‘కమర్షియల్ మీటింగ్ సంగతి. జ్ఞాపకం ఉందా శ్రీపతీ! రేపు పది గంటలకు నువ్వు ప్రిపేర్ చేసే నోట్ నా టే బుల్ పైన ఉండాలి’ ఆఫీసు నుంచి ఇంటికెళ్తూ డైరక్టర్ రిమైండ్ చేశారు. సాయంత్రం ఏడు వరకు ఆఫీసులోనే కూర్చున్నా. కాని నోట్ కంప్లీట్ కాలేదు. ఇంట్లో స్టడీగా ఒక గంట కూచుంటే పూర్తికాకపోతుందా అని ముఖ్యమైన ఫైల్సు పుచ్చుకుని ఇంటి కెళ్ళాను. శ్రీమతి పడుకుని ఉంది. లైట్లన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి. గదిలో అడుగు పెట్టగానే అమృతాంజనం వాసన గుప్పుమంది. ఇది తలనొప్పి ప్రభావమే అయి ఉండోచ్చని అనుకున్నాను. ఆమెకిలాగే వారానికో రెండు వారాలకో ఒకసారి వస్తుంది తలనొప్పి. ఈన్‌టీ స్పెషలిష్టు దగ్గరకు తీసుకెళ్ళడం, అతను మందులివ్వటం- ఇది మామ్మూలే.డ్రాయింగ్ రూమ్‌లో కూర్చుని నోట్ తయారుచేసే పని ప్రారంభించాను. కాని నోట్ ఒక ఆర్డర్లో రాలేదు. మళ్ళీ మొదట్నించి రాయాల్సి వచ్చింది. మూడొంతులు కంప్లీటయేసరికి టైమ్ పదిన్నరైంది. మిగిలినది ఉదయం లేవగానే పూర్తి చేయలేకపోతానా అన్న ధైర్యం వచ్చింది.మంచం మీద పడుకుని ఉన్న శ్రీమతి నీరజకు ఒక కప్పు వేడి పాలిచ్చి, హాట్ పేక్‌లో ఉన్న నాలుగు బ్రెడ్ ముక్కలు తిని ఆకలి తీర్చుకున్నాను నేను. తలుపులన్నీ వేసి నిద్ర పోదామని బెడ్‌రూమ్‌లోకి వెళ్ళబోయాను. నానిగాడి దగ్గర నుంచి ఫోను. కార్డ్‌లెస్ తీసుకుని మాట్లాడాను. నానిగాడంటే మా ఏకైక పుత్రుడు. బెంగళూరు సమీపంలో ఒక రెసిడిన్షియల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలట. అర్జంటుగా డబ్బు పంపమని చెప్పాడు.
నోట్ ప్రిపరేషన్ హడావుడిలో రేపు వాడికి డబ్బు పంపే సంగతి మరిచిపోకూడదని మనసులో అనుకున్నాను. అన్నట్టు రేపు సాయంత్రం లోపున నీరజకు మరోసారి చెకప్‌కు స్పెషలిష్టు దగ్గరకు తీసుకెళ్ళాలి. -ఇరవైనాలుగు గంటలూ మీ మీటింగ్‌లు, బిజినెస్ వ్యవహారాలు తప్ప నా ఆరోగ్యం గురించి పట్టించుకోరని నీరజ నాలుగు దినాల నుంచి నా ప్రాణాలు తోడేస్తుంది. చేతిలో ఉన్న కార్డ్‌లెస్ ఫోను యుధాస్థానంలో పెట్టి మంచం మీద పడుకున్నాను. నాలో ప్రత్యేకమైన ఒక లక్షణం ఉంది. రాత్రి ఎంత ఆలస్యమైనా పనిచేస్తూ బిజీగా ఉన్నంత వరకు నిద్ర నా జోలికి రాదు. తీరుబడిగా ఉన్నప్పుడు రిలాక్స్ అవుదామని మంచం మీద నడుం వాల్చిన మరుక్షణమే గట్టు తెగిన ప్రవాహంలా ముంచుకొస్తుంది నిద్ర. ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకు ఎఱుకలేదు.బెల్ నిర్విరామంగా మోగుతోంది. గణ గణమంటూ డిస్ట్రబ్ చేస్తున్న బెల్ శబ్ధానికి నా కళ్ళు తెరచుకున్నాయి. కాని నేను మంచం దిగలేదు. మళ్ళీ బెల్‌మోత ప్రశాంతంగా ఉండనీయటం లేదు... ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది- అపార్ట్‌మెంట్‌కి కాలింగ్ బెల్ అంత అవసరమా అని. దాని వల్ల కలిగే సుఖంకన్నా వచ్చే తలనొప్పి ఎక్కువని కొన్నాళ్ళకింద బెల్ తీయించేశాను. అప్పుడు మరో రకమైన సమస్య ఎదురైంది. వచ్చిన అతిథులు తలుపు బాదటం మొదలుపెట్టారు. అదీ భరించటం సాధ్యం కాలేదు. మళ్ళీ బెల్ ఫిక్స్ చేయించక తప్పలేదు.