ఇంట్లో అడుగు పెడుతూనే బాంబులాంటి వార్త వినాల్సొస్తుందని అనుకోలేదతను. కోడలు చెబుతున్నది విని అదురుపాటులో చాలాసేపు వుండిపోయాడు యాభై ఏళ్ళ ఖాసిం.‘‘ఎపడొచ్చి పొయినాడు?’’ కాసేపటికి తేరుకుని అడిగాడు.‘‘పొద్దున్నే. మీరింట్లోనించి పోయినాక’’ సమాధానమిచ్చింది కోడలు ఫాతిమా.ఈ విషయంలో మామయ్య పరిస్థితీ, వినబోయే భర్త పరిస్థితీ ఎలా వుండబోతుందో ముందే ఊహించిందామె. ఖాసిం ముఖ కవళికల్లో కన్పిస్తున్న ఆందోళన ఆ విషయాన్ని రుజువు చేసింది.బక్కగా, పలచగా, కన్నులు పీక్కుపోయి ముసలితనం బాగా కనిపించే ఖాసిం ముఖం ఇపడింకా పాలిపోయి వుంది.జరగకూడనిదేదో ఖాసింకు జరిగినట్టు ఇట్టే అర్థమౌతుంది. అతన్నలా చూస్తే!ఫాతిమాకు అతన్ని చూసి ‘పాపం’ అనిపించింది.‘‘ఇపడంటే ఇపడు కొంప ఎట్లా ఖాళీ చేస్తామో నువ్వడగల్యా?’’ మళ్ళీ ప్రశ్నించాడామెను ఖాసీం.‘‘ఎందుకడగల్యా. ఈ ఇల్లు పగలగొట్టి ఈడ్నే కొత్త మిద్దెలు బేస్తాడంటా. అందుకే ఖాళీ చేయమంటాన్నాడు. ఐదు రోజుల్లో ఖాళీ చేయమని చెప్పినాడు’’ అందామె.‘‘ఐదు రోజుల్లో’’ అన్న మాట ఖాసీంకు ఇంతా ఇబ్బందికి గురిచేసింది. ఇంటి ఓనరు రహంతుల్లా మీద కోపం సర్రున లేచింది.ఇంత తక్కువ సమయంలో ఇల్లు చూసుకోవడం అంత సులువు కాదు.ప్రొద్దుటూర్లో ఇల్లు దొరకడం ఒక ఎతై్తౌతే బాడుగ కట్టడం ఒక ఎత్తు. ఖాసీం లాంటి సన్నప్రాణాన్ని ఇంకా సన్నబార్చే సంగతిది. అన్నింటికంటే మించి ఆ ఇంటితో ఖాసింకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ఆ అనుబంధం ఎంత గాఢమైందంటే ఖాసిం జీవితమంత! 

‘‘ఇంటి ఓనరు రహంతుల్లా చానా కటువైన మనిషి. ఆయప్పతో ఎట్లా మాట్లాడాలబ్బ? ఎట్లా మాట్లాడితే ఆయప్ప నన్నూ, నా గోడునూ పట్టించుకుంటాడూ? ఇంటిబాడుగ ఇయ్యడం ఒకటీ రెండ్రోజులు ఆలస్యమైతేనే మీద పడి కరుస్తాడే.. అట్లాంటోడి చెవులకు నా మాటలు ఆన్తాయా? నా బాధ తెలుస్తాదా? ఎన్ని ఏండ్లయ్యింది ఈ ఇంట్లో చేరి! ఎపడో చిన్నపడు అమ్మ నాయన్తో సొంతూరు ఇడిసిపెట్టి ఈడికొచ్చినాం. అపడు తనకు అయిదేళ్ళు. బతుకుతెరువు ఎతుక్కుంటూ చానా కుటుంబాలు వనిపెంట ఇడిసిపెట్టి ప్రొద్దుటూరొచ్చినాం. అంతా కాయాకష్టం చేసుకునేటోళ్ళమే. అప్పట్నించి ఈ ఇంట్లోనే మేం బతికినాం. కష్టాలో.. నష్టాలో.. బాధలో.. కన్నీళ్ళో.. భరించినాం. ఇన్నేళ్ళకు ఇట్లా నడిమధ్యాన ఇల్లొదిలి పోవాల్సొస్తుందని ఏ పొద్దూ అనుకోలా’’ అంతరంగంలో సుడులు తిరుగుతున్న దుఃఖం ఖాసిం కళ్ళనుంచి కన్నీళ్ళలా బయటపడింది.మామయ్య మౌనంగా వుండడం గమనించి ఖాసిం లోలోపల ఎంత బాధపడుతున్నాడో అర్థమైంది ఫాతిమాకు.ఖాసిం ఆ ఇంట్లో అడుగుపెట్టినపడు అదొక బోదకొట్టం. అతడి తండ్రి ఖాసింకు యుక్తవయసు వచ్చేనాటికి ఆ పాకను సిమెంటు రేకులతో కప్పి ఇళ్ళనిపించి ఖాసిం పరం చేశాడు. ఆ పాకను ఖాసిం తండ్రి రహంతుల్లా తండ్రి నుంచి ఇరవై రూపాయల అద్దెకు తీసుకున్నట్టు చాలా సందర్భాల్లో అనేవాడు ఖాసీంతో. ఆ అద్దె ఇపడు ఆరొందలైంది.