‘‘విన్నావా?’’-అన్నాడు కలిదిండి చినసూరపరాజు.‘‘లేదయ్యా’’-అన్నాడు అబ్బులు అనబడే వీరభద్రం.‘‘ఇలాంటివి ఆలస్యంగానైనా మనకి తెలిస్తే మేలేకదూ?’’ - అన్నాడు మళ్లీ చినసూరపరాజు, తను చదివే సంస్కృత భారతం శాంతిపర్వం పేజీ లోకి వేలుపోనిచ్చి, ఆ గుర్తుతోపాటే తాత్కాలికంగా పుస్తకం మూసి-‘‘చిత్తం’’ - అన్నాడు వినయంగా అబ్బులు-అబ్బులేం ఖర్మ! ఆ వూళ్లో అందరూ తరతరాలుగా కలిదిండి వారి కుటుంబం ముందు ‘‘చిత్తం’’ అంటూ బతుక్కుంటూ వస్తున్న వారే!-చినసూరపరాజు తన సంభాషణ కొనసాగించాడు:‘‘తనింక ముఫ్పైరోజుల్లో చనిపోతాననగా, కురుక్షేత్రంలో శవాలమధ్య కొనవూపిరితో బతికున్న భీష్ములవారు, ధర్మరాజులుంగారికి, ‘నస’ మానేసి పరిపాలన సంగతి చూడమని, నెత్తిమీద మొట్టిమరీ, రాజనే వాడు, ప్రజలనెలా పాలించాలో ఖండితంగా చెప్పాడు’’.‘‘ఆయ!?’’ అన్నాడు అబ్బులు ఆశ్చర్యాన్నీ, కుతూహలాన్నీ కలబోసి-‘‘పెద్దాయనకదండీ, కుటుంబానికీ!’’ అని కూడా కొస అందించాడు-‘‘అదికాదు అసలు రహస్యం. ఆయన సుక్షత్రియుడు’’ - అన్నాడు చినసూరపరాజు కళ్లు మెరుస్తూండగా-‘‘తమరు మాత్రం?’’ అన్నాడు అబ్బులు ఆ సమయంలో ఏమనాలో తెలియక!చినసూరపరాజు ఒక వెర్రి నవ్వు నవ్వాడు - ‘‘నేనే క్షత్రియుణ్ణయితే, ఇహ దేవుడు లేడు’’-ఆయన ‘గిలి’కి కారణం తెలియక మాట్టాడ కూరుకున్నాడు అబ్బులు.ఆయన మళ్లీ అందుకున్నాడు.‘‘ఈలోకం - అనగా - సమాజం ఉంది చూశావూ, ఇది దండనకి మాత్రమే లొంగివస్తుందట. 

స్వయంగా పరిశుద్ధంగా వుండే మనుషులుండడం దాదాపు అసంభవమన్నాడు. దండనకి భయపడ్డం వల్లనే మనుషులు నీతిగా వుంటారట!’’‘‘అదండీ మరి! చూస్తన్నాంగదండీ! ధర్నాలకీ, నిరాహారదీక్షలకీ, రాస్తారోకోలకీ, వినతిపత్రాలకీ, మీటింగుల్లో అరుపులకీ, అసెంబ్లీల్లో గలాటాలకీ, అభిప్రాయసేకరణలకీ, మానవహక్కుల సంఘాలకీ, సచ్చు సన్నాసి పబ్లికు ఇంటరెస్టు పిటిషన్లకీ, సమాచారహక్కు సట్టాలకీ, వరకట్న నిషేధాలకీ, ఫ్యామిలీ కోర్టులకీ - హోలు మొత్తంగా, ప్రెజా స్వామ్యానికీ - యెవ్వడూ భయపడ్డండి. ప్రెభుత్వంలో వున్నోడు మొదలు, ప్రజల సొమ్ము మింగేసిన ప్రతివోడూ - ‘నిరూపిస్తే రాజీనామాసేస్తా’నంటూ ప్రెకటనలండి! - ఎవుడూ నిరూపించకుండా జాగర్త పడగలమన్న ఎదవ ధీమా అండి - అలాక్కాక, నాలుగు తగల్నిచ్చి, సావుకి యెడితే, ప్రతీ వోడూ దిగొస్తారండి నాకొడు... ఒద్దండి, బూతు మాటలొస్తాయి...’’అక్కసు వెళ్లగక్కాడు అబ్బులు.‘‘అది గదీ! - ఇప్పుడు నువ్వు మండిపడ్డ మాటల వల్ల, బీష్ముల వారు సెలవిచ్చిన మరో మాటవల్ల, నేనేం చెయ్యాలో తెలిసింది!’’ - అన్నాడు చినసూరపరాజు.‘‘భీష్ములవారేవఁన్నారో!’’-చినసూరపరాజు, ఇందాక శాంతిపర్వంలోకి పోనిచ్చిన వేలుతో పాటు, ఆ పేజీ తీశాడు.‘‘ఇదిగో - శ్లోకం విను:వినశ్యమానం ధర్మం హియో 2 భిరక్షేత్‌ స ధర్మవిత్‌!న తేన ధర్మహాని స్స్యాత్‌మన్యుస్త న్మన్యు మృచ్ఛతి!!’’ -‘‘అర్థం చెప్పండి’’-‘‘దుర్మార్గుల వల్ల నశించిపోయే ధర్మాన్ని కాపాడినవాడే, ధర్మాన్ని తెలిసిన వాడు. అలా కాపాడే సందర్భంలో , హింస చెయ్యక తప్పదంటే, దాన్ని చేసే తీరాలి. ధర్మం తప్పినట్టు కాదు. అక్కడ తలెత్తిన క్రోథం, ఆ క్రోధాన్నే పొందుతుంది’’-