‘‘మీరు ఎన్నన్నా చెప్పండి, నేను అతన్నే చేసుకుంటాను’’ ధైర్యంగా అన్నది ఇందిర.‘‘మేం చెప్తున్నది నీకు తలకి ఎక్కుతున్నదా లేదా’’ కోపంగా అడిగాడు నారాయణరావు.‘‘అన్నీ అర్థమయ్యే మాట్లాడుతున్నాను’’ తండ్రి ప్రశ్నకు ఏ మాత్రం తడబడకుండా సమాధానం చెప్పింది ఇందిర.‘‘వీల్లేదు, చూస్తూ చూస్తూ మేం ఈ పెళ్లి చేయలేం’’ కటువుగా పలికింది తల్లిగొంతు‘‘మూడు గంటల క్రితం కూడా అబ్బాయి అందంగా వున్నాడంటూ మురిసిపోయావుకదమ్మా... ఇంతలోనే అంత వ్యతిరేకమా!’’ అడిగింది ఇందిర.‘‘అన్నీ సవ్యంగా వుంటేనే అందమైనా, చందమైనా’’‘‘అయితే!’’ రెట్టించింది ఇందిర‘‘ఇక మాటలు అనవసరం ఇందిరా. మే మందరం నీ మంచి కోరేవాళ్లమే. మా మాట విను. ఇదంతా నీ భవిష్యత్తుని, నీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నమాటలమ్మా’’ అనున యంగా అన్నది తల్లి - వర్ధనమ్మ.‘‘ఎవరి భవిష్యత్తు ఎవరి చేతుల్లో వుందమ్మా... ఇవన్నీ అర్థం లేని ఆలోచన్లు. నాకా మాత్రం తెలి యక పోలేదు. నా నిర్ణయంలో ఏ మాత్రం తొందరపాటు తనమూ లేదు. తెలివి తక్కువా లేదు. మీరు నిర్భయంగా వుండండి. నిండు మనసుతో ఆలోచించండి చాలు. అంతా సవ్యంగా, సజావుగా జరిగిపోతుంది’’ భరోసాగా అన్నది ఇందిర. ‘‘దీనికి పిచ్చెక్కింది. అది కుదిర్తేగాని పెళ్లి కుదరదు. మీ సంబంధం మాకు ఇష్టం లేదని వాళ్లకి ఫోను చేసి చెప్పండి ముందు’’ దురుసుగా అన్నాడు చక్రపాణి.

‘‘తొందరపడి మాట్లాడకండి’’ భర్తనుద్దేశించి మందలింపుగా అన్నది చక్రపాణి భార్య.‘‘ఇందిరతో నేను మాట్లాడతాను. మీరంతా వెళ్లండి... ప్లీజ్‌’’ ఇంటికి పెద్ద అల్లుడు శ్రీధర్‌ మాటకు కట్టుబడి ఎవరికి వారు అక్కడి నుంచి వెళ్లబోయేంతలో...‘‘సారీ బావా... ఇక ఈ విషయంగా నేను ఎవర్తోనూ ఏం మాట్లాడను. నా నిర్ణయం మారదు’’ స్థిరంగా చెప్పింది ఇందిర.‘‘ఇంతమందిమి వద్దని నెత్తీనోరు బాదుకుంటుంటే నీకు ఏం దెయ్యం పూనిందే... ఇంత పట్టుపడు తున్నావ్‌’’ ఆవేశంగా అన్నది వర్ధనమ్మ.‘‘వర్ధనీ... నువ్వు అరవకు’’ భార్యను హెచ్చరించిన నారాయణరావు మవునంగా తన గది వైపుకు నడిచాడు.‘తెగేవరకు లాగటం మంచిది కాదు. ఈ విషయాన్ని మరింత లోతుగా ఆలోచించాల్సిన అవసరం వున్నది’’ అనుకున్నాడు నారాయణరావు.అందరు చెప్తున్నదీ సబబుగానే తోస్తున్నది, ఆ ఇంట్లో అందరికంటె చిన్నవాడయిన, ఇందిర తమ్ముడు మురళికి.అయితే అక్క తెలివి తేటలపైనా, ఆమె ఆలోచనా విధానం పైనా అపారమైన నమ్మకం అతనికి. అందుచేతనే ఏదో బలమైన కారణం వుండబట్టీ ఆమె అలా పట్టుదలగా ఉందనిపించి తనేం మాట్లాడకుండా మిన్నకుండి పోయాడు మురళి.ఆ ఇంట్లో అందరి మనసుల్లోనూ ఒకటే ఆలోచన మురళి ద్వారానే ఇందిర మనసు మార్చాలని నిర్ణయించుకున్నారు. అందుకు కారణం మురళి అంటే ఇందిరకు వల్లమాలిన ప్రేమ.