బింగి బాబయ్య స్టైలే వేరు. బాబయ్య పేరు వినంగానే పేటలోని జనమంతా వింతగా చూస్తంటారు. ఎందుకంటే బాబయ్య నడిచినా వింతే. అరిచినా వింతే. నిలబడినా వింతే. కూర్చున్నా వింతే. మొత్తానికి వింతలు సృష్టించడంలో బాబయ్య బాణీయే వేరు. బింగి బాబయ్య పేపర్లలో లోపలి పేజీలలో రాయదగే వింతలు ఎపడూ చేయడు. ఏదో ఒక మూలలో రాయదగిన పనులు అస్సలు చేయడు. బాబయ్య దెబ్బ పడిందంటే... అది ఫ్రంట్‌పేజీ వార్తైనా ఉండాలి. బ్యాక్‌పేజీ ఫొటోనైనా వుండాలి. ఇంకాస్త పెద్దదయితే మెయిన్‌ పేజీలోనైనా వుండాలి. ప్రజల నోళ్ళల్లో నాని, పేపర్ల పేజీలలో నాని బాబయ్య నానిన అలచంద గింజల్లా లావయ్యాడు.

మాజీ ఛైర్మన్‌ అయినా బాబయ్య లెవిలే లెవిలు. ఆయనకుండే వెయిటే వెయిటు. తస్సాదియ్య తాజా ఛైర్మన్‌కు కూడా అంత సీనుండదు. అతని వెంట అంతగ్యాంగూ వుండదు.అధికార పార్టీ నాయకులు కిందబడి మీద బడి అరిచీ గీపెట్టినా వాళ్ళ గురించి 6వ పేజీలోనో ఏడో పేజీలోనో కాలం దాటని వార్తలొస్తుంటాయి. బాబయ్య కాలు కదిపితే చాలు.. అది వార్తై పోతుంది. అతని టాలెంటే వేరు, అతని టార్గెట్టే వేరు. ఊళ్లో పార్టీ ఊరేగింపు జరిగితే అందరూ చిన్న చిన్న జెండాలు, బ్యానర్లు పట్టుకొని అర్చుకుంటూ వస్తుంటారు. కాని బింగి బాబయ్య అంగి వదిలేసి భుజంమీద ఊరంతా కనిపించే ఓ పేద్ద జెండా మోస్తూ ఊరేగింపులో కలుస్తాడు.అదీ కరెక్టుగా కలెక్టర్‌ కాంప్లెక్స్‌ వద్ద ప్రత్యక్షమవుతాడు. అతను మోసే పార్టీ జెండా ఆకాశంలో రెపరెపలాడుతుంటుంది. జెండాపై పార్టీ గుర్తుతో పాటు అధినాయకుని చిరునవ్వులు చిందించే ఫొటో ఉంటుంది. అంతే! ఇక అక్కడున్న మీడియా సోదరుల కెమెరాలు క్లిక్కు క్లిక్కు మంటాయి. అంతకు ముందు ఊరేగింపులో బాడీ అంతా కవర్‌ చేస్తూ ఖద్దర్‌ జుబ్బా పైజామాలేసి తామే అసలు సిసలు గాంధేయ వాదుల్లా ఫోజులు పెట్టినా పాపం పార్టీ జిల్లా అధ్యక్షులు కార్యదర్శుల ఫోటోలు పేపర్లో పడవు.వంటగ్యాసు, పెట్రోల్‌ డీజిల్‌ ధరలు ఈ సంవత్సరమన్నా పెరగకుండా ఉంటే బావుంటుందని జనమంతా అనుకుంటూంటారు. కానీ బింగి బాబయ్య వంటగ్యాసు ధరలు, పెట్రోల్‌ ధరలు ఎపడు పెంచుతారా, అని ఎదురు చూస్తుంటాడు. అలా పెంచగానే యిలా తన చిత్ర విచిత్ర ప్రదర్శనలు చేపట్టి నిరసనలు తెలియజేస్తాడు. ఓసారి వంటగ్యాస్‌ ధర పెంచారు. అంతే మరుసటి రోజు పాత బస్టాండ్‌ నుండి బింగి ఫ్యాన్స్‌ వాళ్ళు ఖాళీ సిలిండర్లు భుజాన ఎత్తుకుని ఊరేగింపుగా వచ్చారు.కలెక్టర్‌ ఎదుట సిలిండర్లు కుప్ప పోశారు. డౌన్‌ డౌన్‌లు షేం షేంలు అని అర్చారు. రాస్తారోకో.. అటువైపు ఇటువైపు ట్రాఫిక్‌ జాం. వేలాదిమంది రోడ్లపైనుండి చూస్తుండగా.. బింగి బాబయ్య సడన్‌ ఎంట్రీ.. బింగి రథం అనే పేద్ద లైలాండ్‌ లారీ ఆ సెంటర్లోకి వచ్చింది. లారీ టాప్‌పైన పేద్ద కట్టెల పొయ్యి. బింగి వంటమనిషి అవతారంలో ఒక చేతిలో పొడవాటి గరిటె మరో చేతిలో పొడవాటి కర్రకు పేద్ద జండా.. జనం ఈలలు వేశారు. కేరింతలు కొట్టారు. బింగి పొయ్యిలో కట్టెలు పెట్టి కిరోసిన్‌ పోశాడు. భగ్గున మండింది. పొయ్యిమీద పెద్ద పాత్ర పెట్టి బింగి గరిటెతో తిప్పడం మొదలు పెట్టాడు. మీడియాలో తొక్కిసలాట మొదలైంది.