సిరిమల్లె పువ్వా.... సిరిమల్లె పువ్వా...చిన్నారి చిలకమ్మా... నా వాడు ఎవరే... నా తోడు ఎవరే...ఎన్నాళ్లకొస్తాడే...’’ అంటూ ‘పదహారేళ్ల వయసు’ చిత్రం లోని పాటను హమ్‌ చేస్తూ, డ్రెస్సింగ్‌ టేబుల్‌ ముందు నిల్చుని, తన అందానికి తుది మెరుగులు దిద్దుకుంటోంది జ్ఞాపిక.ఆమెది పదహారేళ్ల దాటిన వయసు... హుషారైన మనసు...ఆ పరువాల వయసులో ఉండే ఉల్లాసం, ఉత్సాహం ఆమెలో నిండుగా కనిపిస్తున్నాయి. మెండుగా కవ్విస్తున్నాయి.మెరూన్‌ రెడ్‌ కలర్‌ శారీ, మ్యాచింగ్‌ బ్లౌజ్‌, గాజులూ....ఆమె శంఖం లాంటి నునుపైన కంఠాన్ని గర్వంగా కౌగిలించుకున్నట్టుగా ఉన్న పగడాల జ్యుయెలరీ....తన అందం తనకే ముద్దొచ్చేట్టుగా అనిపించి, ఎర్రటి పెదాలపై చిరునువ్వు కదలాడింది. తలంటుకుని వదులుగా వేసుకున్న జడ. అందులోఓ అరవిరిసిన ముద్దమందారం.అద్దంలో తనని తాను తృప్తిగా, గర్వంగా చూసుకుని -‘‘అబ్బా ఎంత అందంగా వున్నావే! నిన్ను కట్టుకోబోయే ఆ అదృష్టవంతుడెవరో!’’ అని తన ప్రతి బింబాన్ని పలకరిస్తుండగా కాలింగ్‌ బెల్‌ మోగింది.‘‘ఆ... వస్తున్నా...!’’ అంటూ మరోసారి అద్దంలో తనని ఎగాదిగా చూసుకుని, ఎదపైటని సరిచేసు కుని పరుగులాంటి నడకతో వచ్చి తలుపు తీసింది.అంతే తీసింది తీసినట్టుగా స్థానువైంది.ఎదురుగా మన్మథుడిలాంటి ఓ అపరిచిత యువకుడు చిరునువ్వుతో...ఆ పై జ్ఞాపిక అందానికి ముగ్థుడై నోటమాట రాక అవాక్కై చూస్తుండి పోయాడు.

‘‘ఎ... ఎ... ఎవరు? ఏం... కావాలి...?’’ తడబాటుగా అడిగింది జ్ఞాపిక.‘‘మీ... మీరు... మీరే కావాలి...’’ తడబడ్డాడు ఆ యువకుడు.‘‘వ్వాట్‌...?’’ చక్రల్లాంటి కళ్లని మరింత పెద్దగా చేసి చూసింది జ్ఞాపిక.‘‘సా... సారీ అండీ... గది అద్దెకి కావాలి.... టూలెట్‌ బోర్డ్‌ చూసి వచ్చాను’’.అతని తత్తరపాటుకి నవ్వాపుకోలేక పోయింది జ్ఞాపిక.ఆమె అలా నవ్వుతోంటే తెల్లటి పలువరస తళుక్కున మధుర మనోహరంగా, మంత్ర ముగ్ధంగా వుంది ఆమె మోము.‘‘ఓసారి చూపిస్తారా?! ఐ మీన్‌... గదిని...!’’ మళ్లీ అదే తడబాటు యువకుడిలో....మళ్లీ జ్ఞాపికది అదే నవ్వు ముత్యాలు జలజలారాలినట్టు....‘‘ప్లీజ్‌... ఇప్పటికి నాలుగు వీధులు తిరిగానండీ... ఎక్కడా టూలెట్‌ బోర్డు కనిపించలేదు. ఇక్కడ చూసే సరికి ప్రాణం లేచి వచ్చినట్టయ్యింది. అద్దె ఎంతయినా పర్లేదు. గది ఎలా వున్నా పర్లేదు. వెంటనే చేరిపోతాను’’ బ్యాచులర్‌ భావనతో అన్నాడు.‘‘మేడ మీద ఒకే గది ఉంది. చిన్నదంటే చిన్నగా ఉంటుందండీ మరి...’’ అంది నవ్వాపుకుంటూ జ్ఞాపిక.‘‘ఏం పర్లేదండీ... గదిదే ముందండీ... మనసు విశాలంగా ఉండాలి గానీ...!’’ కొంచెం కొంటెగా నవ్వుతూ అన్నాడా యువకుడు.ఆమె కూడా చిన్నగా నవ్వుతూ అతని కళ్లలోకి సూటిగా చూసింది.అసలే చారడేసి కళ్లు... అదనపు ఆకర్షణగా కాటుక దిద్ది ఉన్నాయి.ఆ చూపుల్లో అతని చూపు చిక్కుకుంది. మనసులో తొలకరి జల్లులు కరిశాయి.