ప్రతి ప్రాణికీ మరణం తప్పదని తెలుసు. కానీ చివరి వరకు ప్రాణాంతకమైన రోగాలతో బాధపడుతూ కూడా జీవించాలని పోరాడే తత్వమే చూశాను తప్ప, ఇక చాలు ఈ జీవితం చాలిద్దామని అనుకున్న వాళ్ళని, ప్రశాంతంగా మరణాన్ని ఆహ్వానించిన వాళ్ళని నేను చూడలేదు. ఎంతో నిబ్బరంగా ఉండే వాళ్ళు సైతం మరణం తప్పదని తెలిసినప్పుడు వాళ్ళలో కలిగే మానసిక సంఘర్షణ, జీవించాలనే తపన, ఏదైనా మంచి మందులు వాడితే బతికే అవకాశం ఉంటుందనే ఆరాటం.. ఇలాంటి దీనమైన పరిస్థితిలో వాళ్ళను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంటుంది.నేను పాలియేటివ్‌ కేర్‌లో డాక్టర్ని. పాలియేటివ్‌ కేర్‌ అంటే మన దేశంలో మరణానికి చేరువగా ఉన్న వ్యక్తుల్ని మాత్రమే చూసుకునే ఒక ఆశ్రమం లాంటి హాస్పిటల్‌. అయితే నేను అమెరికాలో ఉండగా పనిచేసే హాస్పిటల్‌కు అనుబంధంగా పాలియేటివ్‌ కేర్‌ ఉండేది. అక్కడ పనిచేసే డాక్టర్లు కొంత కాలం పాలియేటివ్‌ కేర్‌లో పని చేయడం తప్పనిసరి. మొదట్లో భయంగా ఉన్నా, ఆ వార్డుకు నెమ్మదిగా అలవాటు పడ్డాక జనరల్‌ మెడిసిన్‌ వార్డును నేను పూర్తిగా మరిచిపోయాను.కాలం చేసిన గారడిలో నేను మళ్ళీ మన దేశం వచ్చాను. మనశ్శాంతి వెతుకులాటలో సేవే నాకు మార్గంగా తోచింది. మళ్ళీ పాలియేటివ్‌ కేర్‌లోనే పని చేయడానికి సిద్ధపడ్డాను. అమెరికాలో ఉన్న పరిస్థితికి ఇక్కడి పరిస్థితికి భయపడడం, బాధపడడం అయ్యాక, అలవాటుపడడం కూడా అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలా మందికి కుటుంబాలున్నాయి. కానీ వాళ్ళకు వీళ్ళ బాధ్యత తీసుకునే తీరిక, కోరిక లేదు. జబ్బుతో ఉన్న వీళ్ళను ప్రేమతో చూసు కోలేకపోవడానికి కారణాలు అనేకం.

అలాంటి వాళ్ళని పాలియేటివ్‌ కేర్‌ దగ్గరకు తీస్తుంది. వ్యక్తిగతమైన విషయాల్ని తెలుసుకునే ఆసక్తి లేకపోయినా, అక్కడ ఉండే ప్రతి వ్యక్తి జీవితం గురించి మాకు తెలిసి పోయేది. ఎయిడ్స్‌ వ్యాధి గ్రస్థులు, కీమో థెరపీతో చిక్కి శల్యమైన రోగులు, మందులకు లొంగని ఆస్తమాతో బాధపడేవారు, ఆర్థరైటిస్‌తో కదలలేని వారు, పల్మనరీ ఫైబ్రోసిస్‌ జబ్బుతో నలిగే వాళ్ళు, అనేక ప్రాణాంతక రోగాలతో బాధపడేవారు, తమ వ్యధ, తమ బాధ, జీవిత గాథలు వినేందుకు, ఓదార్పు మాటలు చెప్పేందుకు, ఆత్మీయస్పర్శ ఇచ్చేందుకు ఓ స్నేహ హస్తం కావాలని ఆరాట పడుతుంటారు. ఆక్రోశిస్తుంటారు.అమెరికా, యూరప్‌ దేశాల్లో ఎప్పటి నుండో పాలియేటివ్‌ కేర్‌ ఉన్నప్పటికీ, భారతదేశంలో 1994లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో భారత ప్రభుత్వం సహాయంతో ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పాలియేటివ్‌ కేర్‌ ఏర్పడింది. పెద్ద నగ రాల్లో మాత్రమే ఉన్న పాలియేటివ్‌ కేర్‌ సంస్థలు అన్ని నగరాల్లో, పట్టణాల్లో రావాల్సిన అవసరం ఈనాటి జీవన విధానం, మానవ సంబంధాలు కలిగిస్తాయి. ఇక్కడ నాతో పాటుగా ఇద్దరు ఫిజీషియన్లు, ఒక సర్జన్‌, ఒక సైకాలజిస్ట్‌, పది మంది నర్సులు, నలుగురు ఆయాలు, నలుగురు అటెండర్లు ఉన్నారు.

 అయితే ఇక్కడ ఎక్కువ సమయం గడిపే డాక్టర్ని నేనే. రోగుల్లో బాధ తగ్గించడానికి, మానసికంగా కృంగిపోయే వారిని ఓదార్చడానికి, మరణం అనివార్యమని, సహజమైన ప్రక్రియ అని, మరణం కొరకు తొందర పడకూడదని, అలాగని వాయిదా వేయడం సాధ్యం కాదని రోగులకు తెలియజేయడానికి డాక్టర్లు ప్రయత్నిస్తారు. 21వ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ పాలియేటివ్‌ కేర్‌లో పాల్గొనడానికి, కటక్‌లోని ఆచార్య హరిహర్‌ రీజనల్‌ క్యాన్సర్‌ సెంటర్‌కు వెళ్ళాను. అక్కడ పాలియేటివ్‌ గురించి మరింతగా తెలుసుకునే అవకాశం నాకు కలిగింది. నేను తిరిగి వచ్చేప్పటికి వాళ్ళంతా నా కోసం ఎంతగా ఎదురు చూశారో చెబుతుంటే ఎంతో ఉద్విగ్నతకు గురయ్యాను. బ్రాంకైటిస్‌తో బాధపడుతున్న రాజయ్య తీవ్రమైన స్ర్టోక్‌తో చనిపోవడం, అతని మంచం ఖాళీగా ఉండడం నన్ను నిస్పృహకు గురి చేసింది. అతని ప్రేమ పూరితమైన పిలుపు ‘చిట్టితల్లీ’ చెవుల్లో గింగురుమన్నది. వాళ్ళకు ధైర్యం చెప్పి నేను వారి కష్టానికి చలించిపోతుంటాను. ఒక్కో పేషంటు మరణం, ఖాళీ అయిన ఆ ప్రదేశాన్ని చూసి, మానవ జీవిత అస్థిరతను గుర్తు చేసు కుని వేదాంత ధోరణికి రావడం, మళ్ళీ మామూలవడం జరుగుతుంటుంది.