బాగాదట్టమైన అడవి. మనిషన్నవాడు ప్రవేశించడానికి కూడా ఏ మాత్రం వీలుపడనంత దట్టంగా వుంది. రవ్వంత వెలుతురు కూడా చొరబడడం లేదు అడవిలోకి.అలాటి అడవిలో మరీ దట్టంగా మరీ దుర్గమంగా అవుపిస్తున్న చోట, ఒక మహావృక్షం క్రింద కూర్చొని ఎంతకాలం నుంచో తపస్సు చేసుకుంటున్నాడు యోగి. ఆయన తపస్సుని భంగం చెయ్యడానికి ఏ ఒక్కదేవుడూ, ఏ దేవతా ప్రయత్నం చెయ్యలేదు. ‘‘ఏదీ శాశ్వతం కాదు. అన్నిట్లోకి అశాశ్వతమైనది ఈ శరీరం. అన్ని కోరికలూ ఈ శరీరాన్ని అంటిపెట్టుకొనే వుంటాయి. శరీరమే మిగలనప్పుడు, కోరికలెంతకాలం నిలుస్తాయి! కైవల్యం అన్నది ఏదేనావుంటే, -- అదిన్నీ ఇష్టాఇష్టాలకీ, రాగద్వేషాలకీ, కాలగమనాలకీ, అన్నిటికీ -- అతీతంగా వుండే కైవల్యం అన్నది ఏదేనావుంటే, అది నాకు ఇవ్వడానికి వీలుంటే, దానిని నాకు ఇవ్వు. లేదంటే, ఈ శరీరం నశించేవరకు -- యిలాగే -- దేనికోసం తపస్సు చేస్తున్నానో స్పష్టంగా తెలుసుకోకుండానే, రోజులు గడిచి పోయేటట్టుచెయ్‌. ఈ శరీరం నశించేక ఏం జరుగుతుంది అన్నది నాకక్కర్లేదు’ అని సర్వాంతర్యామికి మనవి చేసుకుంటూ వుండే వాడు ఆ యోగి.కాలగమనంతో మరి ఎలా అలవాటైపోయిందో ఏమిటో, అతనికి ఆహారం, నిద్ర, దాహం లాంటి శారీరక తాపాలు లేకుండా పోయి, చెట్టుకీ, పుట్టకీ కూడా కదలికలు ఉంటాయి గాని, అతనిలో మాత్రం ఎటువంటి చలనం, ఎటువంటి మార్పూలేకుండా శిలసదృశ్యంగా ఉండిపోయేడు.ఇంతలో ఎందుకో దేవతలకి ఆడుకోవాలనిపించినట్టుంది, ఈతాపసితో, ఒకనాడు ఉదయాన్నే ఎవరూ ఊహించను కూడా ఊహించలేని సంఘటన ఒకటి జరిగింది. 

తెల్లవారుతోందేమో, ఎక్కడ్నుండో కొద్దిపాటి వెలుగువచ్చి ధ్యానంలో ఉన్న యోగిమీద పడుతోంది. అలాటి సమయాల్ని అతగాడు తన్మయత్వంతోనీ, భక్తితోనీ దర్శిస్తూ వుంటాడు. ఇంత అందమైన, ఇంత స్నేహపూర్వకమైన ప్రకృతిని మించిన దైవం ఇంకెవరైనా వుంటారా అని ఆశ్చర్య పడిపోతూ వుంటాడు కూడాను.కాని అతగాడు ఇవాళ సంభ్రమాశ్చర్యాలకు లోనుకావడానికి కారణం మరో సంఘటన. సరిగ్గా, అతగాడు కళ్లు తెరిచేటప్పటికి, ఎక్కడ నుండి వచ్చిందో, ఎలావచ్చిందో తెలీదుగాని -- అతగాడి వడిలో ఒక పసికందు వుంది. చూస్తున్నది అర్థం కాక, దిగ్ర్భాంతికి లోనయ్యాడు యోగి. ప్రపంచం నుండీ, మానవ సమాజం నుండీ ఎంతో కాలంగా దూరంగా వుండడం వల్ల, వొళ్లో వున్న బిడ్డని పోల్చుకోడమే కష్టమయింది అతగాడికి. ఏ తల్లి జంతువో ఓ చెట్టుమీంచి మరో చెట్టు మీదికి గెంతుతూ పొరపాటున జారవిడిచేసిన బిడ్డా ఇది? అలాగయితే, తల్లి జంతువు తక్షణం పరిగెత్తుకొస్తుంది కదా తన బిడ్డకోసం! కాని ఏ జంతువూ రావడం లేదే! ఈ విధంగా ఆలోచించిన మీదట. ఒకసారి ధ్యానంగా, ఆసక్తిగా పసికందుని పరిశీలించి చూశాడు. కొద్దిక్షణాలు అలా పరిశీలనగా చూసినమీదట, తన వడిలో వున్నది మానవ శిశువే అని అర్థమయింది యోగికి. పైగా శిశువు ఎంతో అందంగా, ఎంతో సుకుమారంగా, చిరునవ్వులు ఒలకబోస్తూ, వూసులు పోతోంది, అతని వడిలో -- మెత్తని పర్యంకం మీద పవళించి వున్నంత ఆనందాన్ని అనుభవిస్తూ.