‘‘ఈసారి శనివారం క్లైంట్‌ కాల్‌కి ఎవరుంటారు?’’ టీమ్‌ లీడర్‌ అడిగాడు. అప్పుడే మీటింగ్‌ పూర్తయిన టీమ్‌ నోట్‌పాడ్‌లూ, పెన్నులూ సర్దుకుంటూ ఆయన మాట వినీ విననట్టుగానే ఉన్నారు. నేను కింద పెన్ను పడేస్కుని వంగి మళ్ళీ లేవలేదు.సురేష్‌ తన పేరు స్టైల్‌గా రాసుకుంటున్నాడు. తన నోట్‌పాడ్‌ నిండా సురేష్‌ అనే పేరు తప్ప ఏమీ ఉండదు. ప్రతీ మీటింగులోనూ అతను చేసే పని అదే కావడంతో మంచి కాలిగ్రఫీ స్టైల్స్‌ అలవడ్డాయి.‘‘హలో నేను మీకే చెప్తున్నాను. కొంచమన్నా ప్రోఆక్టివ్‌గా ఉండాలమ్మా.’’పడిపోయిన నా పెన్ను వెతికి తియ్యడానికి నా ముందు వరుస, వెనుక వరుస అందరూ కిందకి వంగారు.ప్రతీ వారం చివర అమెరికాలో ఉన్న క్లైంట్‌కి ఆ వారం పనుల స్టేటస్‌ చెప్పాలి. వాళ్ళ శుక్రవారం రాత్రి అంటే మన శనివారం పొద్దున్న చెప్పాలన్నమాట. అది జనరల్‌గా టీమ్‌ లీడరు చేస్తాడు. కానీ ఈ సారి ఆయన ఊరు వెళ్తూ ఉండడంతో ఆ భాగ్యం ఇంకెవరికన్నా కలగాలి.‘‘ఎవరూ ముందుకు రాకపోతే నేను ఎవరో ఒకరి పేరు చెప్పాల్సి వస్తుంది.’’అందరికీ చమటలు పట్టడం మొదలయ్యింది. అప్రైసెల్‌ అయిపోయి వారం అయ్యింది. అందుకనే ఈ నిశ్శబ్దం. కొన్ని రోజులన్నా పెళ్ళాం బిడ్డలతో కలిసి భోంచెయ్యాలని, కంటినిండా నిద్ర పోవాలని ఆశపడ్తున్నారు జనాలంతా. అప్రైసెల్‌ ముందు రోజులయితే మీటింగులన్నీ కోలాహలంగా ఉంటాయి. అందరూ ఏదో ఒక సమాధానం ఇచ్చేస్తుంటారు. ఆఫీసుకి తొందరగా వచ్చి లేటుగా ఇళ్ళకి వెళ్తారు. కొత్త కొత్త పనులన్నీ నెత్తిన వేస్కుని ఏదో చేసేసామని బాసులకి చూపిస్తుంటారు. అప్రైసెల్‌ జ్వరం తగ్గితే ఇచ్చిన పని పూర్తి చేసి తొందరగా ఇళ్ళకెళ్దామని చూస్తారు.నాకూ, హరీష్‌కీ శుక్రవారం రాత్రి లేట్‌నైట్‌ మూవీ చూసి శనివారం పొద్దున్న లేట్‌గా నిద్ర లేవకపోతే అది ఆరోగ్యమైన (అప్రైసెల్‌ జ్వరం లేని) వీకెండులాగా అనిపించదు అందుకే నా పేరు చెప్పకూడదు దేవుడా అని దేవుడ్ని తల్చుకుంటున్నాను.

‘‘నేను చేస్తాను’’ వెనక నుంచి ఒక గొంతుక వినిపించింది. వెనక ప్రీతీని చూసి అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.ప్రీతి (అప్రైసెల్‌) జ్వరం రోజుల్లో కూడా ఆరోగ్యంగానే పనిచేస్తుంది. ఆఫీస్‌ టైమింగ్సులోనే ఇచ్చిన పనంతా చేసేసి టైమవగానే ఇంటికి వెళ్లిపోతుంది. గంటలు గంటలు పొగ బ్రేకులకి వెళ్ళి రాత్రుల వరకూ పన్చేసే బ్యాచిలర్‌ గ్యాంగుకి ఇది కంటగింపుగా ఉంటుంది. అయినా తను పసిపిల్లాడి తల్లి అని తనని ఎవరూ ఏమీ అనరు.ఈసారి అప్రైసెల్‌లో తనకంటే నాకు ఎక్కువ పాయింట్లు వచ్చాయి. అది తనకి చెప్పకుండా ఉండాల్సింది. పొరపాట్న చెప్పాను. అప్పట్నించీ మొదలయ్యింది తనకీ బాధ. టీములు ఇద్దరు ముగ్గురు అబ్బాయిలకి మా ఇద్దరి కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. దాని గురించి తనకేమీ బాధ లేదు. తన కోపం అంతా నా మీదనే. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే ఈ అప్రైసెల్‌ రిజల్ట్సు అసలు ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోకూడదు. చాలా కాన్ఫిడెన్షల్‌గా ఉంచాలి. లేకపోతే మేనేజరుతో పోట్లాడి నాకు మార్కులు తగ్గించేదే. అలా కుదరదు కాబట్టి ఎట్లాగోట్లా తను నా కంటే బెటర్‌ వర్కర్‌ అని నిరూపించుకోవాలని విపరీతంగా తాపత్రయపడ్తోంది. నాకు తనకంటే ఎక్కువ వచ్చిన ఆ నాలుగు మార్కులూ తనని ఎంతగా బాధపెడ్తున్నాయంటే నేను కంప్లీట్‌ చేసి రివ్యూ అయిపోయి క్లైంట్‌కి పంపిన వర్క్‌ని ఎంత టైమ్‌ లేకపోయినా చచ్చేటట్టు చదివి, అందులో తప్పులు పట్టుకుని మేనేజరు దగ్గరకి తీసుకెళ్ళింది. ఆయన చివాట్లు పెట్టాడు. నీ పని నువ్వు చూస్కో అని. దాంతో ఇంకా అవమానపడిపోయింది.