కొద్దిరోజులపాటు తొలకరి జల్లు కురిసింది. వర్షపు నీరు భూమిలో ఇంకిపోయినా చెరువులు, మడుగుల్లో కొద్ది నీరు నిలిచి ఉంది. వర్షాభావం కారణంగా ప్రభుత్వం చేపట్టిన కరువు నివారణ చర్యలు ఆపేశారు. ఇంకా వ్యవసాయం పనులు మొదలు కాలేదు. పల్లెలో జనాలకు పనులేం లేవు. ఇంతవరకు ప్రభుత్వ పనుల వల్ల శ్రామికులకు కూలీ రూపంలో గోధుమలు లభించేవి. ఇప్పుడు అదీ లేదు. చాలామంది ఇళ్ళల్లో ఇంకా గోధుమలు మిగిలి ఉన్నాయి. కాని బతకడానికి ధాన్యం ఒక్కటే చాలదు కదా. మిగతా అవసరాలు తీరాలంటే డబ్బు కావాలి.గంపెడు సంతానానికి తండ్రి అయిన అమర్తీయా కొద్దిరోజుల నుంచి పని లేకపోవటంతో జబ్బు మనిషిలా కనిపిస్తున్నాడు. గడ్డం మాసిపోయింది. ముఖం పీక్కుపోయింది. అతని వయస్సు నలభై ఏళ్ళే అయినా రోజూ పొలాల్లో బండ చాకిరీ చెయ్యటం, సరైన తిండి లేక అకలి చంపుకోవటానికి బీడీలు తాగటం వల్ల అరవై ఏళ్ళ ముసలివాడిలా కనిపిస్తున్నాడు.అతని భార్య ఏడోసారి గర్భవతి అయింది. నెలలోగా కాన్పు జరగొచ్చు. ఈ స్థితిలో ఆమె ఇంటి పనులు చేసుకోగలదుగానీ బయటికి వెళ్ళి కూలీ పని చెయ్యలేదు. అమర్తీయాకి ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుళ్ళు ఉన్నారు. పెద్దకూతురు కమలీ వయస్సు పన్నెండేళ్ళు. కమలీ ఇంటిపనుల్లో తల్లికి సాయం చేస్తుంది.భార్య కాన్పుకు అన్ని ఏర్పాట్లు చేయాలంటే డబ్బు కావాలి. ఇదే దిగులుతో అమర్తీయా రాత్రంతా నిద్రపోలేదు. పైగా నిన్న రాత్రి అతను భార్యతో పోట్లాడి తిండి తినకుండా పడుకున్నాడు. 

ఉదయం లేవగానే ‘ఎక్కడ పని వెదకాలి?’ ఆని ఆలోచనలో పడ్డాడు.అప్పుడే కమలీ పరుగెత్తుకుంటూ వచ్చి ‘‘నాన్నా, నాన్నా చిన్నోడికి జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది’’ అంది ఆందోళనగా.అమర్తీయా కంగారుపడ్డాడు. నిన్నటి నుంచే పిల్లవాడికి జ్వరం ఉంది. డబ్బులేక మందులు తీసుకురాలేదు. జ్వరం దానికదే తగ్గిపోతుందనుకున్నాడు. అమర్తీయా లోపలికివెళ్ళి పిల్లవాడిని ఎత్తుకున్నాడు. వాడి శరీరం వెచ్చగా తగిలింది. పిల్లవాడు ఏడుపు లంకించుకున్నాడు. హకరీ వంటింట్లోంచి పరుగెత్తుకొచ్చి భర్త చేతుల్లోంచి పిల్లవాడిని లాక్కుంది. ఒడిలో పడుకోబెట్టుకుని పిడికిట్లో వున్న మొక్కజొన్న గింజలతో వాడికి దిష్టితీసి గింజల్ని తన కొంగున కట్టుకుంది. అమర్తీయా ఆమె దగ్గరికొచ్చి పిల్లవాడిని తాకబోతే భర్తని కసిరికొట్టింది.‘‘వాడి శరీరం జ్వరంతో కాలిపోతుంటే ఇంకా చూస్తూ కూర్చున్నావా? వాడికిమందులు కావాలి. ఏదైనా పనిచేసి ఆ డబ్బుతో మందులు తీసుకురా. ఎన్నాళ్ళు పనీపాటా లేకుండా ఇంట్లో కూర్చుంటావ్‌?’’ అని తిట్టింది.భార్య మాటలకు ఆవేశపడ్డ అమర్తీయా తనలో తాను గొణుక్కుంటున్నట్టు అన్నాడు. ‘‘సర్కారీ పనులు ఆపేశారు. సేద్యం పనులు ఇంకా మొదలుకాలేదు. కొడుకు జబ్బుపడితే నాకు బాధగా ఉండదా? కాని పని లేకపోతే ఏం చెయ్యాలి? ఎక్కడికి పోవాలి? ఎక్కడి నుంచి డబ్బు తేవాలి?’’