మూడు గంటలప్పుడు రెండో విడత ఇంత ముద్ద తిని తోట దగ్గరకు బయలుదేరాడు నారప్ప. దారిలో రామశేషయ్య ఎదురై ‘‘ఏం నారప్పా! బట్టలప్పు ఇయ్యనే ఇయ్యక పోతివి. సంవత్సరం దాటిపాయె’’ అని హెచ్చరించాడు.‘‘బొత్తిగా ఎసులుబాటు గాలేదు శేషయ్యా! నాకు మాత్రం నీ బాకీ నిలపాలని వుందా’’‘‘రాగులూ, జొన్నలూ మంచి పంటే అయ్యిందంటనే-అమ్మినావా’’‘‘ఏందమ్మడమప్పా, అడిగే నాతుడే లేకపోతే! మనమై మనం కొంటవా అంటే, మూట అరవై లోపుగానే బేరమాడితే ఎట్లా చచ్చేది. నిరుడు నూటికి పై నుండే ధర, వుట్టుపాటుగా అరవైకే తెగనమ్మాలంటే మనసెట్టా వప్పుతాది. ఓ వైపు కరెంటు బిల్లు కట్టల్ల- తనకా బేంకోల్లు జీపుల మీద జీపుల్లో వస్తూనే ఉన్నారా! వుండేకేమో పది మూట్లు జొన్నలూ, పదిమూట్లు రాగులూ వుండాయనుకో. ఏంజెయ్యల్లో దిక్కేతెల్లేదు.’’‘‘మీ కత జూస్తే ఇట్లా ఉంది. నా కత జూస్తే దబ్బాడితేగాని పొట్ట గడవదాయే. మీలాంటోల్లందరికి అప్పులిచ్చి అంగడి ఎండక పొయ్యిందనుకో. ధర్మారం నుండి అప్పులోల్లు మనిషి మింద మనిషిని పంపుతుండారు. మీ లాంటోల్లు ఎప్పుడిదప్పుడు ఇస్తే గదా నాకూ జరుగుబాటయ్యేది. కటినిట్టుగా అడుగుతున్నాననుకోవద్దు నారప్పా! ఓ వారం దినాల్లో బాకీ మాత్రం పైసలు చెయ్యాల్సిందే. అంగట్లో బొత్తిగా సీపు ముక్కలు కూడా లేవు. దసరా వస్తోంది. దసరా కన్నా రొవన్ని బట్టలు అంగట్లో ఏసుకోకపోతే ఎట్లా-వస్తామరి’’ అంటూ సమాధానం కూడా ఆశించకుండా ముందుకు సాగిపోయాడు రామశేషయ్యనారప్ప సన్నగా నవ్వుకున్నాడు.

 రామశేషయ్య వ్యవహారం నారప్పకు తెలీందేమీ గాదు- ఇరవై ఏళ్ల కిందట గుగ్గుళ్ల గంపతో వ్యాపారం మొదలుపెట్టిన రామశేషయ్య ఈనాడు తనలాంటి రైతుల్ని చుట్టూ తిప్పుకొనే వాడయ్యాడు. అప్పట్లో రైతులందరి దగ్గరా నయంగా మెలిగి పాతికో పరకో వాళ్ల దగ్గరే చేబదుళ్లు తీసుకొని చిన్న అంగడి పెట్టుకున్నాడు. రైతుల కల్లాల దగ్గరకు తిను బండారాలు తెచ్చి అమ్మి గింజలు పోగు చేసుకొని అమ్మేవాడు. పాపం తండ్రి చచ్చినోడని రైతులంతోయింతో దయదలచేవారు. క్రమంగా అంగడి పెంచుకున్నాడు. మెల్లగా బట్టల వ్యాపారం కూడా తోడు చేసుకున్నాడు. చూస్తూ చూస్తుండగానే మూడంకణాల ఇల్లు కట్టుకున్నాడు. మెల్ల మెల్లగా రైతులకు అవసరాలకు వడ్డీకిచ్చుకుంటూ, ఈనాటికింత వాడయ్యాడు. ఎంత లేదన్నా ఇరవై వేలకు పైగానే వడ్డికి తిప్పుకుంటున్నాడని ఊర్లో అందరూ అనే మాట. ఇంట్లో పెండ్లాం పిల్లల దర్జా బట్టా బాతా, తిండీ తీర్థం చూస్తే ఎట్టాంటి రామశేషయ్య ఎట్టా మారాడబ్బా అనుకోక తప్పదు. ఒక కొడుకును అనంతపురం కాలేజీలో చదివిస్తున్నాడు. ఒక కొడుకు అతనితో పాటే వ్యాపారంలో నిగ్గుదేలాడు. మంచి సంబంధం చూసి ఈ మధ్యనే బిడ్డకు పెళ్లి చేశాడు. ఇదంతా ఆశ్చర్యంగా మాయలా కనిపిస్తుంది నారప్పకు.