మా అమ్మ అన్నా ఆవిడ ప్రవర్తన అన్నా నాకు చాలా అసంతృప్తి. అందరి అమ్మలూ చక్కగా ఉద్యోగాలు చేస్తారు. లేదా సోషల్‌ వర్కు చేస్తారు. లేకపోతే క్లబ్బులకి వెళ్లి మీటింగుల్లో పాల్గొంటారు. మా అమ్మను చూసిన వాళ్లెవరూ కలెక్టరు భార్య అనుకోరు. ముఖం నిండా పసుపు కుంకం బొట్టూ, నేత చీరకట్టూ పల్లెటూరి పెద్దమ్మలా ఉంటుంది. అసలు మా నాన్న ఆవిడ నెందుకు చేసుకున్నారో. చిన్నప్పటి నుంచీ అనుకున్న మేనరికం కాదనలేక పోయారేమో.ఈ కాలంలో పిల్లలని చక్కగా స్వీటీ అనో, పింకీ అనో పిలుస్తూంటే మా అమ్మ మాత్రం ‘బంగారూ’ అని పిలిచేది. సాయంత్రం ఫ్రెండ్స్‌తో ఆడుకుంటూంటే అమ్మ ‘బంగారూ, లోపలికి రామ్మా. చీకటయిపోయింది’ అంటే నాకు సిగ్గుగా ఉండేది. అసలు తనెందుకు వచ్చి పిలవాలి? ఇంట్లో ఎప్పుడూ ఫ్యూన్స్‌ ఉంటారు కదా. వాళ్లలో ఎవరినో ఒకరిని పంపిస్తే వాళ్లు వచ్చి ‘‘అమ్మగారు పిలుస్తున్నారు’’ అంటే నాకు ఎంత గొప్పగా ఉంటుంది? ప్యూన్స్‌ని ఇంట్లో వాళ్లలా చూసేది. అస్సలు స్టేటస్‌ మెయిన్‌టెయిన్‌ చేసేది కాదు.నేనెప్పుడూ నాన్నతోనే ఉండేదాన్ని. నా టీ షర్టు మీద కూడా ‘డాడీస్‌ గర్ల్‌’ అని ప్రింటు చేయించుకున్నాను. నాన్నతో ‘‘డాడీ, అమ్మ అలా ఉంటుందేమిటి? చక్కగా అందరూ మమ్మీలలా ఉండవచ్చు కదా. కలెక్టరు భార్యగా క్లబ్బులో కూడా గౌరవిస్తారు కదా. 

ప్రైజు డిస్ర్టిబ్యూషన్‌ చెయ్యచ్చు. ఈవిడ మా అమ్మ అనాలంటే నాకు సిగ్గు’’ అనే దాన్ని. నాన్న చిరునవ్వు నవ్వే వారు. అమ్మని వెనకేసుకునీ రాలేదు. ఆవిడ ప్రవర్తన తప్పనీ అనే వారు కాదు.నాకే ఎప్పటికైనా అమ్మని మార్చెయ్యాలని అనిపించేంది. నేను పెద్దయ్యాక పెద్ద ఉద్యోగం చేస్తాను. అమ్మా నువ్విలా ఉంటే నాకు అవమానంగా ఉంది. నువ్వు మారాలి అని చెప్తాను. అప్పుడు అమ్మ అందరూ అమ్మలలా ఉంటుంది అనుకునేదాన్ని.ఒక రాత్రి అలాగే అనుకుంటూ పడుకుంటే ఫోను మోగింది. అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మోగిందేమో ఉలిక్కిపడి అమ్మను వాటేసుకున్నాను. ‘భయం లేదు బంగారు’ అంటూ ఫోను తీసింది. అర్ధరాత్రి నిశ్శబ్దం మూలాన అమ్మ మాట్లాడుతున్నా నాకు కూడా వినిపించింది. అమ్మా అంటూ ఏడిచాను. అమ్మ నోట్లో అదే మాట ‘భయం లేదు బంగారూ.’నా ఏడుపు రెట్టింపయింది. భయం లేదా? ఎందుకు లేదు? భయం తప్ప ఏముంది? నాన్న లేకపోతే ఎలా? నాన్నను చూడకుండా ఉండగలనా? నేను నాన్న కూతుర్ని. నేను చచ్చిపోతాను. నాన్న దగ్గరకు వెళ్లిపోతాను.ఏడవ సాగాను. అమ్మ నన్ను దగ్గరకు తీసుకుంది. ‘‘బంగారూ! ఏడవ కూడదమ్మా. నువ్వేడిస్తే నాన్నకి బాధ కలుగుతుంది. నాన్న మంచి వారు. మంచివాళ్లంటే దేవుడి కిష్టం. అందుకే తన దగ్గరకు రప్పించుకుంటారు’’ నాకు ఉక్రోషం వచ్చింది. ‘‘నిన్నే రప్పించుకుని నాన్నని ఇక్కడ ఉంచేయవచ్చుగా. నువ్వేగా ఎప్పుడూ దేవుడికి పూజలు చేస్తావు. నువ్వెళ్లి నాన్నని నాకు పంపించెయ్యి’’