రెయిల్‌ స్టేషను..బస్‌ స్టేషను..అలాంటిదే మరోటి పోలీస్‌ స్టేషను. కాని.. ఆ స్టేషన్లకి వెళ్ళడానికి జనం చంకలు గుద్దుకుంటారు. యీ స్టేషన్‌కి రావాలంటే జంకుతారు.పోలీస్‌ స్టేషన్లలో రైటర్లుంటారు. స్టేషన్‌ రైటర్లు. వాళ్ళల్లో కొందరు నిజం రచయితలు...అంటే...కథలూ అవీ రాసేవాళ్ళు కూడా ఉండొచ్చు.ఈ స్టేషన్‌లో రైటరు - నిజం రచయిత కూడాను. రైటర్లలో - రచయిత.పోలీసుల్లో కూడా మనుషులూ, ఆ మనుషుల్లో కూడా... మంచి మనుషులే కాకుండా మంచి మనసులు కలవారూ ఉంటారు. అలాటి మంచి పోలీసు అధికారి యీ స్టేషనులోనే ఉన్నారు.

అందుకే యీ పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళడానికి మనుషులూ, కథలూ కూడా భయపడక్కర్లేదు. ఎందుకంటే-‘స్టేషన్‌ ఇన్‌ఛార్జి’ అనే అతి తక్కువ మందికి మాత్రమే తెలిసినదీ,‘సబినస్పెక్టరాఫ్‌ పోలీస్‌...పొట్టిగా ఎస్సయ్‌’’ అని చాలా మందికి తెలిసినదీ-ఐనా పోస్టులో ఉన్న శ్రీధర్‌ అనబడే యువకుడు-యూనిఫామ్‌లో కూడా యానిమల్‌లా ప్రవర్తించకపోవడమూ, లాటీ పట్టినా లూటీ చేయకపోవడమూ, మనుషుల పట్ల కసిగా కాక మానవత్వంతో ప్రవర్తించడమూ, స్టేషనుకి వచ్చినంత మాత్రాన చెడిపోయిన వాళ్ళో, చేతకాని వాళ్ళో అని అనేసుకోకుండా మనుషులకి మర్యాద యివ్వడమూ వంటి పోలీసు శాఖలో పని చేయడానికి అనర్హతలుగానూ, మానవ సమాజంలో మసలడానికి మంచి లక్షణాలు గానూ పరిగణించబడే గుణాలూ లక్షణాలూ కలిగినవాడు. 

ఈ ఉద్యోగంలో చేరినా ఆ సుగుణాలను వదిలెయ్యనివాడు. అందుకు కారణం-అతని జీవితంలో అనుభవించిన ప్రపంచపు తొమ్మిదో వింత అనదగినది. అదేమిటంటే..శ్రీధర్‌కి లక్షలలో లంచమివ్వకుండా కనీసం కార్పొరేటరు సిఫార్సీ అయినా లేకుండా కులం తోడ్పాటు లేకుండా కేవలం అర్హత ప్రాతిపదికపైనే ఈ ఉద్యోగం రావటం. లంచంగా లక్షలు పోయలేదు కనుక ప్రజల నుంచి పిండుకోవలసిన అవసరం ఏర్పడలేదు. (స్టేషను మామూలూ... పై అధికార్లకి రుసుముల్లో విరాళాలూ...వదిలేస్తే) సిఫార్సు వల్ల రాలేదు కనుక ఎవరికీ దాసోహం అనవలసిన పని కనపడలేదు. కనుక ఖాకీబట్టలు వేసుకున్నా అతనిలో కసీ, కఠినత్వం చోటుచేసుకోకుండా మనిషిగా ఉండనిచ్చాయి.తనకు లంచం, సిఫార్సులు లేకుండా యీ ఉద్యోగం వచ్చిందని ‘ఈ ఉద్యోగం మీకెలా వచ్చింది?’ అని అడిగినవారికి చెబితే వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు సరికదా నవ్వేవారు. అందుచేత’.