రాత్రి రెండు గంటల సమయంలో ఫోన్‌ మోగింది. హర్ష నిద్ర కళ్లతోనే సెల్‌ అందుకున్నాడు.ఇండియా నుంచి తండ్రి రఘుపతి మాట్లాడాడు.‘‘పట్టాభి చనిపోయాడ్రా..’’‘‘అయ్యో... ఎప్పుడు?’’ అని దిగ్గున లేచి కూర్చున్నాడు హర్ష.‘‘రాత్రి మళ్లీ గుండెపోటు వచ్చింది. ఈసారి బాగా ఎక్కువగా వచ్చింది. మగదక్షత లేదు. తల్లీ, కూతురూ... అక్కడికీ పక్కవాళ్ల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ దార్లోనే పోయాట్ట. పొద్దున్నే నాకు తెలిసివచ్చాను. కిందటిసారి ఎటాక్‌ వచ్చినప్పుడే ఆపరేషన్‌ చేయాలని చెప్పారు. గవర్నమెంటువాళ్లు ఏదో కొంత ఇస్తారట గానీ, ముందు మన చేతినుంచి పెట్టుకోవాలిట. ఎక్కడో ఫ్రీగా చేస్త్తారట. వాళ్లకు ఉత్తరం రాశాడట. పిలుపు వస్తుందని కూర్చున్నాడు.

ఈ రోజుల్లో రోగాలు రాకూడదు. వస్తే లక్షల్లోనే ఖర్చు. అవసరానికి అక్కరకొస్తుందని దాచుకున్న పది లక్షలూ నీకు ఇచ్చి పంపించాడాయె. ఆ డబ్బు చేతిలో ఉంటే, పరిస్థితి వేరుగా ఉండేది. వాడి భార్యా, కూతుర్ని చూస్తే బాధేస్తోంది. చేతిలో చిల్లిగవ్వలేదు. శవాన్ని గుమ్మంలో పెట్టుకుని కూర్చున్నారు..’’‘‘నేను ఏమన్నా డబ్బు పంపనా?’’‘‘పరాయి దేశంలో ఉండి చదువుకుంటున్నావు. లక్షల్లో ఖర్చు. పడరానిపాట్లు పడుతున్నావు. నువ్వేం పంపిస్తావు? నేనే ఏదో ఏర్పాటు చేస్తాలే..’’ అని రఘుపతి ఫోన్‌ పెట్టేశాడు.హర్షకు నిద్రమత్తు వదిలింది. ఆయన చావుకు తను కారణమా? అవును.. కాదు...పెను తుఫాను ముందు అల్లకల్లోలసంద్రంలా ఉంది అతడి మనసు.

 ఇంట్లో ఉక్కపోతగా ఉంది. ఊపిరాడనట్లుగా ఉంది. గుండె నిండా అలజడి.తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. నిర్జీవంగా నడుస్తున్నాడు. నింగీ, నేలతోసహా సమస్త లోకాలూ సుషుప్తావస్థలో ఉన్నాయి. తనే నిశాచరుడిలా ఒక చెట్టు దగ్గర ఆగాడు. ఎదురు వీధిలో నుంచి రివ్వున చలిగాలి వీస్తోంది. పుట్‌పాత్‌ మీద కూలబడ్డాడు. వీధి దీపం కాంతి అతని మొహం మీద పడుతోంది. కళ్లు మూసుకున్నాడు, తల పట్టుకున్నాడు.పట్టాభి తనతండ్రికి స్నేహితుడు. ఏదో చిన్న గవర్నమెంటు ఉద్యోగం చేసి రిటైరయ్యాడు. అమాంబాపతు అన్నీ కలిసి పదిలక్షలు దాకా వచ్చాయి. బ్యాంకులో వేసుకుని కూర్చున్నాడు. ఒక్కతే కూతురు. ఆ అమ్మాయి పెళ్ళికోసం ఆ డబ్బు దాచిపెట్టాడు. కానీ ఆ పిల్ల ఇంకా చదువుకుంటోంది. పెళ్ళికి ఇంకా నాలుగైదు ఏళ్ళ వ్యవధి ఉంది.