మానిక సెల్లప్ప అరవై యేళ్ళకే, డెబ్బయి యేళ్ళ వాడిలా కనపడు తున్నాడు. నిత్యం కాలవలో ఒంగి, కూర్చుని మట్టిని తీసి జల్లించడంతో, అతని చేతి వేళ్ళు చిత్రమైన రంగులోకి వచ్చేశాయి.ఒంగి కూర్చొని, కూర్చొని - అతని నడుము వొంగిపోయింది అస్తమానం కూర్చొనుండటం వల్ల కాళ్ళు లావుగా ఉబ్బిపోయాయి. తెల్లని జుట్టుని అదిమి పెడుతూ - తుండు గుడ్డ చుట్టాడతను.తెల్లగా బొల్లితేలిన పెదవుల మధ్య సగం కాలి, ఆరిన చుట్టవుంది. ఒంటికున్న గోచీ, అతని శరీరాన్ని పూర్తిగా కప్పలేక పోతోంది. ఒంగి కూర్చుని సెల్లప్ప కాలవలో మట్టిని చేతుల్లో తీసి, జల్లెడలో వేశాడు. జల్లెడలోంచి నీరు క్రిందకి దిగిపోయింది. జల్లెడలో ఉన్న గాజు పెంకులు నీరెండకి మెరుస్తున్నాయి. సెల్లప్ప వణికే చేతుల్తో వాటినేరి ఒక పక్కగా పోశాడు. మళ్ళీ జల్లించి - అందులో ఉన్న బొగ్గు ముక్కలొక పక్క, చిన్నచిన్న ఇనుప ముక్కలొక పక్క, పుల్లముక్కలు ఒక పక్క, పోగులు వేయడం మొదలెట్టాడు.కాలవ తుక్కులోంచే, జీవనోపాధి సెల్లప్పకు. సెల్లప్ప తాత మానికి కోటప్ప రెండెకరాల రైతు. సెల్లప్ప తండ్రి మానిక పెంచలయ్య పాలేరు. అయిదేళ్ళ క్రితం వరకు సెల్లప్ప కాలవలు కడిగే పని చేసేవాడు కాదు. మున్సిపాలిటీలో ఉద్యోగం చేసేవాడు. తన వంశం ఎందుకిలా దిగజారి పోతోందో, అనుకుంటాడతను.సెల్లప్ప మూడో భార్య సన్యాసయ్యతో వెళ్లిపోయిన దగ్గిర నుంచి సెల్లప్ప ఒంగి పోయాడు. ఇద్దరు పిల్లల్ని తనకే ఒదిలేసి పోయిందని మరీ కృంగిపోయాడు. మొదటి ఇద్దరు పెళ్ళాల వల్ల ముగ్గురు, మూడో భార్యకు ఇద్దరు మొత్తం అయిదుగురు. సెల్లప్పకు బరువే అయ్యారు. బరువు భుజాన్నేసుకుని బతుకు కాలవ ఈదడం మొదలెట్టేసరికి మున్సిపాలిటీలో కాలవ కడిగే పనిలోంచి సెల్లప్పకు ఫించనిచ్చేశారు.

 అప్పటి నుంచి మరే పనీ చేతకాని సెల్లప్ప, కాలవలోనే చెయ్యెట్టాల్సి వచ్చింది.‘ఏరా సెల్లప్ప ఏటైనా సిక్కిందిరా?’ అడిగాడు సివాలయ్య. సివాలయ్య రోడ్డు కివతల వైపు కాలవలో మట్టి జల్లిస్తున్నాడు.‘‘లేదురా అబ్బీ! గుప్పెడు బొగ్గులైనా ఇంకా సిక్కనేదు’’ అన్నాడు సెల్లప్ప జల్లిస్తూనే.‘‘ఏది ఓ సుట్ట ముక్కుంటే పారేద్దూ’‘సామెత మాదురుందిరా అబ్బి. పొద్దుట్నించి టీ నీళ్ళే లేవు. సుట్టముక్కట. సుట్టముక్క... యాడ తెచ్చేదిరా. ఈ సుట్ట నా బతుకు నాగే వెలుగు తోంది, ఆరుతోంది’ అంటూ సెల్లప్ప నోట్లో చుట్ట తీసికొని చూసి తలగుడ్డలో వున్న అగ్గిపెట్టెతో ముట్టించాడు.‘బుల్లిగాడు ఇస్కూలు కెళ్లేడా?’ అని అడిగేడు శివాలయ్య.‘ఆఁ... ఎల్లేడనుకో రేపు ఆడుపుట్టిన పండుగ. కొత్త సొక్కా కావాలంటాడు - యాడతెచ్చేదిరా అబ్బి? ఆడేమో కుట్టేసిన పాత సొక్కాయేనా - కొనకుంటే ఊరుకునేటట్టు లేడు. కుర్ర నాగన్న ఆడి సరదా ఆడిది. దగ్గు చుట్ట బెట్టుకొని రావడంతో ఆగేడు సెల్లప్ప. అతని గుండెలు ఆయాసంతో ఎగిసి పడుతున్నాయి.