‘‘టేపులో నీ పాట తీసేసి కొత్తపాట, జానీ మేరానామ్‌లోది, మంచిది పెట్టేశాడు అన్న...‘‘ పాప చెప్పింది.గబగబా ముందు హల్లోకి వెళ్లాను. రేడియోలో వస్తున్న పాటని చాలా శ్రద్ధగా టేప్‌ రికార్డర్‌లో రికార్డు చేసుకుంటున్నాడు బాబు.‘‘ఎందుకని నా పాట తీసేశావ్‌?’’ అనడిగాను.‘‘ఇష్‌’’ అన్నాడు నావేపు చూడకుండానే.రికార్డింగ్‌ అయ్యాక ‘‘మంచిపాట నాశనం చేసేశావమ్మా, రికార్డు చేసుకుంటున్నప్పుడు మాట్లాడేశావ్‌’’ అన్నాడు.నా పాట పోగొట్టి ఇంకా పైగాను!‘‘అది పాతపాట. ఎవరిగ్గావాలి?’’ అన్నాడు.‘‘నాకు కావాలి. అందుకేగదా రికార్డు చేసుకున్నాను. అది తిమ్యొద్దని చెప్పాను కదా!’’ అన్నాను.‘‘అమ్మా అది రికార్డు చేసి సంవత్సరం అయింది. ఒక్కనాడు కూడా నీయంతట నీవు దాన్ని పెట్టుకొని వినలేదు. అది టేపులో వుంటే నీకేం, లేకుంటే నీకేం?.... మంచిపాట వస్తున్నది. తొందరలో దానిమీద పెట్టేశాను’’ అన్నాడు. అంతటితో ఆ సంభాషణ అయిపోయిందని తాను కొత్తగా పెట్టుకున్న పాటలు వింటూ కూర్చున్నాడు.ఆ పాట పోయింది. ఇహరాదు. వాదించి లాభమేమిటి?నా పాట పోయినందుకు నాలో నిరాశ, ఏదో విలువైనది పోగొట్టుకున్నానన్న బాధ. ఆ పాట ఉన్నా నేను పెట్టుకోను. ఎప్పుడైనా ఎవరైనా వరుసలో పెడితే వినడమే. అది ఎవరికీ అక్కర్లేని పాతపాట. నాకు కావలసిన పాట. కావలసినదైనా నేను పెట్టుకోని పాట. అది ఆ టేపుల్లో వుంటే నాకేదో తృప్తి. ఇప్పుడు అది పోయినందుకు బాధ.ఎందుకో ఆ పాట నాకు కావాలి. నాకు ఇష్టమైందని కాదు. కాని నాకు కావలిసింది. 

ఎందుకో అర్థం కాకపోయినా నాకు చాలా ముఖ్యమైనది.‘ఆడేపాడే పసివాడ....’ అది ఏ సినిమాలోదో, ఎవరు పాడినదో, దానిలోని భావమేమిటో నాకు గుర్తులేదు. నాకు అక్కర్లేదు. ఆ పాట వింటూంటే నాలో గొప్ప సంచలనం రేగుతుంది. ఉధృతంగా ఎగిరిపడుతున్న అలలతో, తుఫాను నాటి సముద్రం లాగా అయిపోతుంది మనసు..... ఎంతో ఆశించినదాన్ని పొందలేక విషాదభరితమైన జీవితంకల ఒక అమ్మాయి ఆనందానికి ప్రతిరూపంగా కనిపించిన పసివాణ్ణి చూచి, ఎంతో ఆనందంతో పాడుతుంది ఆ పాట. పాట అయిపోయేసరికి పిల్లవాడు దుర్మరణం పాలౌతాడు. మళ్లీ కటిక చీకటిలాంటి విషాదం ఆవరిస్తుంది.ఆనందానికీ విషాదానికీ గల సరిహద్దులో, రెండూ ఒకటయ్యేచోట ఆ పాట. పాట వింటూంటే ఆనందమూ, దాని వెనుకనే పొంచివున్న విషాదమూ రెండూ ఒక్కసారిగా తీవ్రమౌతాయి. ఊపిరి సలుపనివ్వకుండా పెరిగి పెరిగి... ఉక్కిరి బిక్కిరై నలిగిపోతుంది గుండె.ఆ పాత పాట నాకు యిష్టమని కాదు. నేను నా అంతట ఎప్పుడూ దాన్ని పెట్టుకోను. కాని నాలోనే అందరాని లోతుల్లో ఉండే సత్యానికి ప్రతినిధిగా అది అక్కడ ఉండటం చాలా ముఖ్యం....