‘‘నేను రాలేను. నీకు తెల్సుగా నా కంపల్షన్స్‌’’ అని నవ్వాడు శివరాం. నేను ఒంటరిగానే బయలుదేరాను. ఆ సంఘటన జరిగి పదేళ్లయిందనుకుంటాను. మేమిద్దరమూ కలసి చదువుకొని ఏళ్లయినా మా స్నేహం చచ్చిపోలేదు. నేనే తీరికున్నప్పుడల్లా శివరాంకి ఫోన్‌ చేసేవాడిని. జడ్చర్లలో ఓ ప్రభుత్వ పాఠశాలలో నేను హెడ్‌మాస్టరుగా పనిచేస్తున్నాను. పెళ్లీడుకొచ్చిన కూతురుంది. పిల్లకేదో సంబంధంముందంటే నిజామాబాదు వచ్చాను. నిజామాబాదు వచ్చి వాడింట్లో దిగకపోతే వాడూరుకోడు. ఆ రోజుల్లో వాడు ఓ ఇంట్లో అద్దెకుండేవాడు. సంసారం హైదరాబాదు. పిల్లల చదువులవడం వల్ల ఇంకా ఫ్యామిలీని నిజామాబాద్‌కు షిఫ్ట్‌ చేయలేదు.మకాం మాత్రమే వాడింట్లో. వాడు మిగతా సాయం ఏదీ చేయడు. జిల్లా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో జడ్జి, న్యాయమూర్తులు సోషియలైజింగ్‌లంటే ఇష్టపడరు. ఏ పరిచయాలు ఏమి డిమాండ్‌ చేస్తా యనో అని వాళ్ల భయం. కనుక, నేను శివరాం సాయం లేకుండానే సదరు సంబంధం విషయంలో పిల్లవాడి తండ్రిని కలిసాను. ఆయన మంచి మనిషి. పిల్లను చూసుకోవడానికి రావల్సిందని ఆహ్వానించాను.‘‘మీరిప్పుడొస్తానంటే, ఇప్పుడొచ్చి మిమ్మల్ని తీసుకెళతాను’’ అని చెప్పాను. ఆడపిల్ల తండ్రిని కదా!ఆయన నవ్వి, ‘‘అలాంటి అవసరం లేదు. మేమే వస్తాం. వచ్చే ముందు మీకు ఫోన్‌ చేస్తాను’’ అని అన్నారాయన. తిరిగి వస్తుంటే ఆయనడిగారు ‘‘ఎక్కడ దిగారు?’’ అని.చెప్పాను.

‘‘ఆయనా! ఏమనుకోకండి. మహా గట్టి మనిషి. నిందితులు మళ్లీ అలాంటి చర్యలకు పాల్పడకుండా శిక్ష వెయ్యడంలో కర్కోటకులని పేరు తెచ్చు కున్నారు ఆయన’’ అన్నారు నవ్వుతూ.నేను నవ్వాను. ఆయన సహృదయత నన్నెంతో ఆకట్టుకుంది. ఆ మాట నేను శివరాంతో అనలేదు. నొచ్చుకుంటాడేమోననుకున్నాను. పనయిపో యింది కనుక వెళ్లిపోతానని అంటే, శివరాం నన్ను వెళ్లనివ్వలేదు. ‘‘రేపు శనివారం. కోర్టయ్యాక నేనూ హైదరాబాద్‌ వస్తాను. ఇద్దరం కలిసి రేపు సాయం త్రం హైదరాబాద్‌ వెళదాం. రాత్రికి మా ఇంట్లో వుందువు గాని. ఆదివారం పొద్దున్నే బయల్దేరి జడ్చర్ల వెళుదువు గాని’’ అన్నాడు శివరాం.వాడలా అన్నాడంటే అది కోర్టు వారంటే. కాదంటే శివరాంకి కోపం కూడా వస్తుంది. మార్చి నెల, అప్పటికే ఎండలు ముదురుతున్నాయి. సాయంత్రం వేళ అలా వ్యాహ్యాళికి బయలుదేరాం ఇద్దరమూ. ‘‘ఇదివరకు లేని అధికార స్వరం వినిపిస్తోందిరా నీ మాటల్లో’’ అన్నాను.‘‘మరేం చేయను! దుర్మార్గుల్ని, దొంగల్ని, రేపిస్టులని చూసిన కళ్లకు సమాజం అంతా కుళ్లిపోయినట్లు కనిపిస్తోంది. ఆ భావనే నీకు అధికార స్వరంలా విన్పిస్తున్నట్లుంది. మళ్లీ మరొకడు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడకుండా డిటర్రెంట్‌ పనిష్మెంట్‌ వుండాలి. అప్పుడు మాత్రమే మనం ఈ దుర్మార్గులను కొంత మేరకైనా నిరోధించగలం’’ అన్నాడు శివరాం.