జోరుమీదున్నావు తుమ్మెద-సుమనస్వప్నావశిష్టుడల్లే అలా కుర్చీలో కూర్చుని ఉన్నాడు ఉత్తేజ్‌. కన్ను మూసినా తెరిచినా అదే రూపం కనబడుతోంది. ఇరవై వసంతాల అమ్మాయి... పట్టు పరికిణీ ఓణీలలో... తలంటి పోసుకున్న జుట్టును వాలు జడగా బంధించి, జడ చివర కుప్పెలతో అలంకరించిన అపురూపమైన అందం.. చిరుగాలికి ముంగురులు అల్లన ఎగురుతుంటే, నెచ్చెలులతో కలిసి ఫక్కున నవ్వే మువ్వల సవ్వడి... ఆ నవ్వులతో పోటీ పడుతున్నట్టుగా కొంటెగా ఊగుతున్న జూకాలు... బారెడు జడనిండా తురిమిన మల్లెల పరిమళాలు... గోరింట పండిన చేతులకు గలగలలాడేలా రంగు రంగుల గాజులు. కోటేరేసినట్టున్న ముక్కుకు కుడివైపు మెరిసే వజ్రపు పుడక, బొట్టుకు మూడంగుళాలు పైగా కేశవీధి నుంచి జారిన బంగారు పాపిడి బిళ్ళ, నవ్వుతూ ఉండే సొట్టలు పడే మెత్తని బుగ్గలు... పసుపుకొమ్ము నూరి, గులాబీరేకుల చూర్ణంతో రంగరించినట్టే ఉన్న మేనివర్ణం...గాలికి ఎగురుతున్న పయ్యెద, దాని చాటుగా అలవోకగా దర్శనమిస్తున్న అందాలు... గుప్పిట్లో ఇమిడిపోయేంత సన్నని నడుము.. ఆ నడుము ఒంపులో కొలువుతీరిన కంది బద్దంత నల్లని పుట్టుమచ్చ... ఒక్కసారి దాన్ని తాకగలిగితే... ఓహ్‌... ఉత్తేజ్‌ మనసు తీయగా బరువుగా మూలిగింది. ఎంతటి అందం ఆమెది! ఛమేలీ పూలకుప్పలా ఉంది. ఒక్కసారి చేతుల్లోకి తీసుకుని ఆ పరి మళాన్ని ఆఘ్రాణించగలిగితే... ఏదో అలజడి... తెలియని కలవరం.. అవ్యక్తమైన కలత... ‘మధురమైన బాధరా, మరుపురాదు.. ఆ...’ అనార్కలీ పాట మదిలో మెదిలింది.స్నేహితులు పల్లవి, రాజీవ్‌ల వివాహానికి ఆ పల్లెటూరికి వచ్చాడు ఉత్తేజ్‌. వధూవరులిద్దరూ చిన్నప్పటి నుండీ ప్రేమికులే. బావా మరదళ్ళు మరి.. రాజీవ్‌ బాబాయ్‌ కూతురైన ఆ పూలతీగ మాయలో పడిపోయాడు వచ్చిన క్షణం నుండీ ఉత్తేజ్‌. రకరకాల రంగు రంగుల పరికిణీ ఓణీల్లో, కొబ్బరి నీళ్ళోసారి, చెరకు రసాలోసారి అందిస్తూ ఆరడగుల మనిషినీ చటుక్కున పడేసింది ఆ పిల్ల. ఆ తర్వాత తెలిసింది మధురమైన కంఠస్వరం ఆ విరిబోణీ పేరు ‘మధురిమ’ అని. దీర్ఘంగా నిట్టూర్చాడు ఉత్తేజ్‌.‘లబ్‌డబ్‌ లబ్‌డబ్‌ లవ్‌ లవ్‌ లవ్‌’ అని అల్లరి చేస్తున్న గుండెపై రాసుకుంటూ... హా, హతవిధీ, మధూ ఇది కదా నీ సీమ!’ అనుకున్నాడు.... ‘విరహం’ అనే పదం వింటేనే నవ్వొచ్చే అతనికి ఇప్పుడు తెలుస్తోంది ఆ బాధేమిటో.. ఆ తీయని నొప్పి పేరే ప్రేమని అర్థం అవుతోంది.‘‘ఒరేయ్‌ తేజా... తేజా...’’ పిలుస్తున్నా పలకకపోతే ముఖం ముందు చిటికెలు వేశాడు రాజీవ్‌....‘‘ఓ తేజన్నయ్యా, ఏమిటి కూర్చుని కళ్ళు తెరిచే నిద్ర పోతున్నావా?’’ నవ్వింది పల్లవి...‘‘ఆ.. చెప్పరా.. ఏదో ఆలోచన...’’ బలవంతంగా