉంటుంది. అరటి ఆకు ఆరోగ్యకరమని భావించేవారికి ఒకరు తిన్న తర్వాత కడిగిన ప్లేట్లలో తినడానికి యిష్టముండదు.

కొంతమందికి సుకుమారమైన శరీరాలు అందంగా కనబడ్తే, మరికొంత మందికి మొరటు దేహాలూ, నాటు శరీరాలూ ఇష్టమౌతాయి. ఏది ఏమైనా స్ర్తీ, పురుషులిరువురూ అంతరాంతరాల్లో ఆకర్షణీయంగా కనబడేవారినే కోరుకొంటారు. ఇదీ సత్యమే!’’ అన్నాడు మురళీ చల్లటి బీరుగ్లాసుని పెదాలకు అంటిస్తూ.‘‘బాహ్యంగా చెప్పుకోడానికి, మాట్లాడ్డానికీ కాస్త ఇబ్బందికరంగా ఉన్నా ఈ స్ర్తీ పురుష సంబంధమనేది యావత్ప్రపంచాన్నీ నడిపిస్తుంది. వయసుతో ఇరువర్గాల వారికీ ప్రకృతి సహజంగా వచ్చే ఈ కామప్రకోపాలకి ఓ మార్గం చూపి సాధికారతని ఇవ్వడానికి సమాజం వివాహమనే వ్యవస్థని రూపొందించింది. అయితే ఉన్న విచిత్రమేమిటంటే నాలుగ్గోడలమధ్యా జరిగే దంపతుల పవిత్ర శృంగారలీలలు బాహ్యమైతే అశ్లీలంగా భావించబడ్తాయి! ఇంట జీవిత పరంగానూ, బయట వృత్తిపరంగానూ అభివృద్ధి సాధించాలంటే సంతృప్తికరమైన వైవాహిక జీవితం అవశ్యమని యిటీవలి పరిశోధనలు తేల్చి చెప్తున్నాయి.’’ అన్నాడు బాలకృష్ణ.‘‘ఈ విషయానికి వేరే పరిశోధనలు కూడాను? యింగిత జ్ఞానమున్న ప్రతివారూ గ్రహించవలసిన సంగతిది.. ఈ విషయమై మన ప్రాచీనులు చాలా గ్రంధాలే రాశారు.

 అవి అనేకమైన ప్రపంచ భాషల్లోకి అనువదింప బడ్డాయి. దాంపత్య జీవితంలోని సంతృప్తికి అందమే ప్రధమసోపానం!’’ అన్నాడు రామకృష్ణ.‘‘అలాగని అందరికీ అందమైన భాగస్వాములు ఎలా లభిస్తారని?’’ మురళి ప్రశ్నించాడు.‘‘లభించరు! అయితే గంతకు తగ్గ బొంతలు ఉంటాయని సామెత ఉంది కదా? యిది కాస్త మొరటుగా అనిపిస్తే- వివాహాలన్నీ రాసిపెట్టి ఉంటాయని మనమంటే, అవి స్వర్గంలోనే నిర్థారించబడ్తాయని పాశ్చాత్యులు కూడా అంటారు. కౌమార దశలో అందం మీద ఉన్న మోజు, వయసు మీదికొచ్చిన కొద్దీ రాజీ మార్గాలు పడ్తుంది. ఈ కారణంగా వివాహవ్యవస్థ ముందుకు కొనసాగుతూనే ఉంటుంది.’’ అన్నాడు రామకృష్ణ.