అర్ధరాత్రి గాలి స్తంభించింది.మొక్కల ఆకుల్లో కదలిక లేదువృక్షాలు అటెన్షన్‌ పాటిస్తున్నాయి.విద్యుత్‌ సరఫరాకి అంతరాయం.‘ఈరోజు అమావాస్య- మన పనికిదే ముహూర్తం’ అన్నట్లుగా సంతోషంగా చంకలు గుద్దుకున్నారు యానాది, మస్తానయ్యలు. ఎవరికీ పట్టు దొరక్కుండా కాళ్లకీ చేతులకీ ఆముదం పట్టించి, కార్యసాధనకి అవసరమయిన సామగ్రితో, గోడల వారగా నడుస్తూ ‘టార్గెట్‌’ పెట్టుకున్న యింటి ప్రహరీగోడ దగ్గరకు చేరుకున్నారు. ఎవరూ తమని గమనించట్లేదని నిర్ధారించుకున్నాక, మస్తానయ్య ‘హూప్‌’ అంటూ బలంగా నేలని తన్ని, యానాది భుజాల ఆసరాతో గాలిలో బంతిలా ఎగిరి, ఎత్తయిన ప్రహరీగోడ అంచులు అందుకుని, అవలీలగా ఎగబాకి, గోడమీద బల్లిలా కరుచుకుపడుకుని, కళ్లు చిట్లించి, కాంపౌండంతా కలియజూసాడు. మనిషి జాడయితే లేదు గానీ, అపడే బిల్డింగుని చుట్టి వచ్చిన కాపలా కుక్క జాడ మాత్రం కనిపించింది. కదలకుండా, ఊపిరి బిగపట్టి, అలాగే పడుకుని, దానివైపే చూడసాగాడు.పెద్దపులిలా ఏపుగా పెరిగివున్న ఆ కుక్క ముక్కు పుటాలకి కొత్త నరవాసన తగల్నే తగిలింది. వెంఠనే ఎగశ్వాసతో, అనుమానంగా చుట్టూ కలియజూస్తూ, తనవైపే అది వస్తోందని మస్తానయ్య గ్రహించాడు. నెమ్మదిగా తలత్రిప్పి, క్రిందనున్న యానాదితో రహస్యంగా,

‘‘గురువోయ్‌- పెద్దకుక్క’’ అన్నాడు. తక్షణం యానాది ఓ రొట్టెముక్కని అందించాడు. ఆ రొట్టెముక్క కడుపునిండా మత్తుమందుని నింపుకుని వుంది.కుక్క మస్తానయ్యని చూసింది.మోరెత్తి, భౌ భౌ మంటూ అటుగా అరుస్తూ వచ్చింది.రొట్టెముక్కని వెంటనే దాని ముందుకు విసిరాడు మస్తానయ్య. ఎంత జాగర్తగా క్రమశిక్షణతో పెంచుకున్న కుక్కనైనా వలేసి పడేసి మైకంలో ముంచే ఆ రొట్టె ముక్కలోని మత్తు మందు వాసన ఆ కుక్కని కూడా లోబరుచుంది, పరులు పెట్టిన తిండి తినకూడదని చిన్నప్పట్నుంచీ చెప్పించుకుంటు న్నా, తన సహజమయిన బుద్ధిని యింకా వదిలిపెట్టని ఆ కనకపు సింహాసనాధిపతి ఆ రొట్టె ముక్కని ఒక్క అరనిముషంలో నమిలిపడేసి, పడకేసింది మత్తుగా.