ప్రొద్దు వాటారినప్పటి నుంచి మర్రిచెట్లలోంచి ఊడలు ఊడలుగా దిగజారుతున్న చీకటి, చలమై చెరువై చెలరేగిన యమునై సముద్రమై భూమినంతా ముంచేసింది. ఆకాశమెత్తున ముంచేసింది - రాధ కంటి కాటుకలా - కృష్ణుడి వంటి నలుపులా - నందుడి ఇంటి చల్లలా చిక్కబడింది.చెట్టుకింద చీకటిమధ్య చితుకుల మంటలు కృష్ణుడిమీది ఎర్ర పట్టుకుండువాలా కదలాడుతున్నాయి. చీకటి చిక్కదనాన్ని, చక్కదనాన్ని వెలుగెత్తి చాటుతున్నాయి. మంటలో ఊచ కాలుస్తున్న గోపన్న ముఖం మీద - అతనిపక్కన చెల్లాచెదురుగా పడివున్న వేణువుల మీద, కొంచెం అవతలగా బొత్తికట్టి వున్న వెదుళ్ళమీద వెలుగు నీడల భాషతో కావ్యాలు రాస్తున్నాయి.ఇంక మూడు ఝాములు పోతే సప్తమి తెల్లవారుతుంది. కృష్ణుడి పుట్టినరోజు వచ్చేస్తుంది. పాతిక పండగల నాడు గోపన్న ఆరంభించిన వేణు నిర్మాణం ఇంకా తెమలలేదు. రేపటికైనా సాధించి, తన వేణువును ఆయనకు సమర్పించాలి. రేపివ్వలేకపోతే ఇంక ఈ జన్మకివ్వలేడు. వేళయిపోయింది....‘‘నాయనా, బువ్వదినవే’’ అన్నాడు చిన్న గోపన్న వచ్చి, గోపన్నకీ మాట వినపడ లేదు. అతని హృదయం బృందావనిలో ఉంది. అక్కడకు కృష్ణుడు వస్తాడు. వచ్చే వేళయింది. అప్పుడే గోపికల అందెల రవళి వినిపిస్తోంది. గాజుల గలగలలు, నవ్వుల కిలకిలలు వినిపిస్తున్నాయి. ఇవతల వెదురు పొదలు సన్నగా ఈలవేస్తున్నాయి. 

ఈ ఉపశ్రుతులన్నిటినీ కలుపుకొని కొద్ది క్షణాలలో మోహన మురళీ రవళి వినవస్తోంది.గోపన్న ఎన్ని యుగాలుగా అక్కడ చెట్లమాటున కూర్చున్నాడో అతనికే తెలియదు. ఆకులలో ఆకై, పువ్వుల్లో పువ్వయి, ఇసుకలో రేణువై, యమునలో బిందువై, స్తంబ్దంగా కూర్చుని కృష్ణ వంశీనాదాన్ని హృదయంలో పోసుకున్నాడు. పరిశుద్ధమైన స్వరాలలో ఒక్కొక్క స్వరాన్ని మనసులో నిలుపుకొని దాని విశ్వరూపం దర్శించడానికి తపస్సు చేశాడు. అదే మనసులో పదిలంగా దాచుకుని పరుగున తన కుటీరానికి వచ్చాడు. కొత్త వెదురుకోసి స్వరద్వారాలు వేసి, మనసులో స్వరాన్ని ఇందులో పలికించబోయాడు. అస్వరం తన ఈ వేణువులో పలికితే ఇది కృష్ణయ్యకు కానుక ఇవ్వాలి. కాని అది పలకలేదు. పలికించాలని అతను ఎన్నివేల వేణువులో చేశాడు. తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ వేణువును శ్రుతి చేయడానికే ఉపయోగించాడు. జీవికాలమే తక్కువ. ఒక జీవితానికి లెక్కతేలే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కొన్ని కోట్లు ఉంటాయి. వాటిని వృధాచేస్తే ఎలా? యమున ఒడ్డున పొదలమాటున దాగి కూర్చుని కృష్ణుడి మురళి విన్నాడు. అతను వూపిరి బిగపట్టుకునే కాలం గడిపేవాడు. అక్కడ పొదుపు చేసిన దానిని తన కొత్త వేణువును పూరించడానికి ఉపయోగించే వాడు. తీరా పూరించేసరికి అది శ్రుతిశుద్దంగా వినబడేది కాదు. పైగా జీరబోయేది. లోపలేవన్నా ఈనెలు లేచాయేమోనని గోపన్న ఎంతో శ్రద్ధగా లోపల కూడా నునుపు చేసేవాడు. ఒకటి పట్టుకు వెళదాం అని లేచేసరికి దాని గొంతుక జీరపోయేది.