‘తుమ్‌ బిన్‌ జావూఁ కహా?’ అంటున్న కిషోర్‌ గొంతు నిద్రపోతున్న వసుధ దుప్పటిలోకి జొరబడింది. కదలబోయింది. చుట్టుకుని ఉన్న మోహనరావు నిద్దట్లోనే మరింత దగ్గరకు లాక్కుంటున్నాడు. మెల్లగా వదిలించుకుని లేచి కూర్చుంది. ఏభై ఆరేళ్ళ మోహన్రావు మొహం నిద్దట్లో ప్రశాంతంగా ఉంది.

ఒకప్పుడు కిషోర్‌ని తనకి అంటించింది ఈ మోహన్రావే! నువ్వు వాడికోసమే పుట్టావే - అని చిన్నతనం నుంచి చిన్నాపెద్దా అంటుంటే, పెళ్ళాడి తీరాలనుకున్న పెద్దమేనత్త కొడుకు తల్లి అడిగిన కట్నం మేనమామయివ్వలేనంటే, మొండిచెయ్యి చూపించి వెళ్ళిపోయాడు. అప్పుడు విషాదాన్ని ప్రేమగా భావించి, ముఖేష్‌లోకి ముడుచుకుపోయి మొహం వేలాడేసుకుని తిరిగే తనను వెంటాడి... నవ్వించి... కవ్వించి... కిషోర్‌ని తనకి అంటించి... తమ యిద్దరి బ్రతుకులనీ ఒకటిగా అతికించింది ఈ మోహనుడే!