ఒంటిగంటయినా ఎండ పొడ లేక మబ్బులు కమ్మి మసాబుగా ఉంది. అర్జెంటు ఉత్తరాలు స్టెనోకి చెప్పి బద్దకంగా ఉండి సిగరెట్ ముట్టించి ఫైల్సు తిరగేస్తున్నాను. మెంథాల్ టిప్‌లోంచి సిగరెట్ పొగ కూడా మంచుమీద గాలిలా జివ్వు జివ్వు మంటోంది. కాగితాలు తిప్పుతున్నానే గాని ఒక్క ముక్క బుర్రకు ఎక్కడం లేదు. లంచ్‌టైమ్ అయింది. ప్రక్కనే ఉన్న నాలుగంతస్తుల ఊర్వశిలో వెచ్చబడాలనిపించి ఫైల్సు మూసి బయలుదేరాను.ఆమ్లెట్టూ, ఫిష్ కట్లెట్టూ, కాఫీ తెమ్మని బేరర్‌తో చెప్పి టేబుల్ మీద ఉన్న పేపరు తిరగేస్తున్నాను.బందోబస్తుగా సూట్లూ, బూట్లూ, నెక్‌టైలూ బిగించి, పాగాలు సర్దుకుంటూ, గడ్డాలు దువ్వు కుంటూ సర్దార్జీలూ, కోట్లు విప్పి కుర్చీల వీపులకి తొడిగి టై పిన్నులు సర్దుకుంటూ, కావలసినవి మెనూలమీద పెన్సిలుతో టిక్కులు పెడుతూ ఊళ్లో కర్మాగారాలూ, కంపెనీలు నడిపే విదేశీయులూ, ఒక భుజం మీద కెమేరా, మరొక భుజం మీద ట్రాన్సిస్టరూ వేలాడించుకుని టేబులు చుట్టూ చేరి మోచేతుల మీద వంగి మెటికలు విరుచుకుంటూ కబర్లు చెప్పుకుంటున్న టూరిస్టులూ, మంత్రి గారితో మంతనాలు జరిపే మిషతో హైదరాబాదు బయలుదేరే ముందు ఎవరి డబ్బుతోనే దాహం తీర్చుకునే ఖద్దరు కండువాలూ, పెద్దపెద్ద వాళ్లతో భుజాలు రాపాడించి పనులు జరిపించే మధ్యవర్తులూ... అన్నిరకాల వాళ్లతోనూ డైనింగ్‌హాల్ కిటకిటలాడుతోంది.
సోడాసైఫన్ బుస బుసలూ, గాజుకప్పుల ఒడిలో ఐస్‌ముక్కల కిలకిలలూ, టేబుల్స్ మధ్య ఇరుకుదార్లతో అతి సున్నితంగా మెలికలు తరిగి ఒకరినొకరు తప్పించుకునే బేరర్లూ, వాళ్ల చేతులమీద ట్రేలలో ఒయ్యారాలు తిరిగే విస్కీ, జిన్, బీర్ సీసాలూ... అంతా మహేంద్రజాలంలా ఉంది. ఆకుపచ్చని వెలుగు, ఆకు మాటు గుసగుసలా జాజ్ సంగీతం హమ్మింగూ... ఊర్వశి పైటచెంగు రెపరెపల్లో జారిపడ్డ స్వర్గంలా ఉంది.ఈ పెద్ద హోటళ్లలో చెప్పిన గంటకిగాని ఏదీ ఊడిపడదు. తోచక కౌంటర్‌దగ్గర లాడ్జర్స్ బోర్డు చూస్తున్నాను. ‘జయరాం, క్రాంతి ఇండస్ట్రీస్, మద్రాసు’ కంటబడింది. పరిచయం ఉన్న పేరని పించి కౌంటర్ దగ్గిర రిజిస్టర్ చూశాను. సందేహం లేదు అతనే.జయరాం, నేను ఒక ఏడాదిపాటు యూనివర్సిటీ హాస్టల్లో రూమ్‌మేట్స్‌గా ఉన్నాం. పది నిమిషాల్లో తిరిగి వస్తానని బేరర్‌తో చెప్పి పక్కనేఉన్న లిఫ్ట్ ఎక్కాను. రూమ్ తలుపుమీద - ‘ఎంగేజ్డ్.. డోన్టు డిస్టర్బ్’ అని ఎర్రగా నియాన్ దీపాల అక్షరాలు వెలుగుతున్నాయి. పడుకున్నా డేమో, వెళ్లనా మాననా అని ఒక్క క్షణం సందేహంలో పడ్డాను. కాని, తలుపు కొంచెం ఓరగా జారేసి ఉంది. ఫరవాలేదనుకొని - ‘‘మే ఐ కమిన్... మిస్టర్ జయరాం?’’ అని నెమ్మదిగా తలుపు మీద కొట్టాను.