శ్రీనివాసరావు మాట నమ్మి స్కూలుకు సెలవుపెట్టి వెళ్ళలా వద్దా అని నేను చాలా సేపు మథనపడ్డాను. అసలే మా స్కూలు పరిస్థితులు అమిత దుర్భరంగా ఉన్నై. మాష్టర్లమందరమూ ఒక్కసారిగా ఎనిమిదిమంది కమిటీ మెంబర్లను తృప్తిపరచవలసి వచ్చేటప్పటికి మా తలప్రాణం తోకకు వస్తున్నది. ఏ క్షణాన ఏ మెంబరు ఏ పార్టీలో ఉంటాడో, ఎవరిచ్చిన సెలవు ఎవరు రద్దుచేస్తారో తెలియని స్థితిలో నేనుంటే మా శ్రీనివాసుడు, ‘‘నీకు పునర్జన్మలో నమ్మకం ఉందా? ఉన్నా లేకపోయినా నీకు ఒక చిత్రం చూపిస్తాను. ఈ రహస్యం ఇంకా ఎవరికీ బయటపెట్టలేదు. నువ్వూ నేనూ కలిసి కొంత రహస్యశోధన చెయ్యటానికి ఇది మంచి అవకాశం. కాబట్టి ఈ ఉత్తరం అందినవెంటనే గురు శుక్రవారాలు శెలవు పెట్టి రా, సోమవారం దాకా ఉండవచ్చు. ఒక్కసారి ఈ రహస్యం నీ కళ్ళతో నువు చూశావంటే నీకే నమ్మకం కలుగుతుంది’’ అంటూ రాస్తాడు. గురు శుక్రవారాలు మాత్రమే శలవు పెట్టానంటే శని ఆదివారాలు రెండు రోజులూ కమిటీ మెంబర్లు యావన్మందీ నాకోసం అర్జంటు పనిమీద మా యింటిచుట్టూ తిరిగిపోతారు! అది శ్రీనివాసుకేం తెలుసు? తీరాపోతే ఏమీ ఉండదేమో!కానీ బయలుదేరాను, నిరుత్సాహంతోనే. నేను మాష్టరునయి సిగిరెట్టు కాల్చటం మానుకొన్నప్పటి నుంచి నిరర్థకమైన పనులు చెయ్యటమంటే నాకొక విధమైన భయం పట్టుకుంది. ఏదైనా పని ఉంటేనే ఎక్కడికైనా వెళ్ళటమూ, అది కూడా ఎంతో ఆలోచించి మరీ వెళ్ళటమూ నాకు ఉద్యోగంలో కలిగిన కొత్త అలవాటు.తీరా రైలెక్కిన తరవాత తట్టింది శ్రీనివాసరావుకు కొంచెం మతిభ్రమ ఏమయినా ప్రారంభమయిందేమోనని. ఆ అనుమానం ఇంటిదగ్గరే కలిగితే అసలు బయలుదేరకనే పోదును. 

శ్రీనివాసరావుకు మతిభ్రమ కలిగిందనుకోటానికి చాలా అవకాశం ఉంది - నాకు ఈ మాత్రం ఇంటిదగ్గిరే తట్టలేదు కానీ వాడు తండ్రి చచ్చిపోయిన అయిదు సంవత్సరాల కాలంలో జూదంలోనూ, గుర్రపు పందాల్లోనూ, స్నేహితుల మీదా, తాగుడుకూ, వేశ్యలకూ పాతిక వేలయినా తగలవేశాడు. వాణ్ణి చిన్నప్పటినించీ ఎరిగినవాళ్ళు కూడా వాడిట్లా అవుతాడని అనుకోలేదు. వాడి పరివర్తనలన్నీ దురూహ్యాలుగానే ఉంటూ ఉండేవి. ఇంకా ఒక కొంపా నాలుగెకరాల భూమీ ఉండగా శ్రీనివాసరావు మరొక పరివర్తనం కలిగి వెనకటి జీవితమంతా ఒక క్షణంలో చినిగిన చొక్కాను విసర్జించినట్టు విసర్జించి రైలుకు ఆమడ దూరాన ఆ బ్రాహ్మణకోడూరు గ్రామం చేరి వాడి స్వగృహంలో ఉంటూ సేద్యం ప్రారంభించాడు. అంతా సంతోషించాం అప్పట్లో. తీరా రైలెక్కిన క్షణాన నాకు సందేహం ప్రారంభమయింది - ఈ పల్లెటూరి జీవనమూ స్వయంకృషీ వాడి నెత్తి ఆడించిందేమోనని. ఒకటే చేతామనుకున్నాను; చెప్పిన ప్రకారం వాడు చుండూరు స్టేషను దగ్గిర నా కోసం హాజరుకాకపోతే నా తోవను నేను ఇంటికి తిరిగి వచ్చేద్దామనుకున్నాను. ఆ బండికి నన్ను రమ్మనీ తను నాకోసం కనిపెట్టుకుని స్టేషను దగ్గిర ఉంటాననీ రాశాడు స్పష్టంగా.