జరీఅంచు తెల్లచీర!విశాలాక్షికి ఏడుపు వస్తోంది.గదిలో కుక్కిమంచంలో కూలడి చూస్తోంటే, ఎదటకొట్లో, హరికెన్‌ లాంతరు గుడ్డి వెలుగులో, ఫిజిక్స్‌ పాఠం చదివే అన్నయ్యా, పదమూడో ఎక్కం కంఠస్థం చేసే తమ్ముడు కనిపిస్తూనే వున్నారు.రాత్రి తొమ్మిది గంటలు దాటింది.వెనక వరండాలో నిద్దర పట్టక అమ్మ దొర్లుతోన్నట్టుగా ఉంది. చిన్న తమ్ముడు మధ్య మధ్య ఏడుస్తున్నాడు. అగ్గిపెట్టె కోసం కాబోలు, నాన్న అటూ యిటూతిరుగుతున్నాడు.జరీ అంచు తెల్లచీర!ఎప్పుడు కొనడం? ఎప్పుడు కట్టుకోడం?ఏమో! ఎప్పుడో!ఎప్పటినుంచో వస్తోన్న ఈ తీరని కోరిక ఎప్పుడు తీరుతుంది?ఎప్పుడో! ఏమో!ఎప్పుడో ఒకప్పుడు ఆ కోరిక తీరకపోదనే అనుకొంది.ఆ కోరిక తీరాలనే అనుకొంది ఈనాటి వరకూ.కాని, ఈ రోజు మాత్రం...ఈ నాటికి పదేళ్ళ క్రితం...ఆరేళ్ళ విశాలాక్షి సినిమాకి వెళ్ళింది.అది ప్రప్రథమం, సినిమాహాల్లో అడుగు పెట్టడం.విశాలాక్షి విశాలాక్షయింది.ఆశ్చర్యం? ఆనందం? కాదు;మైకం!ఆట ఇంకా ఆరంభం కాలేదు.ఆరేళ్ళ కళ్ళని హాలంతా గిరగిర తిప్పే విశాలక్షికి, ఆఖరి వరస కుర్చీల్లోకి అప్పుడే వస్తోన్న ‘‘ఆవిడ’’ కనిపించింది.ఎవరావిడ?‘‘ఆవిడ!’’ అంతే.హాలునిండా ఉండే దీపాల్లోకి దీపంలా వస్తోందావిడ.నవయౌవన విలాసిని, సుమథుర హాసిని. శుభ్రజ్యోత్స్నాంబరధారిణి.తెల్లటి మనిషి మెల్లగా నడుస్తూ వస్తోంటే, ఆమె కట్టుకున్న వెన్నెల్లాంటి తెల్లచీర తళ తళా మెరుస్తోంది.

‘‘అమ్మా! నాకలాంటి చీర కొనవే!’’‘‘ఇష్‌ నోర్ముయ్‌!’’ఇంతలో దీపాలు ఆరడం తెరమీద బొమ్మలు కదల్డం జరిగాయి.కృష్ణుడి పాట, గోపికల నాట్యం.తెల్లగా వెలిగేవి గోపికలు కట్టుకున్న తెల్లచీరలు.తళుక్‌ తళుక్‌ మనేవి ఆ చీరల జరీ అంచుల తళుకులు.సినిమా అయాక, బైటకి వచ్చాక, మళ్ళీ‘‘అమ్మా! నాక్కొనవూ అలాంటి చీరా!?’’‘‘ఇప్పణ్ణించీ కోరికలు బావున్నాయే తల్లీ! కొంటాంలే నీ పెళ్ళినాడు’’‘‘ఎప్పుడే, ఎప్పుడే అమ్మా?’’అమ్మా వాళ్ళూ నవ్వేరా?నవ్వేరు.విశాలాక్షికి ఏడుపు వస్తోంది.ఆరేళ్ళ ఆడపిల్ల కోరిన కోరికే పదహారేళ్ళు ఎదిగిన ఆడపిల్ల కూడా కోరుతూ వచ్చింది.ఈ కోరిక్కి వచ్చేయి పదేళ్ళు.ఈ కోరికలన్నీ ఇలా పెరిగి పెద్దవయి చివరికి...విశాలక్షికి ఏడుపు వస్తోంది.జరీఅంచు తెల్ల చీర!‘‘కొందాంలే’’ అనేసేవాడు నాయన.నాన్న నోట్లో ఉండేది చుట్ట, అతని మనసులో ఉండేది పొగ. అతనికి ఉన్నది ఉద్యోగమా? అబ్బే! నౌఖిరీ! అతని చేతిలో లేనిది.‘‘ఉన్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు కొంటాలే’’ఎప్పుడో ఒకప్పుడు శుభముహూర్తం వస్తుందని విశాలాక్షి చూస్తోనే వచ్చింది.ఎంతోకాలం నుంచి ఎన్నెన్నిటికోసమో ఈ విశాలాక్షి చూస్తోనే ఉంది.ఈ విశాలాక్షి సజలనయనగా, వ్యర్థంగా... విశాలక్షికి ఏడుపు వస్తోంది.జరీ అంచు తెల్లచీర!‘‘ఎన్ని ఖర్చులున్నాయో... నువ్వెరగవా... మీ నాయన చచ్చిచెడి... ఆ నాలుగురాళ్ళూ... ఏదో అదీఇదీ... జాగ్రత్తచేసి.. తంటాలు పడకపోలేదు. చూడూ... ఈ ఏడు నీపెళ్ళి... చెయ్యక తప్పదు కదా... నీకు నచ్చిన చీరలు... కొనకపోతే అలా అను’’.