కార్తికేయరావు ఆ వూరికి రావడం మంచిదే అయింది. ఆ గృహప్రవేశ మహోత్సవానికి అతను వచ్చినందుకు అతని స్నేహితుడు విద్యాసాగర్‌తో పాటు కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషించారు. ఆ పల్లెటూర్లో కార్తికేయరావు స్నేహితుడు విద్యాసాగర్‌ ఓ డాబా ఇంటిని కట్టించాడు. అతను ఆ వూరి స్కూల్లోనే టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. స్నేహితుడి మనసు గాయపరచడం ఇష్టంలేక తను వుంటున్న నగరం నుంచి వీలు చూసుకొని ఆ పల్లెటూరికి వచ్చాడు కార్తికేయరావు.మధ్యాహ్నం భోజనాలయిన తరువాత సాయంత్రం నాలుగు గంటల వరకూ విశ్రాంతి తీసుకొని ఆ పైన వాళ్లందరి దగ్గరా సెలవు తీసుకొని తిరుగు ప్రయాణం అయినాడు.జంక్షన్‌ వరకూ వెళ్లే బస్సు వూళ్లోకి రాదు. ఊరు పక్కనుంచి వెళుతోన్న తారురోడ్డు మీద ఒకచోట ఆగుతుంది. అక్కడకు వెళ్లి బస్సు ఎక్కాలి. సాయంత్రం నాలుగున్నరకు బస్సు వుందని చెప్పాడు విద్యాసాగర్‌. అక్కడి నుంచి ఓ పది నిమిషాల నడక.ఊరును ఆనుకునే పొలాలు. 

అన్నీ జొన్నచేలు. వాటికి మధ్య వున్న గట్టు మీద నుంచి నడిచి వచ్చి ఓ పొలం మలుపు తిరిగితే తారు రోడ్డు కనపడుతుంది. రోడ్డు పక్కనే పెద్ద నేరేడు చెట్టు.అదే బస్టాపని చెప్పాడు విద్యాసాగర్‌.‘‘ఇక నువ్వు వెళ్లు... ఇంటినిండా బంధువులు వున్నారు గదా’’అన్నాడు కార్తికేయరావు.ఓ పదినిమిషాలు అక్కడ నిల్చుని వెళ్లిపోయాడు విద్యాసాగర్‌.సాయంత్రం ఎండలో తీక్షణత లేదు. అయిష్టంగా తల వూపుతున్నట్లు గాలికి కదులుతోంది నేరేడు చెట్టు.కార్తికేయరావు అరగంట సేపు నిల్చున్నా బస్సు రాలేదు. దూరం నుంచి రావాలనీ, ఒక్కొక్కసారి లేటుగా వస్తుందని చెప్పాడు విద్యాసాగర్‌ ఇంతకు ముందు బస్సు గురించి.రాని బస్సు గురించి ఆలోచిస్తున్నపడు కార్తికేయరావు దగ్గరకు జొన్న చేనుపక్క నుంచి నడిచి ఒకాయన వచ్చి నిల్చున్నాడు.కొంచెం పెద్దాయన. కార్తికేయరావు తండ్రి బతికి వున్నట్టయితే అంత వయసు వుండి వుంటుంది. సన్నగా కొంచెం పొడవుగా వున్నాడు. బిళ్ల గోచీపోసి ధోవతి కట్టుకున్నాడు. పొడుగు చేతుల చొక్కానుసగం చేతుల వరకూ మడుచుకున్నాడు. పూర్తిగా నెరిసిన తలవెంట్రుకలు. చేతిలో లగేజీ ఏమీ లేదు.‘‘బస్సు రాలేదుకదా’’ అని అడిగాడు ఆయన కార్తికేయరావును.‘‘ఇంకా రాలేదు’’ అన్నాడు కార్తికేయరావు.‘‘ఈ బస్సులు ఎపడూ సమయానికి రావు’’ అన్నాడాయనఆయన్ని కొంచెం పరీక్షగా చూసిన తర్వాత కార్తికేయరావుకు తండ్రి గుర్తుకు వచ్చాడు. అప్రయత్నంగా అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తండ్రి చనిపోయిన తర్వాత కార్తికేయరావుకు తండ్రి మీద ప్రేమ మరింత ఎక్కువయ్యింది.సంసారాన్ని నెట్టుకు రావడానికి తను పడుతున్న ఇబ్బందులను చూసిన తర్వాత తండ్రి తమనందరినీ ఎలా పెంచాడో, అందుకు ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నాడో గ్రహించిన అనంతరం తండ్రి మీద అతనికి వున్న ప్రేమ రెండింతలయ్యింది.