సాయంకాలం బుక్‌స్టాల్‌ దగ్గరకెళ్ళి కూర్చున్నాను. టైం ఆరు కావొస్తున్నా మిత్రులెవరూ రాలేదు. బజారు కూడా ఎందుకో పల్చగా ఉంది.గత కొన్నేళ్ళుగా ప్రతి రోజూ సాయంకాలం బజారుకెళ్ళి ఆ బుక్‌స్టాల్‌ దగ్గర కూర్చోవడం, అక్కడికి వచ్చిన సాహితీ మిత్రులతో తోటి లెక్చరర్లతోనో చిన్నాపెద్ద వామపక్ష రాజకీయ నాయకులతోనో ప్రజా సంఘాల మిత్రులతోనో ప్రస్తావనకొచ్చిన సామాజిక విషయాల మీద చర్చించుకోవడం, తర్కవితర్కాలతో వాదించుకోవడం, రచయితల సంఘ సభ్యులతో ‘స్పందన’ సాహితీ మిత్రులతో సాహిత్య సభలకు రూపలక్పన చేయటం వంటి ప్రజాహిత కార్యాలోచనలు ఇటీవలి నా జీవితంలో ఒక భాగమయిపోయాయి. అక్కడ చేరుకొని మిత్రులతో కలవని రోజు ‘ఏదో వెలితి’గా కనిపించసాగింది. ఆ బుక్‌హౌస్‌ దగ్గర చర్చకొచ్చే అంశాలు కొన్ని రచయితలయిన మాలో కొందరికి కవిత్వ రచనకో కథారచనకో ముడిసరుకులుగా మారడమూ జరుగుతూ ఉంది. చివరికి ఆ బుక్‌హౌస్‌ అనంతపురం రచయితల కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది.ఎప్పటి మాదిరిగానే నేనక్కడ బెంచీ మీద కూర్చున్నాను. నన్ను చూడగానే బుక్‌హౌస్‌ మేనేజర్‌ వీరన్న నాలుగు కుర్చీలు నా పక్కన వేయించాడు.

 ప్రతి సాయంకాలం నా వంటి మిత్రులెందరికో అటువంటి సెంటర్లో ఆసన సౌకర్యం కల్పించి మా ద్వారా విద్యావంతులెందరినో తమ బుక్‌హౌస్‌ వైపు ఆకర్షింపచేసుకోవడం ఆ సంస్థకున్న వ్యాపార దృష్టిలో ఒక భాగమే కావచ్చు. అయితే అంతకంటే ప్రధానంగా నాకు కనిపించేది, ఆ బుక్‌హౌస్‌ మేనేజర్‌కూ అందులో పనిచేస్తున్న మిగతా మిత్రులకూ మా రచయితల మీదున్న గౌరవాభిమానాలూ ఆత్మీయతలే! ఆ ఆత్మీయతానురాగాలు గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతూ బలపడుతూ రావడం ఒక అరుదైన విషయం. అక్కడ వివిధ రంగాలకు చెందిన నా వంటి మిత్రుల కలయికకు కారణం-వాతావరణాలు ఏమయినప్పటికీ అటు బుక్‌హౌస్‌కూ ఇటు రచయితలకూ అదొక గౌరవప్రదమయిన సంగమస్థలమని నాకెప్పుడూ అనిపిస్త్తూ ఉంటుంది.మా రచయితలకూ బుక్‌హౌస్‌కూ మధ్య ఉన్న అనుబంధాన్ని గురించి నేనావిధంగా ఆలోచిస్తుండగా కథా మిత్రుడు ‘స్వామి’ వచ్చి నా పక్కన కూర్చున్నాడు. పలకరింపులూ, పులకరింపులూ అయ్యాక ఇద్దరమూ కలిసి ఎదురుగా ఉన్న ప్రియదర్శినీ హోటలుకెళ్ళి మంచి కాఫీ తాగొచ్చి మాటల్లోకి దిగాం. సమాజంలో వొస్తున్న మార్పులనూ, తరాల మధ్య పెరుగుతున్న అంతరాలనూ వాటన్నిటినీ ప్రతిబింబిస్తూ కథలు రావలసిన అవసరాన్ని గురించి చర్చించుకుంటున్నాం. అంతలోనే ఒక మనిషి దగ్గరకొచ్చి దీనంగా చేయి చాస్తూ, ‘ఆకలిగా ఉంది సార్‌, వొగ పది రూపాయలివ్వండి, మళ్ళీ ఇస్తాను’ అని అడుగుతూ నిలబడ్డాడు.పది రూపాయలివ్వండి, మళ్ళీ ఇస్తానని అడగడంతో బిచ్చగాడు కాదనుకొని సీరియస్‌గా చూసి అతణ్ణి గుర్తు పట్టాను. జుట్టంతా చిందరవందరగా ఉంది. బట్టలు బాగా మాసిపోయాయి. షర్టును ప్యాంటు లోపలకి దోపుకుని దానిపైన గట్టిగా మొలతాడుతో బిగించుకున్నాడు. చెప్పులు లేని కాళ్ళు దుమ్ముబట్టి ఉన్నాయి. ముఖమంతా జిడ్డోడుతూ ఉంది.