కొత్త ‘టైమ్‌ మెషీన్‌’ను కనుగొన్నారు. ప్రస్తుతానికది మనిషిని కొన్ని రోజులపాటు గతంలోకి మాత్రమే తీసుకెళ్ళి మళ్ళీ వర్తమానంలోకి తీసుకు వస్తుంది. దాన్ని ఈ మధ్యనే చరిత్ర పరిశోధన నిమిత్తం అమెరికాలో అత్యంత గోప్యంగా రూపొందించారు. కొన్ని పరిశోధనలు కూడా విజయవంతంగా చేశారు.అయితే అమెరికా చరిత్ర మరీ పెద్దది కాకపోవడం వల్లనూ, ఆ ఉన్న చరిత్ర అందరికీ బాగా తెలిసి ఉండడం ఇంకా ఎక్కువ తెలిస్తే కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడం వల్లనూ దాన్ని మరో దేశంలో పరీక్షించదలిచారు. బాగా యోచించాక అందుకు భారతదేశాన్ని ఎన్నుకున్నారు. ఎందుకంటే... దాని తయారీలో చాలామంది భారతీయులు పాలు పంచుకున్నారు. దానికన్నా ముఖ్యమైన కారణం భారతదేశ చరిత్ర సరిగ్గా ఎక్కడా నమోదు కాకపోవడం.ఈ కాల యంత్రాన్ని వారం క్రిందట రహస్యంగా ఇండియా తీసుకొచ్చి ఈ నగరంలో ఊరి చివర ఉన్న ప్రయోగశాలలో ఉంచారు. నన్ను దానికి పర్యవేక్షకుడిగా నియమించారు.పోయినవారమంతా మేము చరిత్ర కారులతో కూర్చొని చర్చించి హరప్పా, మొహంజదారో కంటే ముందుకాలం నుంచి పరిశోధన మొదలెట్టాలని నిర్ణయించాము.

 భారత ఉపఖండంలో మొదటగా ఏయే జాతులవారుండేవారు, వారి నాగరికత ఎలాంటిది ఆస్ట్రలేషియన్‌ తెగలు, ఆ తరువాతి వారు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు, వీరి నాగరికత ఎట్టిది, ఆర్యులు సరిగ్గా మన దేశానికి ఎప్పుడొచ్చారు, వేదకాలం ఖచ్చితమైన లెక్కలేవి, రామాయణాది పురాణకాలం ఎప్పటిది? అసలప్పుడు ఏం జరిగింది? పైన చెప్పిన కాలాల్లో రాజ్య నిర్మాణం, పరిపాలన, సంఘ నిర్మాణం, ప్రజల జీవన విధానం ఎలా ఉండేవి? ఇవన్నీ పరిశోధించడానికి ప్రణాళికలు తయారు చేసుకున్నాము. ఎల్లుండి సోమవారం మంచిరోజని దైవజ్ఞులు నిశ్చయించడం వల్ల ఆ రోజున మొదటి బ్యాచ్‌లో ఇద్దరు చరిత్రకారులను, ఒక యంత్ర నిపుణుడిని కాలయంత్రంలో ఆ కాలానికి పంపడానికి నిర్ణయమైంది.ఇంకా రెండు రోజుల్లో పని మొదలవుతుందనగా శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రయోగశాల అతిథిగృహంలో నేను పడుకోబోతున్న సమయంలో ‘నలుగురు పెద్ద మనుషులు వస్తున్నారని, వారితో తప్పనిసరిగా నేను మాట్లాడాలని’ చాలా పైన్నుంచి ఫోన్‌ వచ్చింది.కాస్సేపట్లోనే ఆ నలుగురు పెద్ద మనుషులు లోపలికి వచ్చి వినయంగా నాకు నమస్కరించి పరిచయం చేసుకుని సోఫాలో కూర్చున్నారు. వారిలో మొదటి వ్యక్తి దేశంలోని పెద్ద రాజకీయ నాయకులలో ఒకరు. రెండో మనిషి అతి సంపన్నుడైన వ్యాపారవేత్త, మూడో ఆయన త్రికాలజ్ఞుడైన గొప్ప స్వామీజీ. నాలుగో వ్యక్తి వీళ్ళ ముగ్గురికీ సంధానకర్త. వీళ్ళకి నాతో పనేమిటా అని ఆశ్చర్యపోయాను.ముందుగా సంధానకర్త మాట్లాడాడు. ఆయన వారి గురించి క్లుప్తంగా వివరించి ‘‘మీరు ఎలాగైనా ఈ ముగ్గురు గొప్పవాళ్ళని కాలయంత్రంలో కేవలం ఇరవై సంవత్సరాల వెనక్కి వారిక్కావాల్సిన ఒక్క రోజు కోసం తీసుకెళ్తే చాలు’’ అన్నాడు. మిగతా ముగ్గురూ ‘అంతే’ అన్నట్టుగా తలలు ఊపారు.