రంగనాథం పార్కుకి వెళ్లేసరికి ఆ మిగతా ముగ్గురూ ఓ మూల సిమెంట్‌ బెంచీ మీద కూర్చుని వున్నారు. సూర్యుడు పడమటి కొండల్లో విశ్రాంతి తీసుకోవడానికి ఆయత్తమవుతున్నాడు. ఆకాశంలో ఆ దిక్కున కుంకుమ ఆరబోసినట్లుంది. అయిదున్నరకు అటో ఇటో ఆ నలుగురూ ఆ బెంచీ మీదకు చేరుకుంటారు. నలుగురూ వేరు వేరు చోట్ల ఉద్యోగాలు చేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రభాకరరావు, మూర్తి ఇద్దరూ పక్కపక్క ఇళ్లవాళ్లు కలిసే వస్తారు. ‘‘ఈ రోజు నేను తొందరగా వెళ్లిపోవాలి. అసలు రాకూడదనే అనుకున్నాను. కానీ ఆరునెలలుగా వస్తున్నానుగా, టైము అయ్యేసరికి కాళ్లు ఇటు పయనమయ్యాయి’’ అన్నాడు మూర్తి. ‘‘మా కోడలు ఆనపకాయ తెమ్మంది’’ ఎందుకు తొందరగా వెళ్లాలో కారణం చెప్పారు.వాళ్ల పిల్లలు బుద్ధిమంతులు. తల్లిదండ్రుల మీద గౌరవం వున్నందువలన వృద్ధాశ్రమంలో చేరవలసిన అవసరం ఏ ఒక్కరికీ రాలేదు. వాళ్లు మాట్లాడు కోవడానికి విషయాలకేం కొదవలేదు. రాజకీయాల జోలికి వెళ్లరని కాదు. అయితే ఆ విషయాల గురించి పెద్దగా చర్చించరు. జీవితంలో వారి వారి అనుభ వాలను మాత్రం చెప్పుకుంటారు.‘‘మీలో ఎవరైనా కాశీకి వెళ్లారా?’’ ప్రశ్నించాడు చలపతి. అతను ఆ విషయం ఎందుకెత్తాడో మూర్తికి అర్థం కాలేదు. బహుశా తన కాశీ యాత్ర విషయం చెప్పాలనుకుంటున్నాడేమో అనుకున్నాడు మూర్తి. 

‘‘నేను ఉద్యోగం చేస్తున్నంత కాలం తీర్థ యాత్రలకు వెళ్లడం కుదరలేదు. మీరు నాకు పుస్తె కట్టేరా? లేక ఆఫీసుకి పుస్తె కట్టేరా? అని సాధించేది నా భార్య. నిజం చెప్పాలంటే నేను కాశీయే కాదు తిరుపతి కూడా వెళ్లలేదు’’ అన్నాడు మూర్తి.‘‘నాకు భాష రాదు. అందుకే ఉత్తర భారత యాత్రలకు వెళ్లలేదు. అయితే తిరుపతి నాలు గైదు సార్లు వెళ్లి వుంటాను’’ అన్నాడు ప్రభాకర రావు. అలా అడిగింది చలపతి కాకుండా వేరెవరో అయి వుంటే వెళ్లానో, లేక వెళ్లలేదు అనో ముక్తసరిగా చెప్పి వుండేవాడు. ఆయన చాలా పరిమితంగా మాట్లాడతాడు.చలపతి ఎలా చెప్పాలా? ఏమని చెప్పాలా? అని ఓ క్షణం ఆలోచించాడు. ‘‘ఇప్పుడు నా వయ స్సెంత వుందో, నా చిన్నప్పుడు మా నాయనమ్మ వయసు అంత వుండేది. నేను ఆరేళ్లవాడిననుకుం టాను.’’ వాళ్ల స్పందన ఎలాగుంటుందోనని వాళ్ల ముఖాలు చూశాడు. చలపతి టూకీగా చెప్తాడు కదా అని మూర్తి ‘‘నీ చిన్ననాటి ముచ్చట చెపుతున్నావా? తొందరగా చెప్పు’’ అన్నాడు.‘‘మూర్తీ! ఇంటి నుంచి బయలుదేరుతూ ఆనపకాయ కొనాలన్నావు.’’‘‘ఔను! ఆనపకాయకు కాశీయాత్రకు ఏమిటి సంబంధం? నువ్వు అక్కడ ఆనపకాయ వదిలేశావా?’’