తప్పు చేసినవారిని క్షమించవచ్చు.కానీ...శిక్షనుంచి తప్పించుకునే వారిని మాత్రం కాదు.గత రెండు రోజుల్నించీ గమనిస్తున్నాడు. ఇల్లంతా... ముసురు పట్టిన నిశ్శబ్దంతో గుబులు గుబులు పోతోంది.చిక్కటి చీకటి నీడేదో గుండె మీద వాలి, తెలీని విషాదానికి గురిచేస్తున్నట్టుగా వుంది ప్రాణం. కిటికీలోంచి వీస్తూ గాలి జాలీగాతాకిపోతోంది.ఇల్లంతా నిశ్శబ్దం... ఒకటే నిశ్శబ్దం. అంతకంతకీ పుట్టలు పుట్టలుగా పేరుకుపోతోన్నట్టు!ఓ కొండచిలువ - ఏమాత్రం సడి లేకుండా... గోడల్ను చుట్టుకుంటున్నట్టు, తెలీని గగుర్పాటు కలిగిస్తూ...ఏమిటివిన్నీనూ? ఎందుకనీ ఇలా అనిపించటాల్నూ?వాకింగ్‌ నించి ఇంటికొచ్చి సోఫాలో కూర్చుని షూ విప్పతీసుకుంటున్న శ్రీకాంత్‌కి ఆ నిశ్శబ్ద వాతావరణం వెంటాడసాగింది. ఇదంతా తన భ్రాంతి, భ్రమ అని తను కొట్టిపారేయలేదు. ఎందుకంటే - ఇదే నిశ్శబ్దం.ఇదే బాధ, ఇంతకు ముందొకసారి అతననుభవించాడు కాబట్టి!అదెప్పుడంటే తల్లి మరణ వార్త వినడానికి సరిగ్గా సరిగ్గా అరగంట ముందు. ఇప్పుడూ ఇలాగే, అచ్చు ఇలాగే... ఈ కటిక నిశ్శబ్దం... గుండెని మెలి పెట్టిందతన్ని. 

ఇప్పుడేం జరగబోతోందనీ, ఇంతగా హెచ్చరిస్తున్నట్టు?వంట గదిలో పనమ్మాయి - లీల కూడా... బిక్కు బిక్కుమంటూ మౌనంగా పని చేసుకున్నట్టు తోస్తోంది.రోజూ ఇల్లెలా వుండేదనీ, ఈ పాటికి?టీవీలో పాప్‌ మ్యూజిక్‌ చానెల్‌తో బాటూ తనూ ఒక చానెల్‌ అవుతూ - విద్యా, కీ ఇచ్చిన బొమ్మలా గడగడా వాగుతూ లీలా... స్కూల్‌కి రెడీ అయ్యే హఢావుడీ మారాలు చేస్తూ, గారాలు పోతూ రోహిత్‌?..‘‘బాబూ, వ్యాన్‌ వచ్చేసింది’’ అంటూ సెక్యూరిటీ గార్డ్‌ పిలుపు... ఏదీ? కనిపించదే? - ఇంట్లో ఆ అందమైన గడబిడల సందడి? ఆ గలగలల మాటలేవీ? ఇంటి గుమ్మం దాటేసి, తన నొంటర్ని చేసి, ఎటెళ్ళిపోయినట్టూ? ఏమైపోయినట్టూ? అదంతా ఏమో కానీ, ఏ శబ్దమూ లేని ఇంటి ఈ వాతావరణం మాత్రం - అతనికి ఒక్క క్షణం కూడా భరించలేడు.అవును మరి, నందన వనం లోనూ, కీకారణ్యంలోనూ - నిశ్శబ్దం ఒకటే అయినా, దాని స్పర్శ మాత్రం ఒకేలా వుండదు. బీజానికి, దానికొక రూపం వుంటుంది. దానికొక ఉనికి ఉంటుంది. దానికొక స్వరం వుంటుంది. దానికి శోకమూ వుంటుంది. అది వినగలిగిన వారికి మాత్రమే వినిపిస్తుంది. కనగలిగిన వారికి మాత్రమే కనిపిస్తుంది.