ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం దాని రంగేమిటి, రుచేమిటి, వాసనేమిటి అదుండే చోటెక్కడ, అది పండే చేనెక్కడ, ఎక్కడ, ఎక్కడ, కనపడని ఉద్యోగమెక్కడ, ఉద్యోగమ్మెక్కడ, ఉద్యోగం బెక్కడ - ఇక్కడ నిరుద్యోగ ప్రాణాలు, ప్రాణాల తోరణాలు, ఖాళీ పేగులమీద చమటపిండి ఆరవేసిన విశ్వవిద్యాలయాల పట్టాలు. ఆఫీసు గదిబయట కుర్చీల మీద ఆశ మిల్లు వాళ్ళ నూలుచొక్కాలు తొడుక్కుని యింటర్వ్యూ కార్డులు చేతబట్టుకుని వరుస సంఖ్యలో వందమందిపైగా కుర్రవాళ్ళు - చుట్టూ చూస్తే ఆశ... ఆశ... ఉద్యోగ పీఠం స్వంతమైనట్టు ఒక క్షణంలో, ఒక క్షణంలో కూచున్న బెంచీ కాళ్ళు విరిగి కూలిపోయినట్టు, మనిషి నిలువునా కాలిపోయినట్టు. ఎర్రలైటు వెలుగుతోంది బజర్ రింగు రింగున మోగుతోంది.జవాను స్ర్పింగు తలుపు తెరిచి పట్టుకొంటున్నాడు. షర్టు గుండీలు సరిజేసుకుంటూ అభ్యర్థులు లోనికెళుతున్నారు. ముఖానికి పట్టిన చెమట జేబురుమాళ్ళతో తుడుచుకొంటూ బయటికి వస్తున్నారు.
సంఖ్య తరిగిపోతూ వుంది. ఇక్కడ తరిగిన సంఖ్య బయట మళ్ళీ నిరుద్యోగ ప్రపంచంలో చేరిపోతూ ఉంది. సూర్యనారాయణరావు బి.ఏ. కార్డు నంబరు ముఫ్ఫైమూడు - సూర్యనారాయణగారూ’ జవాను అరిచాడు, తలుపుతెరిచి, సూర్యనారాయణ లోనికి దూకినప్పుడు ఆఫీసరు ప్రశ్నార్థకంగా చూసినప్పుడు సూర్యనారాయణ మెదడులో బట్టీవేసిన జనరల్ నాలెడ్జి గైడు. సినిమా డబ్బింగు ప్రాసెస్‌లో లూప్‌లా గిరగిరా అక్కడికక్కడే తిరిగినప్పుడు ఉత్తరమా, దక్షిణమా అనేదే ఆఫీసరు ప్రశ్నకి అర్ధమైనప్పుడు సూర్యనారాయణ తన మెరిట్ సర్టిఫికెట్లు టేబుల్ ముందు ప్లాట్‌ఫారం మీద న్యూస్‌పేపర్లలా పరిచినప్పుడు ఆఫీసరు ఒకటే మాటన్నాడు. ‘ఓ.కే. యుకెన్ గో’ వెంగళప్పలా నోట మాట రాక, నోటితో మాటాడలేక సూర్యనారాయణ గది బయట - బయట సూర్యనారాయణ, సూర్యనారాయణ లోపల సూర్యనారాయణకి చెమటపట్లి, చొక్కాతడిచి, కళ్ళు తిరిగి, పదోసారి, యాభయ్యోసారి, వందోసారి, నూటపాతికోసారి యింటర్వ్యూలతో పోరి పోరి, గింగరాలు తిరిగి తిరిగి, అలసి - ఒంటరిగా స్టూలుమీద కూలిపోయి సూర్యనారాయణ - జవాను స్టూలు మీద సూర్యనారాయణ, జవాను స్టూలుమీదే అయినా ఆహా! ఎంతహాయి.
ఆ ఉద్యోగం ఎంత సుఖం? నాలుగు జీతం రాళ్ళు రెండు ముద్దలు, ఒక గుడిసె, ఒక పెళ్ళాం, యిద్దరే పిల్లలు ఓహోహా! ఏం హాయి, ఏం హాయి. ఓయీ బిళ్ళ జవానూ! సుఖజీవివి, ధన్యుడవోయీ! కాలేజీ వదిలి మూడేళ్ళు, ఉన్నది రెండేకాళ్ళు ఉద్యోగం కోసం తిరిగి తిరిగి - రెండే కళ్ళు ఉద్యోగం కోసం వెదికి వెదికి - ఒకే గుండె ప్రాణం కోసం ఆడి ఆడి - యింట్లో (అది యిల్లా!) అమ్మా, నాన్నా, యధాప్రకారంగానే ఒక సోదరుడు, యిద్దరు చెల్లెళ్ళు అయ్యో బాధ, వేదన, అమ్మమ్మో పోటు, తీపి, సలుపు, అంతర్లోకాలలో రంగురంగుల దీపాలు, దీపాల నుంచి అనంతంగా కాంతికిరణాలు సూదులై, శూలాలై, అబ్బా శోధన, శోధన!