సురేష్‌ వేగంగా కారు నడుపుతున్నాడు. వెనుక సీటులో పెద్దమామయ్య, అమ్మ కూర్చుని ఉన్నారు. ఇద్దరి ముఖాలూ విచారంగా ఉన్నాయి. ఎవరి మధ్యా మాటల్లేవు. ఆకాశంలో అక్కడక్కడ విసిరేసినట్లుగా ఉన్న తెల్లని మబ్బులు నెమ్మదిగా ఎక్కడికో వెళుతున్నాయి. అప్పుడప్పుడే వేడెక్కుతున్న గాలి లోపలికి దూసుకువస్తూ ఉంది. మామయ్య ఆలస్యంగా రావడంతో ప్రయాణం ఆలస్యమైంది. ఊర్లో అందరూ ఎదురుచూస్తుంటారు. ఎంత తొందరగా పని ముగిస్తే అంత తొందరగా తిరిగి రావచ్చు.సురేష్‌ ఆలోచనలన్నీ కర్నూల్లోని ఇంటి చుట్టూతానే ఉన్నాయి. పదిసెంట్ల స్థలం. ఐదు సెంట్లలో ఇల్లుకట్టి ముందంతా తోట పెంచుకున్నారు. ఒకప్పుడు ఊరి బయట ఉండే ఆ ప్రదేశం ఇప్పుడు అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారింది. ఇంటి పక్కనే మరో పది సెంట్ల స్థలం ఎవరిదో ఖాళీగా ఉంది. ఒక బిల్డర్‌ కన్ను ఆ ప్రదేశంపై పడింది. ఖాళీ స్థలం కొనుగోలు చేసి సురేష్‌ వాళ్ళమ్మకు బేరం పెట్టాడు. డబ్బుతో పాటు ఒక ఇల్లు కూడా ఇస్తానన్నాడు. కానీ ఆమె అమ్మడానికి ఒప్పుకోలేదు. దాంతో హైదరాబాదులో ఉంటున్న తనకి ఫోన్‌చేసి మరికొంత మొత్తం ఆఫర్‌ చేశాడు.

సురేష్‌ ఇల్లు అమ్ముదామని అమ్మని అడిగితే ‘‘రేయ్‌... కన్నా... ఇది మీ నాన్న, నేను ఎంతో కష్టపడి కట్టుకున్న కలల ఇల్లురా. తినీ తినక పైసా పైసా దాచిపెట్టుకుని, బ్యాంకులో అప్పు తెచ్చుకుని, మాకు ఇష్టమైన రీతిలో కట్టుకున్నాం. దీనిచుట్టూ ఎన్ని జ్ఞాపకాలు అల్లుకొని ఉన్నాయో నీకర్థం గాదు. ఇందులోని అణువణువులో మీ నాన్నే కనిపిస్తాడు నాకు. నేను పోయాక నీ ఇష్టం. కానీ నేనున్నంతవరకు దీనిని అమ్మమని మాత్రం అడగొద్దు’’ అంటూ మొండికేసింది. ఎంత చెప్పినా విన్లేదు. అట్లా రెండు నెలలు గడిచిపోయాయి. ఎటువంటి ఆదాయాన్ని ఇవ్వక వ్యర్థంగా ఉన్న ఖాళీస్థలం, పాడుబడిన ఇంటి గురించి అమ్మ అట్లా పట్టుబట్టడం అతనికేమాత్రం నచ్చలేదు. ఇప్పటికే చాలా నష్టపోయాననుకున్నాడు. ఈసారి ఎట్లాగైనా సరే అమ్మను ఒప్పించాలని రెండు రోజులు సెలవుపెట్టి హైదరాబాదు నుండి వచ్చాడు. కానీ అనుకోనిది జరిగి ఇట్లా పాణ్యం బయలుదేరాల్సి వచ్చింది. సురేష్‌కి చాలా అసహనంగా ఉంది. ‘‘ఛ... ఛ... ఇప్పుడే జరగాల్నా’’ అని అనేకసార్లు గొణుక్కున్నాడు. తిరిగి వెళ్ళాక గొడవపడైనా సరే అమ్మను ఒప్పించాలనుకుంటూ టైం చూసుకున్నాడు. పన్నెండవుతూ ఉంది. రోడ్డుకి రెండు వైపులా గమనించాడు. చిన్న చిన్న ధాబాలు వెనక్కి పరుగెడుతున్నాయి.‘‘మామా... అక్కడికి వెళ్ళాక భోజనం అదీ కష్టం. ముందే తిని వెళదాం’’ అన్నాడు. అమ్మ ఏమీ మాట్లాడలేదు. మామ ఒక్క క్షణమాగి తలూపాడు. ఒక మంచి ధాబా కనబడగానే సురేష్‌ కారు పక్కకు తీసుకెళ్ళి ఆపాడు.